జనజీవనం స్థంభన
- నంద్యాల జిల్లాలో వానంటే వాన కాదు
- కుండపోత 1216.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు..
- మహానంది వ్యవసాయ కళాశాలలో వరద నీరు…
- పా లేరు వంకలో రాకపోకలు బంద్..
- సిద్దాపురం నుంచి బస్సుల దారి మళ్లింపు..
- వెలుగోడు వేల్పనూరు రాదారి స్థంభన
(నంద్యాల, ఆంధ్రప్రభ బ్యూరో) : గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో నంద్యాల జిల్లా జన జీవనం అస్తవ్యస్తమైంది. పంటలు దెబ్బతిన్నాయి. రోడ్లు దెబ్బతిన్నాయి. జాతీయ రహదారిపై సైతం వాహనాలు రాకపోకలకు అవాంతరం ఏర్పడింది. అనేక ప్రాంతాల్లో వాహానాల దారి మళ్లించిక తప్పలేదు. నంద్యాల (Nandyal) జిల్లాలో శుక్ర శనివారాల్లో భారీ వర్షలు కురుస్తున్నాయి. శనివారం ఒక్కరోజే 1216.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావటం విశేషం.

ఆత్మకూరు, మహానంది, వెలుగోడు, నంద్యాల, బండి ఆత్మకూరు, బేతంచెర్ల, బనగానపల్లె , కొత్తపల్లి, శ్రీశైలం, పాణ్యం, నందికొట్కూరు, జూపాడు బంగ్లా, పాములపాడు, పగిడ్యాల మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదయింది. కర్నూలు (Kurnool) నుంచి ఆత్మకూరు, దోర్నాల, గుంటూరు కు వెళ్లే జాతీయ రహదారి పక్కన సిద్ధాపురం చెరువులోని వరద నీరు రోడ్డుపైకి చేరింది. ఆ రహదారిలో వాహనాలన్నింటినీ వయా నంద్యాల మీదుగా పోలీసులు దారి మళ్లించారు. అక్కడ ఓ చెక్ పోస్ట్ ను ఏర్పాటు చేశారు. వెలుగోడు నుంచి వేల్పనూరు రోడ్డులో రాకపోకలు స్థంభించాయి.

మహానంది మండలం (Mahanandi Mandal) ఆర్ఎస్ గాజులపల్లి పరిధిలోని ఎంసీ ఫారం గ్రామ సమీపంలోని పాలేరు వాగు పొంగిపొర్లుతోంది. నంద్యాల పట్టణంలో స్టేట్ బ్యాంక్ కాలనీ, విశ్వనగర్ ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. పాలేరు వాగు పొంగటంతో నంద్యాల పట్టణం స్టేట్ బ్యాంక్ కాలనీ, విశ్వనగర్ ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరుతోందని ప్రజలు చెబుతున్నారు. స్టేట్ బ్యాంక్ కాలనీలో రామకృష్ణ పీజీ కళాశాల దగ్గర వంతెనపై నుంచి వరద పరవళ్లు తొక్కుతోంది. ఆ రహదారిని అధికారులు మూసివేశారు.

మహానంది మండలం అబ్బిపురం చెంచు కాలనీలో నీరు చేరింది. ఇక్కడ 42 చెంచు కుటుంబాలు పూరి గుడిసెల్లో నివసిస్తున్నాయి. వర్షం నీరు తో ఆ చెంచుగూడెంలోని పూరి గుడిసెలలో వంటలు చేసుకునే అవకాశం లేక అర్ధాకలితో అలమటిస్తున్నారు. కుందూ నది (Kundu river) కూడా ఉప్పొంగి పరవళ్లు తొక్కుతోంది. నంద్యాల (Nandyal) పట్టణంలో భీమ వరం హరిజన పేట వంటి లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. రాకపోకలు బంద్ చేశారు. పట్టణంలో సంజీవనగర్ శ్రీనివాస్ సెంటర్ స్టేట్ బ్యాంక్ కాలనీ సలీం నగర్ మున్సిపల్ కాలనీ బస్టాండ్ ఏరియాలో కుందూ నది నీరు పట్టణంలోకి చేరుతోంది. జిల్లా కలెక్టర్ రాజకుమారి కంట్రోల్ రూమ్ లో ఏర్పాటు చేశారు. ముంపు ప్రాంతాల్లో పర్యటించాలని అధికారులను ఆదేశించారు.