Regonda | నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

Regonda | నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్
Regonda | రేగొండ, ఆంధ్రప్రభ : రేగొండ మండలంలోని రేగొండ, గూడేపల్లి గ్రామ పంచాయతీలలో ఏర్పాటు చేసిన రెండవ సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికల మొదటి విడత నామినేషన్ కేంద్రాలను కలెక్టర్ రాహుల్ శర్మ (Rahul Sharma) పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. నామినేషన్ల ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా సాగేందుకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎన్నికల సంఘం నిబంధనలను కచ్చితంగా పాటించాలన్నారు. అభ్యర్థులకు సమాన అవకాశాలను కల్పించాలని, అలాగే నామినేషన్ కేంద్రాల వద్ద క్రమశిక్షణ, శాంతియుత వాతావరణం ఉండేలా చూడాలని ఆదేశించారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తక్షణం స్పందిస్తూ సమన్వయం చేసుకోవాలని కలెక్టర్ (Collector) సూచించారు. మొదటి విడత నామినేషన్లకు 29వ తేదీ చివరి రోజు కావడంతో అభ్యర్థులు పెద్ద సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేసే అవకాశం ఉంటుందని అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. నామినేషన్ పత్రాలు అధికంగా ఉంచాలని, నామినేషన్లు వెంట వెంటనే స్కాన్ చేసి ఎన్నికల సంఘానికి పంపించేందుకు జి.పి.ఓ లను అదనపు సిబ్బందిగా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
నామినేషన్ (nomination) దాఖలు చేసే అభ్యర్థులు ఖచ్చితమైన ధ్రువపత్రాలతో నామినేషన్ కేంద్రాలను సంప్రదించాలని, సహాయతకు హెల్ప్ డెస్క్ ను సంప్రదించాలని స్పష్టం చేశారు. అభ్యర్థి ఎన్నికల ఖర్చు వివరాల నమోదుకు ప్రత్యేక బ్యాంక్ ప్రారంభించాలని లావాదేవీలు కచ్చితంగా బ్యాంకు ఖాతా నుండి జరపాలని కలెక్టర్ పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో తహసీల్దార్ శ్వేత, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, రిటర్నింగ్ అధికారులు రవికుమార్, గిరిధర్, తదితరులు పాల్గొన్నారు.
