అసెంబ్లీలో ప్రశ్నలు అడగకుండా ఉండేందుకు రూ.10 కోట్ల డిమాండ్
రూ.2.50 కోట్లకు ఒప్పందం కుదుర్చుకున్న మైనింగ్ కంపెనీలు
రూ.20 లక్షలు స్వీకరిస్తుండగాపట్టి వేత
రాజస్థాన్ బిఎపి ఎమ్మెల్యే జైకృష్ణ లంచావతారం
జైపూర్: అసెంబ్లీలో ప్రశ్నలు అడగకుండా ఉండటానికి లంచం తీసుకున్న కేసులో రాజస్థాన్ ఎమ్మెల్యే అరెస్టయ్యారు. బాగిడోరాకు చెందిన భారత్ ఆదివాసీ పార్టీ ఎమ్మెల్యే జైకృష్ణ పటేల్ అసెంబ్లీలో మైనింగ్ సంబంధించి మూడు ప్రశ్నలు అడిగేందుకు సిద్ధమయ్యారు. అయితే వాటిని తొలగించేందుకు సంబంధిత మైనింగ్ కంపెనీ ఎమ్మెల్యేను సంప్రదించింది. దీనికిగాను జైకృష్ణ రూ.10 కోట్లు డిమాండ్ చేశారు. అయితే అది రూ.2.5 కోట్లకు ఒప్పందం కుదిరింది. ఈ నేపథ్యంలో తొలుత సంబంధిత కంపెనీ అతనికి రూ.లక్ష అందించింది. రెండో విడుతలో భాగంగా రూ.20 లక్షలు ఇవ్వాల్సి ఉండగా.. బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. దీంతో అధికారులు ఎమ్మెల్యేకు ఉచ్చు బిగించారు.
ఈ క్రమంలో డబ్బు ఇచ్చేందుకు జైపూర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు రావాలని సంబంధిత వ్యక్తులకు ఎమ్మెల్యే జైకృష్ణ సూచించారు. దీంతో వారు ఆయన క్వార్టర్స్‌లో రూ.20 లక్షలు అందించారు. ఆ మొత్తాన్ని స్వయంగా లెక్కించిన తర్వాత ఆయన తన సహాయకుడితో పంపించారు. ఇంతలో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఎమ్మెల్యేను అరెస్టు చేశారు. అయితే అప్పటికే ఆ వ్యక్తి బ్యాగుతో అక్కడినుంచి పరారయ్యాడు. దీంతో అతనికోసం గాలిస్తున్నారు.
కాగా, లంచం తీసుకుంటుండగా ఓ ఎమ్మెల్యే పట్టుబడటం రాష్ట్ర ఏసీబీ చరిత్రలో ఇదే మొదటి సారని ఏసీబీ డీజీ రవిప్రకాశ్ మెహ్రాదా చెప్పారు. మైనింగ్ కంపెనీకి చెందిన రవీంద్ర సింగ్ ఈ నెల 4న తమకు ఫిర్యాదు చేశారని చెప్పారు. అప్పటి నుంచి ఎమ్మెల్యేను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. మైనింగ్‌కు సంబంధించి అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన మూడు ప్రశ్నలను తొలగించడానికి.. ఎమ్మెల్యే మొదట రూ.10 కోట్లు అడిగారని, కానీ తరువాత రూ.2.5 కోట్లకు ఒప్పందం కుదిరిందని వెల్లడించారు. లంచం మొత్తాన్ని విడతలవారీగా చెల్లించాలని నిర్ణయించారని, ఇందులో భాగంగా రూ.20 లక్షలు తీసుకుంటుండగా ఎమ్మెల్యేను పట్టుకున్నామని చెప్పారు.
ఏసీబీ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునేసరికి ఎమ్మెల్యే సహచరులలో ఒకరు డబ్బుతో పారిపోయారని తెలిపారు. అయితే తాము అప్పటికే అమర్చిన సీసీటీవీ కెమెరాల్లో ఈ వ్యవహారమంతా రికార్డయిందని, ఎమ్మెల్యే డబ్బు తీసుకుంటున్న ఆడియో, వీడియో రికార్డింగ్ తమ వద్ద ఉన్నదని చెప్పారు. అలాగే లంచ సమాచారం, అరెస్ట్ విషయం రాజస్థాన్ అసెంబ్లీ స్పీకర్ కు తెలిపామని అధికారులు వెల్లడించారు.