Research | ఇస్రోలో జూనియర్ రీ సెర్చ్ స్కాలర్‌గా ముత్యాలరావు…

Research | ఇస్రోలో జూనియర్ రీ సెర్చ్ స్కాలర్‌గా ముత్యాలరావు…

Research | దమ్మపేట, ఆంధ్రప్రభ : దమ్మపేట మండల పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మల్కారం పూర్వ విద్యార్థి కొవల ముత్యాలరావు జేఎన్టీయూ హైదరాబాద్ నందు పోస్టు గ్రాడ్యుయేషన్ మెకానికల్ ఇంజనీరింగ్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించి ,తద్వారా ఇస్రో తిరువనంతపురం నందు జూనియర్ రీసెర్చ్ స్కాలర్ గా ఎంపికయ్యారు. భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో ) తిరువనంతపురంలో గల విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రం (వి ఎస్ ఎస్ సి) నందు జూనియర్ రీసెర్చ్ స్కాలర్ (జే ఆర్ ఎఫ్)గా ఎంపికైన, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మల్కారం పూర్వవిద్యార్థి కొవల ముత్యాలరావును పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు, ఉపాధ్యాయినీ ఉపాధ్యాయులు మంగళవారం అభినందనలతో ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు ఆర్. మారెమ్మ మాట్లాడుతూ ముత్యాలరావుకు శుభాకాంక్షలు తెలియజేసి విద్యార్ధినీ, విద్యార్థులు ముత్యాలరావు ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా నాటి ఉపాధ్యాయులు బయ్యా నాగేశ్వరరావు ఇటువంటి విద్యార్థికి గురువులుగా ఉన్నందుకు గర్వంగా ఉందన్నారు . సీనియర్ ఉపాధ్యాయురాలు శ్యామలదేవి మాట్లాడుతూ చదువు వలన మనిషికి విలువ పెరుగుతుందని, ముత్యాలరావును ఆదర్శంగా తీసుకుని పట్టుదలతో చదువుకుని లక్ష్యాలు సాధించాలని సూచించారు. ముత్యాలరావు మల్కారం గ్రామంలో పుట్టిన మట్టిలో మాణిక్యం అని భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకుని గ్రామానికి, తల్లిదండ్రులకు, గురువులకు మంచిపేరు తీసుకురావాలని , అందరికీ ఆదర్శంగా నిలవాలని అన్నారు .పలువురు పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు అభినందనలు తెలియచేసారు.

అభినందించిన వారిలో ఈశ్వర్ రెడ్డి, నాగాచారి, రామకృష్ణ, శ్రీనివాసరావు, ప్రియదర్శిని, సునీత, లావణ్య, వెంకటేశ్వరరావు, భద్రం ఉన్నారు. ఈ సందర్భంగా కొవల ముత్యాలరావు మాట్లాడుతూ మల్కారం పాఠశాలలో ఏర్పడిన బలమైన పునాది కారణంగానే జేఎన్టీయూ హైదరాబాద్ యూనివర్సిటీ నందు ఎంటెక్ పోస్టు గ్రాడ్యుయేషన్ లో గోల్డ్ మెడల్ సాధించడం జరిగిందని, తద్వారా ఇస్రోలో జూనియర్ రీసెర్చ్ స్కాలర్ గా అవకాశం వచ్చిందని తెలిపారు .

తాను ఎంతో కష్టపడి చదివి ఈ విజయం సాధించడం జరిగిందని ఈ సందర్భంగా తన తల్లిదండ్రులకు, గురువులకు, మామయ్య వీరయ్య కు కృతజ్ఞతలు తెలియజేశారు. మరీ ముఖ్యంగా నాన్నమ్మ అమ్మమ్మలు ఎంతో ప్రోత్సాహంచే వారని ఇదే పాఠశాలలో వారు స్వీపర్ గా పనిచేస్తూ తనను చదివించిన వారి కష్టాన్ని మరువలేనని వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు. భవిష్యత్తులో విద్యార్ధిని, విద్యార్థులు అభివృద్ధి కొరకు తనవంతు కృషి చేస్తానని తెలియచేశారు.

Leave a Reply