Protest | ఉపాధి హామీ చట్టం మార్పులపై నిరసన గళం

Protest | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి కేంద్ర ప్రభుత్వం జి రామ్ జి పేరుతో కొత్త చట్టాన్ని తీసుకురావడం పట్ల వామపక్ష పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు పలువురు నేతలు పేర్కొన్నారు. మచిలీపట్నం బుట్టాయిపేట జ్యోతిబాపూలే విజ్ఞాన కేంద్రంలో సీపీఎం, సీపీఐ, సీపీఐ ఎంఎల్ పార్టీలకు చెందిన నాయకులు పాల్గొని ఈ నెల 22వ తేదీ సోమవారం చమ్మనగిరిపేట గాంధీ బొమ్మ శివాలయం దగ్గర నిరసన చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ నిరసన కార్యక్రమంలో లెఫ్ట్ పార్టీల సానుభూతిపరులు ప్రజాసంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఉపాధి హామీ పథకం అమలులో కీలకమైన రాష్ట్రాల భాగస్వామ్యం నామ మాత్రం కావడంతోపాటు, కొత్త బిల్లు వల్ల ఆర్థిక భారాలు మోపుతోందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
ఇప్పుడు వరకు కేంద్రం ఇస్తున్న 90 శాతం నిధులను 60 శాతానికి తగ్గించి పథకం అమలు చేస్తామనడం వెనుక రాష్ట్రాలు 40 శాతం నిధులు సమకూర్చుకోలేక పోతే మొత్తం ఎగనామం పెట్టడానికి కొత్త చట్టం ద్వారా కేంద్రం మార్గం సులభం చేసుకుంటుందని ఆరోపించారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వానికి కీలక మద్దతు ఇస్తున్న తెలుగుదేశం జనసేన పార్టీలు వీబీ జీ రామ్ జీ పేరుతో చేస్తున్న కొత్త ఉపాధి చట్టాన్ని ఉపసంహరించుకునేటట్లు ఒత్తిడి తీసుకురావాలని వామపక్షాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర నాయకుడు కొల్లాటి శ్రీనివాసరావు, సీనియర్ నాయకుడు కొడాలి శర్మ, నగర కార్యదర్శి బూర సుబ్రహ్మణ్యం నగర కన్వీనర్ చిరువోలు జయరావు, సిపిఐ సీనియర్ నాయకుడు మోదుమూడి రామారావు, సీపీఐ నియోజకవర్గ సహాయ కార్యదర్శి ఎర్రంశెట్టి ఈశ్వరరావు, సీపీఐ ఎంఎల్ జిల్లా కమిటీ సభ్యులు బి వెంకటరామయ్య, మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి ఓడుగు రత్నకుమారి తదితరులు పాల్గొన్నారు.
