గాజులదిన్నె ప్రాజెక్ట్‌ను పరిశీలించిన కలెక్టర్…

గాజులదిన్నె ప్రాజెక్ట్‌ను పరిశీలించిన కలెక్టర్…
సాగునీటి పరిస్థితులు, పనుల పురోగతిపై సమీక్ష
కర్నూలు బ్యూరో, ఆంధ్రప్రభ : గోనెగండ్ల మండలంలోని గాజులదిన్నె ప్రాజెక్ట్‌ను బుధవారం జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ పరిధిలో సాగునీటి సరఫరా పరిస్థితులు, జలాశయం నీటి నిల్వ స్థాయి, నీటి సామర్థ్యాన్ని పెంచేందుకు చేపడుతున్న పనుల పురోగతిపై అధికారులతో సమగ్రంగా ఆరా తీశారు. అలాగే సాగు కాల్వల నిర్వహణ, మరమ్మత్తులపై కూడా వివరాలు అడిగి తెలుసుకున్నారు. గాజులదిన్నె ప్రాజెక్ట్‌కు సంబంధించి కోడుమూరు నియోజకవర్గ పరిధిలో కాల్వల లైనింగ్, ఇతర మరమ్మత్తుల కోసం రూ.2.66 కోట్ల నిధులను మంజూరు చేయడానికి ముఖ్యమంత్రి ఆమోదం తెలిపినట్లు కలెక్టర్ వెల్లడించారు.
ఈ నిధులతో చేపట్టాల్సిన పనులపై అధికారులతో చర్చించి, ప్రాధాన్యత క్రమంలో పనులు ప్రారంభించాలని సూచించారు. ఇరిగేషన్ శాఖ అధికారులు సమర్థవంతంగా పనిచేసి రైతులకు అవసరమైన సాగునీటిని సమయానికి అందించేందుకు కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో గోనెగండ్ల తహసీల్దార్ రాజేశ్వరి, ఇరిగేషన్ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
