Press Meet | బిసిలపై ప్రేమ ఉంటే మోడీ కూడా కులగణన చేయాలి – రేవంత్ రెడ్డి
న్యూ ఢిల్లీ – ‘నేను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించలేదు. ఉన్నది ఉన్నట్లుగా నిజం మాట్లాడాను. ప్రధాని హోదాను అగౌరవపరచలేదు. పుట్టుకతోనే ప్రధాని బీసీ కాదు అని మాత్రమే అన్నా ను. మోదీకి నిజంగా బీసీలపై ప్రేమ ఉంటే జన గణనలో కులగణన చేసి చూపించాలి’ అని డిమాండ్ చేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . ఢిల్లీ పర్యటనలో ఉన్న రేవంత్ నేడు ఢిల్లీ, టెన్ జన్ పథ్ లోని సోనియా గాంధీ నివాసంలో రాహుల్ గాంధీతో భేటి అయ్యారు..ఈ ఇద్దరు నేతలు దాదాపు గంట సేపు వివిధ అంశాలపై చర్చించారు.. ముఖ్యంగా రాష్ట్రంలో నెలకొన్న తాజా రాజకీయ పరిణామాలు, పాలనాపరమైన అంశాలను రాహుల్ గాంధీకి రేవంత్ రెడ్డి వివరించారు.
సమావేశం అనంతరం రేవంత్ మీడియాతో చిట్ చాట్ గా మాట్లాడుతూ, రాహుల్ గాంధీతో తనకు ఎలాంటి గ్యాప్ లేదని స్పష్టం చేశారు. కులగణన గురించి రాహుల్ గాంధీతో సంపూర్ణంగా వివరించానని సీఎం తెలిపారు. ‘తెలంగాణలో కులగణన శాస్త్రీయంగా జరిగింది. రాష్ట్రంలో జరిగిన కులగణన దేశానికే రోడ్ మ్యాప్. దేశంలో ఎవరూ చేయలేని విధంగా మేం కులగణన చేశాం. కులగణనలో ఎలాంటి తప్పులు చోటుచేసుకోలేదు. ఒక్కో ఎన్యుమనేటర్ కు 150 ఇళ్లు కేటాయించాం. తప్పులు ఎక్కడా జరగలేదు. రాష్ట్రంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. ఆ సభకు అగ్రనేత రాహుల్ గాంధీ రావాలని కోరాను. రాహుల్ గాంధీ చెప్పిన సూచనలు పాటిస్తున్నాను’ అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
తెలంగాణ లో జరిగన కులగణనపై ప్రతిపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని రేవంత్ చెప్పారు. ‘రాజకీయ కోణంలోనే కాదు ప్రజా సంక్షేమం కోణంలోనే కులగణన జరిగింది. ప్రతిపక్షాలు కావాలనే అబద్దాలను ప్రచారం చేస్తున్నాయి. మా పాలనతో ఎక్కడా లెక్క తప్ప లేదు. కులగణన కు సంబంధించి అసెంబ్లీలో తీర్మానం చేస్తాం. ఆ వెంటనే పార్లమెంట్ కు పంపిస్తాం. పార్టీ మారిన పది మంది ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు ఎలా తీర్పును ఇస్తుందో చూడాలి. సుప్రీంకోర్టు తీర్పు కన్నా ముందే బీఆర్ఎస్ నేత కేటీఆర్ ఏదో మాట్లాడుతున్నారు. సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు ఏ పార్టీలు గెలిచి ఏ పార్టీలో మంత్రులుగా చేరారో చెప్పాలి’ అని సీఎం ప్రశ్నించారు.
తనపై అబద్దపు ప్రచారాలు చేస్తూ విపక్ష నేతలు పైశాచిక ఆనందాలు పొందుతున్నారని రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు. ‘నేను కొందరికి నచ్చవచ్చు. నచ్చకపోవచ్చు. నన్ను కొందరు అంగీకరించక పోవచ్చు.. కానీ నా పని నేను సక్రమంగా చేస్తున్నాను. నన్ను ఎవరూ ప్రశ్నించే పరిస్థితిని తెచ్చుకోను. కాంగ్రెస్ తరఫున తెలంగాణ రాష్ట్ర ప్రజలకు హామీలు ఇచ్చింది నేను. హామీలు అమలు చేయకపోతే అడిగేది కూడా నన్నే. కేబినేట్ విస్తరణ నా ఒక్కడి నిర్ణయం కాదు. నా పై ఎవరు ఏమనుకున్నా..? ఎలాంటి విమర్శలు చేసినా.. నేను పట్టించుకోను. పీసీసీ కార్యవర్గం, మంత్రి వర్గ విస్తరణ తదితర అంశాలపై కొందరు పైశాచిక ఆనందం కోసం అబద్దాలు ప్రచారం చేస్తున్నారు’ అని మండి పడ్డారు.