పీఎస్ఆర్ విగ్రహ నిర్మాణానికి
తుళ్లూరు..పెదపరిమి మధ్యలో శంకుస్థాపన
మంత్రులు లోకేశ్, టీజీ భరత్, నారాయణ హాజరు
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ
అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహ నిర్మాణానికి టిజివి సంస్థల తరుపున రూ.1కోటి రూపాయలు విరాళంగా ఇస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ ప్రకటించారు. అమరావతిలోని తూళ్లూరు.. పెదపరిమి ప్రాంతంలో ఏపీ ప్రభుత్వం, అమరజీవి పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో 58 అడుగుల పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహంతో పాటు ఆడిటోరియం, స్మృతివనం ఏర్పాటుచేయనున్నాయి. ఇందుకోసం కూటమి ప్రభుత్వం 6.8 ఎకరాల భూమిని కేటాయించింది. వీటి శంకుస్థాపన కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు నారా లోకేష్, టి.జి భరత్, నారాయణ, ఎమ్మెల్యేలు తెనాలి శ్రావణ్ కుమార్, కొలికపూడి శ్రీనివాస రావు, కుడా ఛైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్మన్ డూండి రాకేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి టి.జి భరత్ మాట్లాడుతూ ఈ గొప్ప కార్యక్రమానికి ఫస్ట్ డొనేషన్‌గా తమ టీజీవీ సంస్థల తరపున 1 కోటి రూపాయలు ప్రకటించాను. దీంతో పాటు తన తరుపున మరింత సపోర్టు చేసేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. గత ఎన్నికల్లో రాష్ట్రంలోని ఆర్యవైశ్యులందరూ 95 శాతం మంది కూటమి ప్రభుత్వానికి ఓటు వేసి అండగా నిలబడ్డారని, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో కూడా ఇవ్వని రీతిలో మన రాష్ట్రంలో ఆర్యవైశ్యుడినైన నాకు మంత్రి పదవి ఇచ్చి వైశ్యులపై ఎంత గౌరవం ఉందో సీఎం చంద్రబాబు నాయుడు తెలియజేశారని భరత్ వివరించారు. మనకి గుర్తింపు ఇచ్చిన పార్టీకి ఎప్పుడూ అండగా ఉండాలి అని ఆయన పేర్కొన్నారు.