పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి…

పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి…
ఉరవకొండ రూరల్, ఆంధ్రప్రభ : పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని ఉరవకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆదినారాయణ పిలుపు నిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న స్వర్ణాంధ్ర -స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ ఎస్ ఎస్ ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర -స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఆదినారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యర్థరహిత సమాజం అనే అంశంపై ఉపనిశిస్తూ వ్యర్థరహిత సమాజం అంటే ముఖ్యంగా ఉత్పన్నమయ్యే వ్యర్ధాలు తగ్గించడం.
తిరిగి ఉపయోగించడం, రీసైక్లింగ్ ద్వారా చెత్తను భూమిలో పాతి పెట్టకుండా లేదా కాల్చకుండా పూర్తిగా నివారించడం వల్ల పర్యావరణ పరిరక్షణను కాపాడవచ్చని తెలిపారు. అంతేకాకుండా వ్యర్థరహిత, జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా మనం పర్యావరణానికి జరిగే హానిని నిరోధించి, భావితరాలకు మెరుగైన భూమిని అందించవచ్చని తెలిపారు. అలాగే ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ప్రజలు, విద్యార్థులు కలసికట్టుగా ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి, శుభ్రమైన పర్యావరణం కోసం కృషి చేయాలన్నారు.
అనంతరం అధ్యాపకులు, విద్యార్థులతో స్వచ్ఛ ఆంధ్ర -స్వర్ణాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ మస్తానప్ప, ఎన్.ఎస్.ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ పరమేష్, ఫిజిక్స్ అధ్యాపకులు డాక్టర్. రాజేష్ ,అర్థశాస్త్ర ఉపన్యాసకులు డాక్టర్ అయ్యన్న, హిందీ అధ్యాప కులు డాక్టర్ కృష్ణవేణి, ఆంజనేయులు, డాక్టర్ రమేష్ బాబు, నీలి వెంకటేశులు, నాగేంద్ర, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
