Putin | నేడు భారత్ కు పుతిన్..
Putin, ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : రష్యా అధ్యక్షుడు పుతిన్ రెండు రోజుల పర్యటన నిమిత్తం.. గురువారం భారత్‌కు (India) చేరుకోనున్నారు. పర్యటన సందర్భంగా వాణిజ్య, ఆరోగ్య, వ్యవసాయ, మీడియా, సాంస్కృతిక మార్పిడి తదితర రంగాలలో ఉభయ దేశాల మధ్య ఒప్పందాల పై సంతకాలు జరిగే అవకాశం ఉంది. భారత్ – రష్యా వ్యూహాత్మక భాగస్వామ్యం 25 వ వార్షికోత్సవం సందర్భంగా ఈ పర్యటన జరుగుతుంది. ఈ పర్యటనలో రెండు దేశాల మధ్య 23వ ద్వైపాక్షిక సదస్సు జరగనుండడం విశేషం.
ఉక్రెయిన్ (Ukraine) పై 2022లో రష్యా ప్రత్యేక సైనిక చర్యను ప్రారంభించిన తర్వాత పుతిన్ భారత్‌ను సందర్శించడం ఇదే మొదటిసారి. గురువారం సాయంత్రం 7 గంటలకు పుతిన్ ఢిల్లీ చేరుకుంటారు. అనంతరం.. ఆయనకు భారత ప్రధాని నరేంద్ర మోదీ తన అధికారిక నివాసంలో విందు ఇవ్వనున్నారు. మరుసటి రోజు శుక్రవారం ఉదయం రాష్ట్రపతి భవన్ వద్ద సంప్రదాయ స్వాగతంతో పుతిన్ భారత పర్యటన అధికారికంగా ప్రారంభమవుతుంది.
శుక్రవారం ఉదయం రాష్ట్రపతి భవన్ ప్రాంగణంలో త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరిస్తారు. అనంతరం.. పుతిన్ రాజ్‌ఘాట్‌కు చేరుకుని మహాత్మగాంధీకి నివాళులర్పిస్తారు. అనంతరం హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని మోదీ-పుతిన్ (Modi – Putin) నడుమ సమావేశం జరుగుతుంది. భేటీ ముగిశాక ఇద్దరు నేతలూ కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేస్తారు. అనంతరం ఢిల్లీలోని భారత్ మండపంలో.. ఫిక్కీ (ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ) నిర్వహించే ఒక కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత రాష్ట్రపతి భవన్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిర్వహించే విందు కార్యక్రమానికి పుతిన్ హాజరవుతారు. దీంతో పుతిన్ భారత పర్యటన పూర్తవుతుంది.

