14కిలోల బంగారంతో పట్టుబడ్డ కన్నడ నటి
మాజీ ప్రియుడితో కలిసి దుబాయ్ నుంచి స్మగ్లింగ్
స్టెప్ ఫాదర్ పేరుతో రూల్స్ ఉల్లంఘనలు
విమానాశ్రయాల్లో వీఐపీ ట్రీట్‌మెంట్
ప్రొటోకాల్ మినహాయింపులతో నో చెకింగ్
తెరమీదకు వస్తున్న స్మగ్లింగ్ సిండికేట్
రన్యాను బంగారు బాతుగా మార్చేసిన ముఠా
పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్‌పై దర్యాప్తు ముమ్మరం
137 కోట్ల ఉక్కుఫ్యాక్టరీకి 12 ఎకరాల భూమి ధారాదత్తం
తాజా కేసుతో ఇరకాటంలో కన్నడ బీజేపీ
ఐపీఎస్ అధికారిపై కొనసాగుతున్న ఎంక్వైరీ
విచారణ అధికారిగా సీనియర్ ఐఏఎస్ నియామకం
సీరియస్‌గా తీసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం
ఆమె ఓ సినీ నటి.. కొన్ని సినిమా చాన్స్‌లు వచ్చినా పెద్దగా పేరు దక్కలేదు. అయితే.. తన స్టెప్ ఫాదర్ అయిన ఐపీఎస్ ఆఫీసర్ రామచంద్రరావు పేరు చెప్పుకుని పెద్ద మొత్తంలో కూడబెట్టాలని ప్లాన్ చేసింది. దీనికి తోడు తన మాజీ ప్రియుడు తరుణ్ రాజు కూడా సరే అన్నాడు. ఇక.. ఇద్దరూ కలిసి దుబాయ్ నుంచి అక్రమంగా బంగారం తీసుకొచ్చేవారని డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) అధికారులు చెబుతున్నారు. రన్యాకు వేరే వ్యక్తితో పెళ్లి అయినప్పటికీ, తరుణ్ రాజ్‌తో కలిసి గోల్డ్ స్మగ్లింగ్ చేసినట్టు విచారణలో వెల్లడయ్యింది. అయితే.. ఈ దందాలో మాజీ డీజీపీ, ప్రస్తత కర్నాటక స్టేట్ పోలీసు హౌసింగ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ మేనేజింగ్ కార్పొరేషన్ ఎండీగా ఉన్న రామచంద్రరావు హస్తం కూడా ఉందా అనే కోణంలో విచారణ జరుగుతోంది. దీని కోసం విచారణ అధికారిగా సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రభుత్వం నియమించింది.
సెంట్రల్ డెస్క్, ఆంధ్రప్రభ – గోల్డ్ స్మగ్లింగ్ కేసులో అడ్డంగా దొరికిన కన్నడ బంగారు లేడీ రన్యారావు ఓ సిండికేట్ చేతికి కీలుబొమ్మ మాత్రమేనని ప్రచారం జరుగుతోంది. ఆమెకు ఇప్పట్లో బెయిల్ వచ్చే పరిస్థితి కనిపించటం లేదని న్యాయనిపుణులు విశ్లేషిస్తున్నారు. ఆమెతో పాటు మరో యువకుడిని కూడా డీఆర్ఐ అధికారులు అరెస్టు చేయగా.. బెంగళూరులో ఓ స్టార్ హోటల్ యజమాని తనయుడు కావటంతో.. రన్యారావు సిండికేట్ మెంబర్ల జాడ గుట్టును రట్టు చేయటానికి డీఆర్ఐ పావులు కదుపుతోంది. ప్రస్తుతం ఆ నిందితుడు డీఆర్ఐ కస్టడీలో ఉన్నాడు. ఇక రన్యారావును మూడు రోజుల పాటు ప్రశ్నించిన డీఆర్ఐ ఆమెను ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. ఆమెను విచారణ కోసం కస్టడీకి డీఆర్ఐ కోరలేదు. 14 రోజుల పాటు జ్యుడీషియల్ కస్టడీకి న్యాయమూర్తి తరలించారు.
డీజీపీ పేరు చెప్పుకుని రూల్స్ మీరుతూ..
బంగారం అక్రమ రవాణా నిందితురాలు రణ్యరావు గత బీజేపీ ప్రభుత్వ పాలనలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు భూమిని కేటాయించారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కె. రామచంద్రరావు సవతి కుమార్తె కావటం విశేషం. మార్చి 3వ తేదీన దుబాయ్ నుంచి బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరిన రన్యారావును డీఆర్ఐ అధికారులు అరెస్టు చేశారు. ఆమె నుంచి ₹12.56 కోట్ల విలువైన 14.2 కిలోల బంగారు కడ్డీలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కన్నడ సినీ నటి రన్యారావు గోల్డ్ సిండికేట్‌లో భాగమని డీఆర్ఐ ఆరోపించగా బెంగళూరులోని ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు హర్షవర్దిని అలియాస్ రన్యా (33)ను మూడు రోజుల పాటు డీఆర్ఐ కస్టడీకి అప్పగించింది.
బాడీ చుట్టూ బ్యాండేజీలతో గోల్డ్ బార్లు..
ఆమె వెనుక బంగారం సిండికేట్ ఉనికి ఉందని మరింత సమాచారం సేకరించటానికి డీఆర్ఐ రన్యాను కస్టడీకి కోరింది. ప్రోటోకాల్‌ను దుర్వినియోగం చేయటానికి ఒక సిండికేట్ పనిచేసినట్టు డీఆర్ఐ దర్యాప్తులో వెల్లడైంది. 14.2 కిలోల బంగారాన్ని చట్టవిరుద్ధంగా భారతదేశానికి అక్రమంగా రవాణా చేయడానికి నటి ఉపయోగించిన పద్ధతిని డీఆర్ఐ విశ్లేషించింది. క్రేప్ బ్యాండేజీ, టిష్యూల సహాయంతో బంగారు కడ్డీలను ఆమె శరీర భాగాల చుట్టూ చుట్టినట్టు డీఆర్ఐ కోర్టుకు వివరించింది. తన ముఖం మీద బంగారాన్ని దాచిపెట్టి ₹4.83 కోట్ల కస్టమ్స్ సుంకాన్ని ఎగవేసేందుకు ప్రయత్నించారని కోర్టుకు సమర్పించిన అఫిడవిట్‌లో డీఆర్ఐ పేర్కొంది.
ఈ కుంపటిలోకి ఎలా వచ్చానో తెలియదు..
రన్యా రావును కోర్టులో ప్రవేశపెట్టినప్పుడు ఆమె కళ్ల చుట్టూ నల్లటి వలయాలు కనిపించాయి. మహిళా అధికారులతో కూడిన డీఆర్ఐ బృందం ఆమెను తీసుకెళ్లే ముందు కోర్టు గదిలో తన న్యాయవాదులతో మాట్లాడుతూ బోరున విలపించింది. ‘‘ఈ మానసిక గాయాన్ని భరించలేకపోతున్నా. ఈ కుంపటిలోకి నేను ఎందుకు దిగానో ఇంకా ఆలోచిస్తూనే ఉన్నా. నేను సరిగా నిద్రపోలేకపోతున్నా’’ అని ఆమె తన న్యాయవాదులతో కన్నీటి పర్యంతమైంది.
ఇరకాటంలో కన్నడ బీజేపీ..
బంగారం స్మగ్లింగ్ కేసులో సినీ నటి రన్యారావు అరెస్టు, పెద్ద మొత్తంలో ఆమె ఆస్తులను స్వాధీనం చేసుకోవటానికి ప్రభుత్వం సంకల్పించటంతో.. రాజకీయ ఆందోళన రగిలింది. కర్నాటకలో గత బీజేపీ సర్కారు హయాంలో పరిశ్రమల అభివృద్ది శాఖ (కేఐఏడీబీ) ఫిబ్రవరి 2023లో నటి రన్యారావుకు స్టీల్ ప్లాంట్ కోసం 12 ఎకరాలను కేటాయించింది. ఈ విషయాన్ని కర్నాటక పారిశ్రామిక ప్రాంత అభివృద్ధి బోర్డు ధ్రువీకరించింది. ఇది కాస్త రాజకీయ మలుపు తిరగడంతో మధ్యతరహా పెద్ద పరిశ్రమల మంత్రి ఎంబీ పాటిల్ ఈ అంశాన్ని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 22, 2023న తుమకూరు జిల్లాలోని సిరా ఇండస్ట్రియల్ ఏరియాలో రన్యా కంపెనీ క్సిరోడా ఇండియాకు భూమి కేటాయించినట్టు తెలిపారు. మే 2023లో జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఈ స్థితిలో రన్యాకు తమకు సంబంధం లేదని ప్రస్తుత ప్రభుత్వం స్పష్టం చేసింది.
బీజేపీ హయాంలో భూ కేటాయింపులు..
తుమకూరు జిల్లాలోని సిరా ఇండస్ట్రియల్ ఏరియాలో ‘స్టీల్ ఉత్పత్తులు – టీఎంటీ బార్లు, రాడ్లు, అనుబంధ ఉత్పత్తుల తయారీకి ఒక యూనిట్‌ను స్థాపించడానికి క్సిరోడా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ప్రతిపాదనకు అప్పటి కర్నాటక ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ కంపెనీ ₹138 కోట్ల పెట్టుబడితో స్టీల్ బార్‌లు, రాడ్లు అనుబంధ ఉత్పత్తుల కోసం తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనను సమర్పించింది. ఇదిలా ఉంటే… ఆ కంపెనీ కూడా బినామీగా అనుమానిస్తున్నారు. ఏది ఏమైనా కన్నడ బంగారు భామ భవిష్యత్తు.. లేడీ డాన్‌గా సోషల్ మీడియా అభివర్ణిస్తోంది. డీఆర్ఐ విచారణలో ఎంత మంది ప్రముఖులు బయటపడతారో? అనే అంశంపై దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
దుబాయ్ నుంచి అక్రమంగా..
బంగారం అక్రమ రవాణా కేసులో అరెస్టయిన నటి రన్యా రావు విమానాశ్రయ వీఐపీ ప్రోటోకాల్ అధికారాలను దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై విచారణ జరుగుతోంది. ఆమె స్టెప్ ఫాదర్ కర్నాటకలో ఐపీఎస్ అధికారి కావడం, అందులో అత్యున్నత పదవిలో ఉండడం దీనికి ప్రాధాన్యం సంతరించుకుంది. ఇక.. ఐపీఎస్ ఆఫీసర్ డాక్టర్ కె. రామచంద్రరావుకు కూడా ఈ స్మగ్లింగ్‌లో ఏదైనా పాత్ర ఉందా అనే విషయంపై ఆరా తీస్తున్నారు.
విచారణ అధికారిగా సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్..
కర్నాటక రాష్ట్ర పోలీస్ హౌసింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా తన తండ్రి పేరు, పదవిని ఉపయోగించి నిరోధిత విమానాశ్రయ సౌకర్యాల్లోకి అనధికారిక ప్రవేశం పొందారని రన్యాపై ఆరోపణలున్నాయి. రన్యా రావుకు ప్రోటోకాల్ అధికారాలు ఏ పరిస్థితుల్లో అనుమతించారు. ఆమె తండ్రికి ఏదైనా ప్రమేయం ఉందా అనే విషయంలోనూ దర్యాప్తు చేయాలని కర్నాటక ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి గౌరవ్ గుప్తాను దర్యాప్తు అధికారిగా ప్రభుత్వం నియమించింది.
హెూటల్ యజమాని మనవడు అరెస్ట్
ఇదే కేసులో డీఆర్ఎ అధికారులు బెంగళూరులోని అట్రియా హెూటల్ యజమాని మనవడు తరుణ్ రాజును అరెస్ట్ చేశారు. అతడిని బెంగళూరులోని ఆర్థిక నేరాల ప్రత్యేక కోర్టు ఐదు రోజుల కస్టడీకి అనుమతించింది. రన్యా రావు, తరుణ్ రాజుకు సన్నిహిత సంబంధాలున్నాయని, విదేశాల నుంచి బంగారాన్ని దొంగచాటుగా తేవడం వీరు కూడబలుక్కుని చేసిందేనని డీఆర్ఐ అంటోంది. రన్యా రావు వేరొకరిని పెళ్లి చేసుకోవడంతో వీరి మధ్య సంబంధాలు బెడిసి కొట్టినా చట్ట విరుద్ధ కార్యకలాపాలను కొనసాగిస్తున్నారని డీఆర్ఐ అధికారులు తెలిపారు.