STUDENTS FIRE కళ్లకు గంతలతో నిరసన Andhra prabha news

STUDENTS FIRE కళ్లకు గంతలతో నిరసన Andhra prabha news
రూసా నిధులు, టెండర్లలో అక్రమాల ఆరోపణలు
వైస్ చాన్సలర్ పాత్రపై అనుమానాలు
రిజిస్ట్రార్ తొలగింపుకు డిమాండ్
రాయలసీమ వర్సిటీలో విద్యార్థి సంఘాల ఆందోళన
( కర్నూలు బ్యూరో , ఆంధ్రప్రభ)
రాయలసీమ యూనివర్సిటీలో అవినీతి, అక్రమాలు పెరిగిపోయాయని ఆరోపిస్తూ రిజిస్ట్రార్‌ను వెంటనే పదవి నుండి తొలగించాలని ఏఐఎస్ఎఫ్, ఏఐఎస్ఏ, పిడిఎస్యు, ఆర్పిఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు సోమవారం విశ్వవిద్యాలయ పరిపాలన భవనం ముందు కళ్లకు గంతలు కట్టుకుని వినూత్న నిరసన చేపట్టాయి. అనంతరం వైస్ చాన్సలర్ క్యాంప్ కార్యాలయాన్ని ముట్టడించి ఆందోళనను ఉధృతం చేశాయి.

ఈ సందర్భంగా ఏఐఎస్ఏ రాష్ట్ర కార్యదర్శి నాగార్జున, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి ఎస్. శరత్ కుమార్, పిడిఎస్యు జిల్లా ఉపాధ్యక్షుడు రమణ కుమార్, ఆర్పిఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు నాగరాజు మాట్లాడుతూ యూనివర్సిటీలో రోజురోజుకు అవినీతి పెరుగుతోందని విమర్శించారు. యూనివర్సిటీలో జరుగుతున్న అక్రమాలు అధికారులకు కనిపించడం లేదా? లేక యూనివర్సిటీ ఖజానా పూర్తిగా ఖాళీ అయ్యే వరకు చూడరా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు.
రూసా నిధుల వినియోగం, కాన్వొకేషన్ బిల్లులు, టెండర్ల ప్రక్రియలో తీవ్ర అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ముందుగా పనులు పూర్తి చేసి తరువాత టెండర్ల నాటకం ఆడుతూ నచ్చిన వారికి కాంట్రాక్టులు కట్టబెట్టి కమిషన్ల దందా నడుపుతున్నారని విమర్శించారు. అర్హతలేని వారితో కొటేషన్లు వేయించి యూనివర్సిటీ నిధులకు గండి కొడుతున్నారని ఆరోపించారు. రిజిస్ట్రార్‌పై తరచూ వెలువడుతున్న వార్తలతో విశ్వవిద్యాలయ ప్రతిష్ఠ దెబ్బతింటోందని పేర్కొన్నారు.

గతంలో రిజిస్ట్రార్ పదవీకాలం ముగిసిన తరువాత కేవలం కాన్వొకేషన్ నిర్వహణ కోసమే కొనసాగిస్తున్నామని, అనంతరం పంపిస్తామని వైస్ చాన్సలర్ హామీ ఇచ్చారని, ఆ హామీ ఏమైందని ప్రశ్నించారు. ఈ వ్యవహారాలపై వైస్ చాన్సలర్ చూస్తూ చూడనట్లు వ్యవహరించడం వెనుక లోతైన సంబంధాలున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే రిజిస్ట్రార్‌పై సమగ్ర విచారణ జరిపి పదవి నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. లేదంటే తరగతుల బహిష్కరణ, నిరాహార దీక్షలు, రాస్తారోకోలు, జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీలు నిర్వహిస్తామని హెచ్చరించారు. అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి సంఘాలను ఐక్యం చేసి పోరాటాన్ని విస్తరింపజేస్తామని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర కార్యదర్శి సాయి, యూనివర్సిటీ నాయకులు మౌలాలి, రామ్, మధు, శీనాథ్, కిరణ్, తేజ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
