పలమనేరు అసెంబ్లీ మహిళలకు రిజర్వ్ ?

పలమనేరు అసెంబ్లీ మహిళలకు రిజర్వ్ ?
ప్రశ్నార్థకంగా మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి భవిష్యత్తు
పలమనేరు నుండి ఆయన సతీమణి రేణుక రెడ్డి పోటీ
మళ్లీ పుంగనూరు నుండి అమర్నాథ్ రెడ్డి పోటీకి అవకాశం
జిల్లాలో మారుతున్న రాజకీయ సమీకరణలు
చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : పలమనేరు నియోజకవర్గం నుండి మూడు సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన నూతనకాల్వ అమర్నాథ రెడ్డికి నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ లో భాగంగా చిత్తూరు జిల్లాలోని పలమనేరు నియోజకవర్గం మహిళలకు రిజర్వ్ అవుతుందని ప్రాథమిక సమాచారం ద్వారా తెలుస్తుంది. చిత్తూరు జిల్లాలో మహిళా ఓటర్లు అత్యధికంగా ఉన్న నియోజకవర్గం పలమనేరు. దీంతో రానున్న ఎన్నికల్లో పలమనేరు నియోజకవర్గం మహిళలకు రిజర్వ్ అవుతుందని జోరుగా ప్రచారం జరుగుతుంది.
పలమనేరు నియోజకవర్గం మహిళలకు రిజర్వ్ అయితే మాజీమంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే అమర్నాథరెడ్డి రాజకీయ భవిష్యత్తు ఏమిటన్నది జిల్లాలో రాజకీయ వర్గాాలలో జోరుగా చర్చలు జరుగుతున్నాయి. పలమనేరు మహిళలకు రిజర్వ్ అయితే అమర్నాథ్ రెడ్డి సతీమణి రేణుకా రెడ్డి అక్కడ నుండి పోటీ చేసే అవకాశం ఉంది. అమర్నాథరెడ్డి తిరిగి పుంగనూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకు భావిస్తున్నారు.

అమర్నాథ్ రెడ్డి పుంగనూరు నుంచి పోటీ చేస్తే ఆయన పెద్దిరెడ్డికి గట్టి పోటీ ఇస్తారని భావిస్తున్నారు. పుంగనూరు నియోజకవర్గం కొత్త భాగం అన్నమయ్య జిల్లాలోనూ మరి కొంత భాగం చిత్తూరు జిల్లాలోని ఉంది. అమర్నాథ్ రెడ్డికి ఉమ్మడి జిల్లాలో మంచి పరిచయాలు ఉన్న కారణంగా రెండు జిల్లాల్లో కూడా పట్టు సాధించవచ్చనీ భావిస్తున్నారు. అమర్నాథ్ రెడ్డి పుంగనూరు నుండి రెండు సార్లు టిడిపి తరపున ఎం ఎల్ ఏ గా ఎన్నికయ్యారు. నియోజకవర్గాల పునర్ వ్యవస్థికరణ తరువాత ఒక సారి టిడిపి తరపున, మరో సారి వైసిపి తరపున ఎం ఎల్ ఏ గా ఎన్నికయ్యారు. ప్రస్తుతం పలమనేరు నుండి మూడో సారి టిడిపి తరపున ఎం ఎల్ గా ఎన్నికయ్యారు.
అమర్నాథ రెడ్డి గతంలో చంద్రబాబు మంత్రివర్గంలో పరిశ్రమల శాఖా మంత్రిగా పనిచేశారు. అమర్నాథ రెడ్డికి ఎటు పార్టీ అధినేత నారా చంద్రబాబు తో అటు పార్టీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో సన్నిహిత సంభందాలు ఉన్నాయి. రాజకీయ నేపథ్యమున్న అమర్నాథ్ రెడ్డి రాష్ట్ర తెదేపాలో, జిల్లా రాజకీయాలలో కీలకపాత్రను పోషిస్తున్నారు. అభ్యర్థుల ఎంపికలో కూడా కిలకపాత్రాబ్ పోషించారు. జిల్లా రాజకీయాలలో తనదైన ముద్ర వేస్తూ, నారా లోకేష్ పాదయాత్ర సమన్వయకర్త హోదాలో చురుగ్గా పాల్గొన్నారు.
లోకేష్ తో పాటు జిల్లా మొత్తం పాదయాత్ర చేశారు. అలాగే రాయలసీమ పార్టీ ఇన్ ఛార్జ్ హోదాలో రాయలసీమ జిల్లాల్లో కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు సన్నితంగా ఉంటూ, పలమనేరులో పార్టీకి తిరుగులేని నేతగా చలామణి అవుతున్నారు. పెద్దపంజాణి మండలం కెలవాతి గ్రామానికి చెందిన అమర్నాథరెడ్డి డబుల్ హ్యాట్రిక్ వీరుడు, ఓటమి ఎరుగని ధీరుడు నూతన కాలువ రామకృష్ణారెడ్డి తనయుడు.
నూతన కాలువ రామకృష్ణారెడ్డి 1985 నుంచి వరుసగా మూడు పర్యాయాలు పుంగనూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1996లో రామకృష్ణారెడ్డి చిత్తూరు పార్లమెంటు సభ్యుడిగా ఎన్నిక కావడంతో అమర్నాథ్ రెడ్డి ఎన్నికల్లో పుంగనూరు నుండి టిడిపి అభ్యర్థిగా గెలుపొందారు. ఇలా అమర్నాథ్ రెడ్డి ఉహించని విధంగా ఉప ఎన్నికతో ఎం ఎల్ ఏ గా ఎన్నికయ్యారు. ఆనాటి నుండి ఈ నాటి వరకు జిల్లా, రాష్ట్ర స్తాయిలో తిరుగులేని ప్రజా నాయకుడిగా రాణిస్తున్నారు.
రెండు సంవత్సరాలు పార్టీని వీడినా తిరిగి పార్టీలో చేరి మంత్రి స్తాయికి ఎదిగారు. నూతనకాల్వ అమర్నాథరెడ్డి నరనరాన తెలుగుదేశం పార్టీ రక్తం ప్రవహిస్తోంది. అయన, అయన కుటుంబం తెలుగుదేశం పార్టీకి అంకితం అయ్యారు. అమర్నాథ్ రెడ్డి 1985 నుండి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా కొనసాగుతున్నారు. 1985లో తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడిగా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు. అనంతరం రెండు పర్యాయాలు మండల పార్టీ అధ్యక్షుడిగా పనిచేశారు. 1986లో అమర్నాథరెడ్డి గ్రామ సర్పంచిగా ఎన్నికయ్యారు.
రెండు పర్యాయాలు సర్పంచ్ గా పనిచేసిన మర్నాథరెడ్డి మరో రెండు పర్యాయాలు పెద్దపంజాణి మండల తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశారు. 1995లో జిల్లా సహకార కేంద్ర బ్యాంక్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. 1996లో జరిగిన పుంగనూరు ఉప ఎన్నికలలో టిడిపి తరఫున శాసనసభ్యుడిగా గెలుపొందారు. 1999లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీధర్ రెడ్డి చేతిలో ఓటమిపాలైనా, 2004లో తిరిగి పుంగనూరు నియోజకవర్గం నుండి టిడిపి ఎం ఎల్ ఏ గా విజయం సాధించారు. 2000 నుండి 2007 వరకు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశారు.
2007 నుంచి 2012 వరకు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ తరువాత 2009లో పలమనేరు నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా సాధించారు. 2012లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అమర్నాథరెడ్డి 2014 ఎన్నికలలో పలమనేరు నుండి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సుభాష్ చంద్రబోస్ మీద విజయం సాధించారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందినా, ప్రతిపక్షంలో ఉన్న ఆ పార్టీలో ఇమడలేక తిరిగి 2016లో తెలుగుదేశం పార్టీలో చేరారు.
తెలుగుదేశం పార్టీలో చేరి రాష్ట్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రిగా చంద్రబాబు మంత్రివర్గంలో కొనసాగారు. 2019 ఎన్నికలలో వీచిన వైసిపి గాలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెంకటే గౌడ చేతిలో అమర్నాథ్ రెడ్డి ఓడిపోయారు. అమర్నాథరెడ్డి ఓటమిపాలైన తెలుగుదేశం పార్టీకి అంకితభావం కలిగిన కార్యకర్తలా పనిచేస్తున్నారు. ఎన్నికల ముందు వరకు పార్టీ ప్రధాన కార్యదర్శి హోదాలో జిల్లా మొత్తం సమన్వయం చేశారు. జిల్లాలోనే కాకుండా రాయలసీమ మొత్తం పర్యటిస్తూ పార్టీని బలోపేతం చేశారు. ఆందోళన కార్యక్రమాలలో పాల్గొంటూ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేశారు.
అమర్నాథరెడ్డికి జిల్లాలో ప్రజల మనిషిగా మంచి పేరు ఉంది. ఆయన అభిమానులు ఆయనను అమరన్న అని అభిమానంగా పిలుచుకుంటారు. అమర్నాథ్ రెడ్డి నిత్యం ప్రజలతో మమేకమవుతూ, ప్రజలకు అందుబాటులో ఉంటారు. సామాన్య కార్యకర్తను సైతం పలకరిస్తూ పార్టీలో ఉత్సాహం నింపుతున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మంత్రి పదవి రాకపోవడంతో అమర్నాథరెడ్డి జిల్లా రాజకీయాలలో క్రియాశీలకంగా లేరు. తన నియోజకవర్గానికి మాత్రమే పరిమితమయ్యారు. జిల్లా స్థాయిలో జరుగుతున్న జిల్లా పరిషత్, డిఆర్సి సమావేశాలకు సైతం హాజరు కావడం లేదు.
