Polio Booth | నిండు జీవితానికి రెండు చుక్క‌లు

Polio Booth | నిండు జీవితానికి రెండు చుక్క‌లు

  • పిల్ల‌ల‌కు పోలియో చుక్క‌లు వేయించండి
  • 21న పల్స్ పోలియో కార్యక్రమం
  • జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా

Polio Booth | గుంటూరు కలెక్టరేట్, ఆంధ్రప్రభ: రెండు చుక్క‌ల‌తో నిండు జీవితాన్ని పొంద‌వ‌చ్చ‌ని, పోలియో బూత్‌కు చిన్నారులను తీసుకురండి… పోలియో చుక్కలు వేయించండి అని తల్లిదండ్రులకు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. ఈ నెల 21వ తేదీన
పల్స్ పోలియో కార్యక్రమం సందర్భంగా కలెక్టర్ కార్యాలయం వద్ద ఈ రోజు నిర్వ‌హించిన ర్యాలీకి కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు.

ఈ సంద‌ర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఐదేళ్ల లోపు వయసు ఉన్న ప్రతి చిన్నారికి రెండు పల్స్ పోలియో చుక్కలు వేయించాలన్నారు. జిల్లాలో 2,14,981 మంది పిల్లలు ఉన్న‌ట్లు గుర్తించామ‌న్నారు. 2,57,980 డోసులు, 12,899 వాయల్‌లు సిద్ధం చేశామని వివరించారు. 784 రిస్క్ ప్రాంతాలు గుర్తించామని, 958 పోలియో బూత్‌లు, 16 ట్రాన్సిట్ పాయింట్లు, 6 బఫర్ స్టాక్ పాయింట్లు ఏర్పాటు చేశామని తెలిపారు.104 రూట్‌లు, 72 మొబైల్ టీమ్‌లు, 4,090 వ్యాక్సినేటర్లు ఏర్పాటు చేశామని చెప్పారు. మొత్తం 4,406 మంది వైద్య, విద్యా శాఖ సిబ్బంది ఇందులో పాల్గొంటున్నారని చెప్పారు. పోలియో చుక్కలు వేసిన తరువాత మూడు రోజులు ఇంటింటి పర్యవేక్షణ చేసి చుక్కలు వేయని పిల్లలను గుర్తించి, వేయడం జరుగుతుందని., గుంటూరు పట్టణంలో నాలుగవ రోజు కూడా చేపడతామని తెలిపారు.

Polio Booth

బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు, వివిధ కూడళ్లలో పోలియో శిబిరాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో వైద్య ఆరోగ్య శాఖ, అంగన్‌వాడీ, విద్యా శాఖ, మునిసిపల్, డీఆర్డీఏ, మెప్మా, సంక్షేమ శాఖలు, సచివాలయ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు భాగస్వామ్యం అవుతున్నాయని అన్నారు. ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కలిగేలా ప్రచార పోస్టర్లు, కరపత్రాలు, ర్యాలీలు, తదితర కార్యక్రమాల ద్వారా విస్తృత స్థాయిలో ప్రచారం చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కె విజయ లక్ష్మి, జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి ఏ. శ్రావణ బాబు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply