- ఆంధ్ర స్వచ్ఛ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్
- సిమెంట్ కంపెనీ యాజమాన్యాలతో ప్రత్యేక భేటీ
( ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో ) : పొడి చెత్త నుంచి తయారయ్యే ఆర్ డి ఎఫ్ ( రిఫ్యూజ్డ్ డేరైడ్ ఫ్యూయల్) ని కనీసం 15 శాతానికి తగ్గకుండా సిమెంట్ పరిశ్రమకి చెందిన కిల్న్స్ లో సిమెంట్ తయారీకి ఉపయోగించాల్సిందేనని ఆంధ్ర స్వచ్ఛ కార్పొరేషన్ చైర్మన్ కామారెడ్డి పట్టాభిరామ్ సూచించారు.
పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ పి .కృష్ణయ్య తో కలిసి ఆయన గురువారం సిమెంట్ కంపెనీల యజమానులతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… 2018 కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనల ప్రకారం సిమెంట్ కిల్న్స్ లలో వాడే బొగ్గు శాతాన్ని తగ్గించి దానికి బదులుగా కనీసం 15 శాతానికి తగ్గకుండా మునిసిపల్ ఘన వ్యర్దాల నుంచి వచ్చిన రిఫ్యూజ్డ్ డిరైవ్డ్ ఫ్యూయల్ ని సిమెంట్ తయారీకి వినియోగించాలని చెప్పారు.
ఏపీలో ఉన్న 123 అర్బన్ లోకల్ బాడీస్ నుంచి దాదాపు ప్రతి రోజు 7 వేల టన్నుల చెత్త వస్తుందని, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన చెత్తని కూడా కలుపుకుంటే అది మరిన్నివేల తన్నులు అవుతుందన్నారు. ఆలా వచ్చిన చెత్తని ఏ రోజు కారోజు ప్రాసెస్ చేసి రాష్ట్రంలో డంపింగ్ యార్డ్ అనేది లేకుండా చేయాలనే చంద్రబాబు సంకల్పించిన ఉద్యమానికి సిమెంట్ కంపెనీ ల యాజమాన్యాలు కూడా తమ వంతు సహకారం అందించాలన్నారు.
సిమెంట్ తయారీలో ఈ ఆర్డిఎఫ్ ని ఉపయోగించడంతో పాటు దశల వారీగా వాడకం శాతం కూడా పెంచాలని కోరారు . అందులో భాగంగా మొదటి సంవత్సరం 6 శాతం ఆర్డిఎఫ్ ని అన్ని సిమెంట్ కంపెనీ లలో వాడాలని అలాగే రెండవ సంవత్సరం దానిని 10 శాతానికి పెంచాలని, మూడవ సంవత్సరం 15 శాతంని సిమెంట్ తయారీలో వినియోగించాల్సిందేనని స్పష్టం చేశారు.
ప్రపంచంలో ఉన్న పలు దేశాలలో ఉన్న సిమెంట్ పరిశ్రమలలో ఆర్డిఎఫ్ వాడకం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నారని, యూరోపియన్ పరిధిలో వాడకం 44 శాతం ఉండగా, యు ఎస్ ఏ లో దాదాపు 20 శాతం ఉందని, మన దేశం లో మన రాష్ట్రం లో కూడా ఆర్ డి ఎఫ్ శాతం పెంచడం కోసం సిమెంట్ కంపెనీలు చొరవ చూపించాలని తెలిపారు.
రాష్ట్రంలో ఉన్న సిమెంట్ కంపెనీ లు సిమెంట్ తయారీలో ఆర్ డి ఎఫ్ వాడకం పెంచడం కోసం ఒక జాయింట్ టెక్నికల్ కమిటీ ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని, ఈ కమిటీ లో సిమెంట్ కంపెనీ యాజమాన్యాలు నుంచి కొంతమంది ప్రతినిధులు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి అలాగే స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ నుంచి కొంతమంది ప్రతినిధులు భాగస్వాములు అవుతారని ప్రకటించారు. ఈ సమావేశంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 23 సిమెంట్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.