Putin’s India Visit | భారత్, రష్యా.. మధ్యలో ఒక ట్రంప్..
Putin’s India Visit | ఆంధ్రప్రభ : గత కొంత కాలంగా అనుకుంటున్నట్టుగా.., ముందుగా ఖరారైనట్టుగా పుతిన్ భారత పర్యటన ప్రారంభమైంది. ఈ పర్యటన భారత్-రష్యాల మధ్య నెలకొని ఉన్న సత్సంబంధాలను, స్నేహాన్ని మరోసారి ప్రపంచానికి చాటి చెప్పనుంది. ఇప్పటికే ఇరుదేశాల మధ్య బలంగా ఉన్న రక్షణ, ఇంధనం, వాణిజ్యం, సాంకేతిక రంగాలలో కొత్త ఒప్పందాలకు అవకాశముంటుంది.
అయితే, ఈ పర్యటన అందరి కన్నా ఎక్కువ ఆసక్తితో గమనిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందన ఏ విధంగా ఉండబోతుందన్నదానిపైనే సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది.

ఎందుకంటే రష్యా పై కోపంతోనే భారత్ పై సుంకాలతో విరుచుకుపడుతున్నారు ట్రంప్. ఇది బహిరంగంగానే చెప్పారు కూడా. రష్యాతో స్నేహాన్ని వదులుకోవాలని ఒత్తిడి తేవడానికి, లేదా భారత్ తో స్నేహం లేకపోతే రష్యాకు కలిగే నష్టం ద్వారా ఉక్రెయిన్ తో యుద్ధాన్ని ఆపాలని, ఆ క్రెడిట్ తాను తీసుకోవాలనీ ట్రంప్ ఆలోచన. అందుకే రష్యా-భారత్ ల మధ్య ఈ ద్వైపాక్షిక చర్చలు కచ్చితంగా సమీప భవిష్యత్తులో అమెరికాతో భారతదేశ సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉండవచ్చని విశ్లేషకుల అంచనా.
అసలు రష్యా అధ్యక్షుడి భారత్ పర్యటన వెనక ఉన్న కారణాలేమిటి? ఈ పర్యటన వల్ల ఎవరెవరికి ఎలాంటి లాభాలు కలగనున్నాయో ఇప్పుడు చూద్దాం…

Putin’s India Visit వల్ల భారత్‌కు లాభాలు..
పుతిన్ పర్యటన భారతదేశానికి ప్రధానంగా జాతీయ భద్రత, వ్యూహాత్మక స్వయంప్రతిపత్తి విషయంలో ప్రయోజనం కలిగిస్తుంది. భారత్ రక్షణ శక్తి మరింత బలోపేతమయ్యే అవకాశముంది. ఇప్పటికే భారత్-రష్యాల మధ్య ఒప్పందం కుదిరిన ఎస్-400 క్షిపణి వ్యవస్థల డెలివరీని వేగవంతం చేయడం , అదనపు వ్యవస్థల కొనుగోలుకు ఆమోదం లభించే అవకాశం ఉంది.

ఆపరేషన్ సిందూర్ లో పాక్ ను గడగడలాడించిన బ్రహ్మోస్ క్షిపణి ఆధునిక వెర్షన్‌లు ఉదాహరణకు, బ్రహ్మోస్ ఎన్.జీ. , హైపర్‌సోనిక్ క్షిపణి అభివృద్ధిపై రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత ప్రధాని మోడీ, రక్షణ మంత్రులతో జరిపే చర్చల వల్ల బ్రహ్మోస్ పరిధి, సామర్థ్యం మరింత పెరుగుతుంది.
Putin’s India Visit |కొత్త ఫైటర్ జెట్‌లు..
రష్యా నుంచి భారత్ ఐదవ తరం స్టెల్త్ ఫైటర్ జెట్‌లు, ఎస్-500 అధునాతన ఎయిర్ డిఫెన్స్ షీల్డ్ వంటి అధునాతన ఆయుధ వ్యవస్థల కొనుగోలుపై చర్చలు ఇరు దేశాల మధ్య చర్చలు జరగవచ్చు. ఇరు దేశాల సైనిక బలగాలు, నౌకలు, విమానాలకు అవసరమైన లాజిస్టిక్ సహకారాన్ని ఇరుదేశాల మధ్య పరస్పరం అవగాహన ఒప్పందాలకు ఆమోదం లభించవచ్చు.
Putin’s India Visit | భారత్ కు ఇంధనభద్రత, రష్యాకు ఆర్థిక ప్రయోజనం…
ప్రస్తుతం రాయితీ ధరలకు రష్యా భారత్ కు భారీగా చమురు అందిస్తోంది. ఇది ఇరుదేశాల మధ్య ఉన్న స్నేహానికి తార్కాణం. ప్రపంచ మార్కెట్లో ఆర్థిక అనిశ్చితి ఉన్నప్పటికీ, భారతదేశ ఇంధనభద్రత, ఆర్థిక స్థిరత్వానికి దోహదపడుతోందని చెప్పవచ్చు. ఇక ముఖ్యమైన పౌర అణు సహకార ఒప్పందాలపై ఇదు దేశాల మధ్య ఒప్పంద పత్రాలపై సంతకాలు జరిగే అవకాశం ఉంది.
అమెరికా అధ్యక్షుడు రష్యాతో స్నేహాన్ని జీర్ణించుకోలేకుండా ఉండడం, రష్యాతో స్నేహాన్ని కొనసాగించడం వల్లనే సుంకాలతో విరుచుకుపడాల్సి వస్తోందని బహిరంగంగానే వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ, భారత్ ఏమాత్రం భయపడకుండా రష్యాతో తన స్నేహాన్ని, వ్యాపార-వాణిజ్య భాగస్వామ్యాన్ని కొనసాగించడం ద్వారా, తన స్వతంత్ర విదేశాంగ విధానాన్ని తెలియజేయడమే.
Putin’s India Visit |భారత్ తో రష్యాకు ప్రయోజనాలు
ప్రస్తుతం పాశ్చాత్య దేశాల నుంచి ఆంక్షలు ఎదుర్కొంటున్న రష్యాకు, భారత్ అందించే సహకారం చాలా కీలకమైనది. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద మార్కెట్‌లలో ఒకటైన భారత దేశానికి భారీగా చమురు, ఆయుధాలు, అణు పరికరాలను ఎగుమతి చేయడం ద్వారా రష్యాకు స్థిరమైన ఆదాయ వనరు లభిస్తోంది.
అందుకే భారత్-రష్యాల మధ్య వాణిజ్యం గణనీయంగా పెరిగింది 2024-25లో సుమారు $68.7 బిలియన్లకు చేరింది. 2030 నాటికి $100 బిలియన్ల లక్ష్యాన్ని చేరుకోవడానికి పుతిన్ పర్యటన దోహదపడుతుంది. దేశాల మధ్య ఆర్థిక లావాదేవీలకు డాలర్‌పై ఆధారపడడం తగ్గించుకోవడానికి, స్థానిక కరెన్సీలలో రూపాయి(భారత్)-రూబుల్(రష్యా) చెల్లింపుల పై చర్చలు ఈ పర్యటనలో జరగవచ్చు.
భారతదేశం వంటి కీలకమైన ప్రపంచశక్తి తమతో దృఢంగా నిలబడటం రష్యాకు అంతర్జాతీయ వేదికలపై దౌత్యపరమైన మద్దతును లభించేలా చేస్తుంది. ఇది ఉక్రెయిన్ సంక్షోభం నేపథ్యంలో పశ్చిమ దేశాల ఆంక్షలను ఎదుర్కోవడానికి రష్యాకు సహాయపడుతుంది. బ్రహ్మోస్ వంటి ఉమ్మడి అభివృద్ధి ప్రాజెక్టులను విస్తరించడం ద్వారా రక్షణ, సాంకేతిక రంగాలలో కొత్త భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవచ్చనేది రష్యా ఆలోచన.
రష్యా నుంచి ముఖ్యంగా చమురు, రక్షణ వ్యవస్థలను భారత్ కొనుగోలు చేయడాన్ని డొనాల్డ్ ట్రంప్ గతంలో తీవ్రంగా వ్యతిరేకించారు. అందువల్ల, పుతిన్ పర్యటన మరియు కొత్త ఒప్పందాలపై ట్రంప్ ప్రతిస్పందన తీవ్రంగానే ఉండే అవకాశం ఉంది. అంతే కాక భారత్‌పై ఆంక్షలు లేదా అదనపు సుంకాలు విధించాలనే బెదిరింపులను ట్రంప్ తిరిగి మొదలుపెట్టొచ్చు.
Putin’s India Visit | భారత్-రష్యా ద్వైపాక్షిక సంబంధాలపై ఒత్తిడి..
భారత్ రష్యాను దూరం చేసుకోవాలని ఇకపై ట్రంప్ బహిరంగంగా డిమాండ్ చేసే అవకాశాలు లేకపోలేదు. అయితే, భారత్ తన ఇంధన విధానం స్వతంత్రమైనదని, ప్రజల ప్రయోజనాలే ముఖ్యమని ఇప్పటికే స్పష్టం చేసింది. అంటే, ట్రంప్ బెదిరింపులకు, ఒత్తిళ్ళకు తలొగ్గేది లేదని సంకేతాలు ఇదివరకే ఇచ్చేసింది ట్రంప్ కి. ఏదేమైనప్పటికీ, పుతిన్ భారత పర్యటన ప్రపంచ దేశాలతో భారత్ సమతుల్య దౌత్యానికి ఒక పరీక్షగా నిలుస్తుంది.
click here to read Hot Topics | పుతిన్…

