దోపిడీ సమాజాన్నిబోనులో నిలబెట్టిన కథకుడు రావిశాస్త్రి

దోపిడీ సమాజాన్నిబోనులో నిలబెట్టిన కథకుడు రావిశాస్త్రి

  • వృద్ధుల కళ్యాణ రామారావు

కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : సాహిత్యం ద్వారానే సమాజం మార్పును సాధ్యం చేయగలమని నిరూపించిన మహోన్నత కథకుడు రావిశాస్త్రి అని ప్రముఖ సాహితీవేత్త వృద్ధుల కళ్యాణ రామారావు అభివర్ణించారు. ఆదివారం సాహితీ స్రవంతి ఆధ్వర్యంలో టీజీవీ కళాక్షేత్రంలో నిర్వహించిన రావిశాస్త్రి సాహిత్యం(Ravi Shastri Literature) – ఒక పరిశీలన సదస్సులో ప్రధాన వక్తగా ఆయన పాల్గొని మాట్లాడారు. రావిశాస్త్రి రచనలు సామాజిక అసమానతలు, దోపిడీ తత్వాన్ని స్పష్టంగా చూపించాయని, 81 కథల ద్వారా శ్రామిక వర్గం సమస్యలను వెలుగులోకి తెచ్చిన రచయితగా రావిశాస్త్రి నిలిచిపోయారని ఆయన వివరించారు.

“చెమట విలువను ప్రజల్లో చాటి చెప్పిన మహోన్నత రచయిత రావిశాస్త్రి(Author Ravi Shastri)” అని కొనియాడారు. ప్రముఖ నవల ‘అల్పజీవి’ నుంచి ‘సొమ్ములు పోయాయి’ కథ వరకూ ఆయన రచనలు తెలుగు సాహిత్యంలో శాశ్వత ముద్ర వేశాయని, ఆయన సాహిత్యం విప్లవాత్మక చైతన్యాన్ని నింపిందని కళ్యాణ రామారావు గుర్తుచేశారు. “రావిశాస్త్రి ప్రభావంతోనే తన ఆర్ఎస్ఎస్ వైఖరిని విడిచి ప్రజాపక్ష ఆలోచనలను స్వీకరించాన”ని ఆయన జ్ఞాపకం చేసుకున్నారు.

సభాధ్యక్షత వహించిన కెంగార మోహన్(Kengara Mohan) మాట్లాడుతూ, “రచన ఎవరి పక్షాన నిలబెడుతుందో అవే రచనలు శాశ్వతంగా నిలుస్తాయి” అని అభిప్రాయపడ్డారు. న్యాయవాది, నటుడు, రచయితగా రావిశాస్త్రి తెలుగు సాహిత్యాన్ని శాసించిన ప్రగతిశీల మహాకవి అని కొనియాడారు. ఈ సందర్భంగా జంధ్యాల రఘుబాబు మాట్లాడుతూ, “తెలుగు కథాసాహిత్యంలో చైతన్యోద్యమానికి రావిశాస్త్రి రచనలు అజరామరమయ్యాయి” అని పేర్కొన్నారు.

సభలో రచయిత చంద్రశేఖర శర్మ, ఇనాయతుల్లాలు, విరసం నాయకులు పాణి, నాగేశ్వరాచారి(Nageswarachari), సాహితీ స్రవంతి ప్రధాన కార్యదర్శి ఆవుల చక్రపాణి యాదవ్, సహాయకార్యదర్శి బాలగౌని మధు, అవిజ మెడికల్ అధినేత అవిజ వెంకటేశ్వరరెడ్డి, కథా సమయం నాయకులు తెలకపల్లి మధుసూదన శర్మ తదితరులు పాల్గొన్నారు. సభ అనంతరం వృద్ధుల కళ్యాణ రామారావు దంపతులను టీజీవీ కళాక్షేత్రం అధ్యక్షులు పత్తి ఓబులయ్య, ప్రధాన కార్యదర్శి యాగంటీశ్వరప్పలు ఘనంగా సత్కరించారు.

Leave a Reply