రిటైర్​మెంట్​ ప్ర‌క‌టించిన‌ ర‌విచంద్ర‌న్‌​ అశ్విన్​

ఆంధ్ర‌ప్ర‌భ వెబ్ డెస్క్ : భారత మాజీ క్రికెటర్‌ రవిచంద్రన్‌ అశ్విన్ (Ravichandran Ashwin) ఐపీఎల్‌కి కూడా వీడ్కోలు పలికాడు. ఇప్పటికే అన్ని ఫార్మాట్ల అంతర్జాతీయ క్రికెట్‌( International Cricket)కు రిటైర్మెంట్‌ ప్రకటించిన అశ్విన్‌, తాజాగా ఫ్రాంచైజీ లీగ్‌ నుంచి తప్పుకుంటున్నట్టు వెల్లడించాడు. ఈ మేరకు ఎక్స్​లో పోస్ట్ చేశారు. “ప్రత్యేకమైన రోజు ప్రత్యేకమైన ఆరంభం. ప్రతి ముగింపుకు ఒక కొత్త ఆరంభం ఉంటుంది. నా ఐపీఎల్ (IPL) క్రికెట్‌ కెరీర్‌ ముగిసినప్పటికీ, ఇకపై ప్రపంచ వ్యాప్తంగా వివిధ లీగ్‌లలో క్రికెట్‌ను కొత్త కోణంలో అన్వేషించే ప్రయాణం మొదలవుతోంది. ఇన్నేళ్లుగా గుర్తుండిపోయే జ్ఞాపకాలు, అనుబంధాలు అందించిన అన్ని ఫ్రాంచైజీలకు ధన్యవాదాలు. ముఖ్యంగా నాకు ఇచ్చిన అవకాశాలకుగాను ఐపీఎల్‌, బీసీసీఐ(BCCI)కి కృతజ్ఞతలు. ఇక ముందు ఉన్న కొత్త ప్రయాణాన్ని ఆస్వాదిస్తూ, దానిలో ఎక్కువ నేర్చుకోవడానికి ఎదురుచూస్తున్నా” అని అశ్విన్‌ రాసుకొచ్చారు.

అశ్విన్ ఐపీఎల్ కెరీర్ ఇలా..
అశ్విన్ తన ఐపీఎల్ కెరీర్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (Chennai Super Kings), పంజాబ్ కింగ్స్(Punjab Kings), ఢిల్లీ క్యాపిటల్స్(Delhi Capitals), రాజస్థాన్ రాయల్స్, రైజింగ్ పుణె సూపర్ జెయింట్ వంటి ఐదు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. పంజాబ్ జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు. మొత్తం 221 మ్యాచ్‌లు ఆడి 187 వికెట్లు పడగొట్టాడు. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో ఐదో స్థానంలో నిలిచాడు. బ్యాటింగ్‌లోనూ ఒక హాఫ్ సెంచరీతో సహా 833 పరుగులు సాధించాడు. చివరి సీజన్‌లో 9 మ్యాచ్‌ల్లో 7 వికెట్లు తీసి 33 పరుగులు చేశాడు.

Leave a Reply