Raoof l జోహార్ కామ్రేడ్ రవూఫ్… జోహార్ జోహార్

Raoof l జోహార్ కామ్రేడ్ రవూఫ్… జోహార్ జోహార్
ఉద్యమ కెరటానికి ఘన నివాళులు…
పోరాట స్పూర్తిని స్మరించిన బహుజన నాయకులు
Raoof l శ్రీ సత్యసాయి బ్యూరో, ఆంధ్రప్రభ: విప్లవ ఆలోచనలతో ప్రజల కోసం జీవితాన్ని అంకితం చేసిన ఉద్యమ కెరటం కామ్రేడ్ రవూఫ్ 12వ వర్ధంతి సందర్భంగా కదిరి మండలం కుటాగుళ్ళ గ్రామం భావోద్వేగాల తీరంగా మారింది. ఆయన స్తూపం వద్ద “జోహార్ రవూఫ్… జోహార్ జోహార్” అంటూ మార్మోగిన నినాదాలు గ్రామాన్ని ఉద్యమ జ్ఞాపకాలతో నింపాయి. పూలహారాలతో ఘనంగా నివాళులు అర్పించిన బహుజన సంఘాల నాయకులు ఆయన పోరాట జీవితం, అచంచల నిబద్ధతను గుర్తు చేసుకుంటూ కన్నీటి నివాళులు సమర్పించారు.
1924లో ఉమ్మడి అనంతపురం జిల్లా కదిరి తాలూకా కుటాగుళ్ళలో జన్మించిన రవూఫ్, స్వాతంత్ర్య పోరాట వీరుల త్యాగాల ప్రభావంతో చిన్ననాటి నుంచే ఉద్యమ మార్గాన్ని ఎంచుకున్నారు. భగత్ సింగ్, రాజుగురు, సుఖదేవ్, చంద్రశేఖర్ ఆజాద్, అల్లూరి సీతారామరాజు వంటి విప్లవ వీరుల ఆదర్శాలు ఆయన ఆలోచనలకు మార్గదర్శకంగా నిలిచాయని నాయకులు గుర్తుచేశారు.
స్వాతంత్ర్యం తర్వాత కూడా సామాన్య ప్రజల జీవితాల్లో మార్పులు కనిపించకపోవడం, భూస్వామ్య దోపిడీ పెరగడం ఆయనను ప్రజా ఉద్యమాల వైపు మరింతగా నడిపించిందని పేర్కొన్నారు. పీడిత ప్రజల పక్షాన నిలుస్తూ గ్రామాల్లో విస్తృతంగా చైతన్య కార్యక్రమాలు నిర్వహించిన ఆయన, పగలు కోర్టు కేసులు చూసుకుంటూనే రాత్రివేళల్లో గ్రామాల్లో ప్రజల మధ్య తిరిగి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా విప్లవోద్యమ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారని వివరించారు.
1967లో సీపీఎం రివిజనిజం విధానాలను వ్యతిరేకిస్తూ కామ్రేడ్ చారు మజుందార్‌తో కలిసి విప్లవ మార్గంలో అడుగులు వేసిన రవూఫ్, సైద్ధాంతికంగా దృఢమైన నాయకుడిగా ఎదిగారని తెలిపారు. మావోయిస్టు సిద్ధాంతాలను ఆచరణలో పెట్టేందుకు కృషి చేసిన పోరాటయోధుడిగా ఆయనను స్మరించారు. దాదాపు 20 సంవత్సరాల జైలు జీవితం గడిపినా తన నమ్మిన విలువల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా చివరి శ్వాస వరకు పోరాటం కొనసాగించడం ఆయన విశిష్టతగా కొనియాడారు.
“ఒక వ్యక్తి కొంతకాలం విప్లవకారుడిగా ఉండవచ్చు… కానీ తుది శ్వాస వరకు విప్లవకారుడిగా నిలబడటమే నిజమైన గీటురాయి” అనే చారు మజుందార్ మాటలను తన జీవితంతో నిరూపించిన నాయకుడు రవూఫ్ అని పలువురు భావోద్వేగంతో పేర్కొన్నారు. ప్రజలతో మమేకమై సాధారణ జీవన విధానాన్ని అనుసరించిన ఆయన, పారదర్శకతకు ప్రతీకగా నిలిచారని అన్నారు.
ఈ కార్యక్రమంలో బహుజన నాయకులు రోడ్డార్పు హరిప్రసాద్, మాజీ కౌన్సిలర్లు రామన్న, చంద్రశేఖర్, రజక సంఘం నాయకులు గంగన్న, శ్రీనివాసులు, డేరింగుల భాస్కర్ శివయ్య, రాజు, కే గంగరాజు తదితరులు పాల్గొన్నారు. యువత ఆయన పోరాట స్పూర్తిని ఆదర్శంగా తీసుకుని సామాజిక న్యాయం కోసం ముందుకు రావాలని పిలుపునిచ్చారు

