నిండుకుండను తలపిస్తున్న ప్రకాశం బ్యారేజీ

నిండుకుండను తలపిస్తున్న ప్రకాశం బ్యారేజీ
ఎగువ నుంచి భారీగా వస్తున్న వరద నీరు…
పొంగి పొర్లుతున్న వాగులు, వంకలు

ఆంధ్రప్రభ ఎన్టీఆర్ బ్యూరో : తుఫాను ప్రభావంతో కృష్ణానది ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణానది గంట గంటకు వరద నీటితో పోటెత్తుతోంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ వద్ద మూడు లక్షల క్యూసెక్కులకు పైగా వరద నీటి ప్రవాహం ఉన్న నేపథ్యంలో బ్యారేజీ 69 గేట్లను ఏడు అడుగుల మేర ఎత్తి దిగువకు మిగులు జలాలను విడుదల చేస్తున్నారు. భారీ వరద నీటి తాకిడితో ప్రకాశం బ్యారేజీ నిండుకుండను తలపిస్తూ గరిష్ట నీటి సామర్థ్యం 3.09 టీఎంసీలకు చేరుకుంది. పులిచింతల నుంచి మూడు లక్షలకు పైగా వరద నీటి ప్రవాహం వస్తుండడం, ఇదే సమయంలో మున్నేరు నుంచి కూడా 1,30 వేలకు పైగా నీటి ప్రవాహం, జిల్లాలోని పలు వాగులు వంకల నుంచి వరద నీరు వస్తుండడంతో గంటకు ప్రకాశం బ్యారేజీ వద్ద నీటి ప్రవాహం క్రమంగా పెరుగుతూ ఉంది. గురువారం సాయంత్రానికి ఆరు లక్షల క్యూసెక్కులకు నీటి ప్రవాహం చేరుకునే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. 3 లక్షల 97 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంటే మొదటి ప్రమాద హెచ్చరిక, 5,60 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ఉంటే రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేసే అవకాశం ఉంది.
జిల్లా యంత్రాంగం అప్రమత్తం..
కృష్ణా నదికి భారీగా వరద నీరు పోటెత్తుతున్న సందర్భంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమయింది. కృష్ణ ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరద నీటికి తోడు, మున్నేరు, ఏనుగుల గడ్డ పలు వాగులు వంకల నుంచి నీటి ప్రవాహం వస్తుండడంతో ఆ పరీవాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. ఆయా ప్రాంతాలలో దండోరా వేస్తున్న అధికారులు నదీ పరీవాహక ప్రాంతాలతో పాటు సమీపంలో ఉన్న పంట పొలాల్లోకి ఎవరిని ఎల్ల వద్దంటూ హెచ్చరిస్తున్నారు. ఇదే సమయంలో జిల్లా కలెక్టర్ లక్ష్మీ, సిపి రాజశేఖర్ బాబులు కృష్ణ ఎగువ ప్రాంతాలలో పరిస్థితిని క్షేత్రస్థాయిలో సమీక్షించడంతోపాటు సిబ్బందిని అప్రమత్తం చేస్తున్నారు. ఇక బ్యారేజీ దిగువ ప్రాంతాలలో ఉన్న పరీవాహక ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తున్న అధికారులు ఎవ్వరిని నది వైపు వెళ్లకుండా ఆంక్షలు విధించారు.
కృష్ణా సెంట్రల్ డివిజన్, జలవనరుల శాఖ, విజయవాడ నుంచి అందిన అత్యవసర సమాచారం మేరకు, మొంథా తుఫాను కారణంగా ఎగువ పరీవాహక ప్రాంతంలో కురిసిన అతి భారీ వర్షాల ఫలితంగా కృష్ణా నది ఉపనదుల్లో అకస్మాత్తుగా వరదలు (Flash Floods) పోటెత్తాయి. దీనివల్ల కృష్ణా నదికి భారీగా ప్రవాహం వచ్చి చేరుతోంది. ఈ రోజు (30-10-2025) ఉదయం 7:30 గంటల సమయానికి ఉన్న సమాచారం ప్రకారం.. ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం 6,00,000 క్యూసెక్కులు (ఆరు లక్షల క్యూసెక్కులు) మించిపోయే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం వరద ఉధృతి అత్యంత వేగంగా పెరుగుతున్నందున, నదీ సంరక్షకులు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, కృష్ణా సెంట్రల్ డివిజన్, వాటర్ రిసోర్సెస్ డిపార్ట్‌మెంట్ తరఫున అన్ని సంబంధిత శాఖలు, ముఖ్యంగా సాధారణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తక్షణమే అవసరమైన భద్రతా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
