ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : సినీ నటుడు రానా దగ్గుబాటి (Rana Daggubati) సోమవారం ఈడీ విచారణకు హాజరయ్యారు. నిషేధిత బెట్టింగ్ యాప్‌లకు ప్రచారం చేసిన వ్యవహారంలో విచారణకు రావాలని ఇటీవల ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆయన నేడు ఈడీ కార్యాలయానికి వెళ్లారు. బెట్టింగ్ యాప్‌ల నుంచి తీసుకున్న పారితోషికం, కమీషన్లపై నటుడిని అధికారులు ప్రశ్నిస్తున్నారు.
బెట్టింగ్ యాప్ కేసులో గతంలో విచారణకు రావాలని ఈడీ నోటీసులు ఇచ్చినప్పటికీ ముందస్తు బిజీ షెడ్యూల్ కారణంగా రానా కొంత సమయం కోరారు. ఇందుకు దర్యాప్తు సంస్థ అంగీకరించి, ఆగస్టు 11న హాజరుకావాలని సమన్లు ఇచ్చింది. దాంతో నేడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) ముందు విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో నటులు ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ(Prakash Raj, Vijay Devarakonda) ను ఈడీ అధికారులు ఇప్పటికే ప్రశ్నించారు. ప్రకాశ్ రాజ్‌ను 6 గంటలు, విజయ్ దేవరకొండను 4 గంటల పాటు విచారించారు. ఇక ఈ నెల 13న విచారణకు రావాలని మంచు లక్ష్మీ(Manchu Lakshmi)కి ఈడీ అధికారులు(ED Officers) నోటీసులు(Notices) ఇచ్చిన విషయం తెలిసిందే.