• ఇన్, ఔట్ ఫ్లో 2.55 లక్షల క్యూసెక్కులు…
  • గరిష్ట నీటిమట్టానికి ప్రకాశం బ్యారేజీ…
  • 70 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల…
  • ప్రవాహం మరింత పెరిగే అవకాశం…
  • అప్రమత్తమైన అధికారులు…
  • నదీ పరివాహక ప్రాంతాలలో రెడ్ ఎలర్ట్…
  • 43 ముంపు ల ప్రాంతాల గుర్తింపు..
  • పెద్ద ఎత్తున ఇసుక బస్తాలు సిద్ధం..
  • ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు…
  • పరిస్థితులు స్వయంగా సమీక్షిస్తున్న జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
  • వదంతులు నమ్మవద్దు అంటూ సూచన….

(ఆంధ్రప్రభ, ఎన్టీఆర్ బ్యూరో) : కృష్ణానది (KrishnaRiver) ఎగువ ప్రాంతాల నుండి భారీ ఎత్తున వరదనీరు దిగువకు విడుదల చేయడంతో ప్రకాశం బ్యారేజీ (PrakasamBarrage)కి వరద నీరు గంటగంటకు పోటెత్తుతోంది. పులిచింతల ప్రాజెక్టు (Pulichintala project) నుండి దిగువకు సుమారు 3లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో బుధవారం ఆ వరద నీరంతా ప్రకాశం బ్యారేజీకి చేరుకోవడంతో ప్రస్తుతం బ్యారేజీ వద్ద గరిష్ట నీటిమట్టం నమోదైంది. గురువారం ఉదయానికి ప్రకాశం బ్యారేజీకి ఇన్, ఔట్ ఫ్లో 2.55లక్షల క్యూసెక్కులు ఉండగా, బ్యారేజీ పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 3.07 టీఎంసీలకు చేరుకోవడంతో మిగులు జలాలను బ్యారేజీ 70గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు.

ఇన్ ఫ్లో 2,54,034 క్యూసెక్కులు ఉండగా, కృష్ణ తూర్పు మెయిన్ కెనాల్ (Krishna East Main Canal) కు 10,187 క్యూసెక్కులు, కృష్ణ పశ్చిమ మెయిన్ కెనాల్ (Krishna West Main Canal) కు 6522 క్యూసెక్కులు, గుంటూరు కెనాల్ కు 200క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో మొత్తం కెనాల్ కు 16,909 క్యూసెక్కులుగా ఉంది. బ్యారేజీకి గరిష్ట నీటిమట్టం 12అడుగులకు చేరుకోవడంతో మొత్తం బ్యారేజీ 70 గేట్లకు గాను 15 గేట్లు 6 అడుగుల మేర, మిగిలిన 55 గేట్లను 5 అడుగు మేర ఎత్తి దిగువకు 2,37,125 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

అప్రమత్తమైన అధికారులు…
ప్రకాశం బ్యారేజీకి భారీ ఎత్తున వరద నీరు చేరుకోవడం, సముద్రంలోకి దిగువకు నీటిని విడుదల చేస్తుండడంతో అప్రమత్తమమైన అధికారులు ముందస్తు ఏర్పాట్లు ప్రారంభించారు. ఎక్కడైనా కట్టలు తెగితే తక్షణ చర్యలు చేపట్టేందుకు పెద్ద ఎత్తున ఇసుక బస్తాలను సైతం సిద్ధం చేశారు. స్వయంగా రంగంలోకి దిగిన ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ముఖ్యంగా బ్యారేజీ ఎగువ, దిగువ వైపు ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లకుండా వారికి అవగాహన కల్పిస్తున్నారు. విజయవాడలో దాదాపు 43 లోతట్టు ప్రాంతాలను గుర్తించి, ఆయా ప్రాంతాల్లో ముందస్తు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఏ క్షణమైనా ఎటువంటి విపత్కర పరిస్థితి వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని, అవసరమైన పక్షంలో ముప్పు ప్రాంత బాధితులను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నట్లు చెప్పారు.

బుడమేరు పులివాగు, కోతుల వాగు తదితర ప్రాంతాల్లో వరదనీటి ప్రవాహం పెరుగుతున్న నేపథ్యంలో కలెక్టరేట్ లో 9154970454 తో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామ‌న్నారు. 24గంటల పాటు అందరికీ అందుబాటులో ఈ కేంద్రం ఉంటుందన్న ఆయన ఎవరైనా సమస్యలను కంట్రోల్ రూమ్ దృష్టికి తీసుకువస్తే వెంటనే సంబంధిత సమస్యలను పరిష్కరిస్తామన్నారు. పరిస్థితులను ఎదుర్కొనేందుకు బృందాలను సిద్ధంగా ఉంచడం జరిగిందని, మరో రెండు రోజులపాటు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని, భయపడాల్సినంత పరిస్థితులు ఉత్పన్నం కావన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార యంత్రాంగమంతా సమన్వయంతో పనిచేస్తుందన్న ఆయన, ఇటువంటి వదంతులను నమ్మవద్దని ప్రజలకు సూచించారు.

Leave a Reply