రోడ్డు భద్రత కోసం ట్రాక్టర్లకు రేడియం స్టికర్లు…

రోడ్డు భద్రత కోసం ట్రాక్టర్లకు రేడియం స్టికర్లు…

కాణిపాకం ఎస్‌ఐ నరసింహులు

కాణిపాకం, ఆంధ్రప్రభ : రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు రోడ్డు భద్రతా చర్యలలో భాగంగా ట్రాక్టర్లకు రేడియం స్టికర్లు అతికించే కార్యక్రమాన్ని కాణిపాకం ఎస్‌ఐ నరసింహులు చేపట్టారు. జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ ఎస్.ఆర్. రాజశేఖర్ రాజు నేతృత్వంలో చిత్తూరు జిల్లా అంతటా పోలీసులు రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు వివిధ భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఈ చర్యలలో భాగంగా రాత్రి సమయంలో జరిగే ప్రమాదాలను తగ్గించేందుకు ట్రాక్టర్ల వెనుక భాగంలో రేడియం స్టికర్లు అతికించే కార్యక్రమాన్ని నిర్వహించారు.

బొమ్మసముద్రం, పైపల్లి గ్రామాలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ట్రాక్టర్ల వెనుక భాగంలో రేడియం స్టికర్లు అతికించారు. రాత్రి వేళల్లో రహదారులపై ప్రయాణించే వాహనదారులకు ట్రాక్టర్లు స్పష్టంగా కనిపించేలా చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్‌ఐ నరసింహులు మాట్లాడుతూ… రాత్రి సమయంలో ట్రాక్టర్లు స్పష్టంగా కనిపించకపోవడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని, రేడియం స్టికర్లు అమర్చడం వల్ల ఇతర వాహనదారులకు ట్రాక్టర్లు సులభంగా కనిపించి ప్రమాదాలు తగ్గుతాయని చెప్పారు.

ట్రాక్టర్ డ్రైవర్లకు రహదారి భద్రతా నియమాలపై అవగాహన కల్పిస్తూ వాహనాలను అజాగ్రత్తగా నడపకూడదని, రాత్రి సమయంలో లైట్లు సరిగా పనిచేస్తున్నాయో లేదో పరిశీలించుకోవాలని సూచించారు. అలాగే ట్రాక్టర్ యజమానులు తమ వాహనాలకు తప్పనిసరిగా రేడియం స్టికర్లు అమర్చుకోవాలని, ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ జాగ్రత్తగా వాహనాలు నడపాలని తెలిపారు.

రోడ్డు భద్రత అందరి బాధ్యత అని, ప్రమాదాలను తగ్గించేందుకు ప్రజలు పోలీసులకు సహకరించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, ట్రాక్టర్ యజమానులు, డ్రైవర్లు మరియు స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

Leave a Reply