ఆశా వర్కర్ల ఆగ్రహం..

ఆశా వర్కర్ల ఆగ్రహం..

జీతాలు బకాయిలపై ధర్నా, పోలీసుల అరెస్ట్..

వనపర్తి టౌన్, ఆంధ్రప్రభ : వనపర్తి జిల్లాలో పనిచేస్తున్న ఆశా వర్కర్లు తమకు నెలవారీ వేతనాలు అందకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా నెలలుగా జీతాలు పెండింగ్‌లో ఉన్నాయని ఆరోపిస్తూ, జిల్లా కేంద్రం నుంచి కొత్తకోట హైవే వైపు ధర్నా చేయడానికి సమూహంగా బయలుదేరారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వారిని అడ్డుకుని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీనికి నిరసనగా ఆశా వర్కర్లు స్టేషన్ ముందు కొంతసేపు ధర్నాకు దిగుతూ వాగ్వాదానికి దిగారు.

ఈ సందర్భంగా ఆశా వర్కర్లు మాట్లాడుతూ, ప్రభుత్వం పెద్ద స్థాయిలో ఉద్యోగులకు జీతాలు సమయానికి చెల్లిస్తుండగా, తమలాంటి కిందిస్థాయి సిబ్బందికి మాత్రం చిన్నచిన్న వేతనాలు కూడా ఇవ్వకపోవడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. రోగుల సంరక్షణలో భాగంగా మలమూత్రాల నమూనాలు సేకరించడం నుంచి పి ఎచ్ సీ, ల్యాబ్‌లకు అందించడం వరకు ఎన్నో కష్టాలు పడుతున్నామని తెలిపారు.

ప్రజల ఆరోగ్యం కోసం అహర్నిశలు కష్టపడుతున్నప్పటికీ తమకు గౌరవం లేకుండా, జీవనోపాధి కూడా లేకుండా పోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే పెండింగ్‌లో ఉన్న జీతాలను విడుదల చేయాలని, తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.

Leave a Reply