Police | సైబర్‌ నేరాలకు చెక్…

Police | సైబర్‌ నేరాలకు చెక్…

  • ‘ఫ్రాడ్‌ కా ఫుల్ స్టాప్’తో పోలీసుల ముమ్మర ప్రచారం
  • వ్యక్తిగత వివరాలే టార్గెట్‌ చేస్తున్న మోసగాళ్లు
  • డిజిటల్ బందీ డ్రామాలకు లొంగొద్దు: ఏసీపీ రమణమూర్తి

Police | ఖమ్మం, ఆంధ్ర‌ప్ర‌భ : సైబర్ నేరాలకు చెక్ పెట్టాలంటే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని టౌన్ ఏసీపీ రమణమూర్తి స్పష్టంచేశారు. “డిజిటల్ అరెస్ట్” పేరిట భయపెట్టి డబ్బులు ఎగరేసే మాయమాటలకు అసలు లొంగవద్దని ఆయన హెచ్చరించారు.

తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో జరుగుతున్న “ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్” ప్రచార భాగంగా ఖమ్మం ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికులకు ఆయన స్వయంగా అవగాహన కలిపించారు.

ఒక్క తప్పిదమే చాలు..

ఏసీపీ రమణమూర్తి మాట్లాడుతూ… “వ్యక్తిగత వివరాలే సైబర్ నేరగాళ్ల ప్రధాన ఎంట్రీ పాయింట్” అని స్పష్టం చేశారు. పాస్‌వర్డ్‌లు, బ్యాంక్ ఖాతా నంబర్లు, OTPలు, క్రెడిట్/డెబిట్ కార్డ్ వివరాలు వంటి కీలక సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోకూడదని హెచ్చరించారు. తెలియని లింకులు, అనుమానాస్పద అటాచ్‌మెంట్‌ల‌తో.. మొబైల్‌లోకి వైరస్‌లను దింపి వ్యక్తిగత డేటాను దోచుకునే అవకాశముందని వివరించారు.

“డబ్బు పంపు… కేసులో ఇరుక్కుంటావు… డిజిటల్‌గా అరెస్ట్ చేస్తాం” వంటి బెదిరింపులన్నీ మోసగాళ్ల పన్నాగాలని ప్రజలు గుర్తుంచుకోవాలని సూచించారు. కాల్ వచ్చిన వెంటనే కట్ చేయడం, ఆ వివరాలను సైబర్ విభాగానికి పంపించడం ప్రజల భద్రతకు ప్రథమ అడుగు అని అన్నారు.

ఖమ్మం బస్టాండ్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అవగాహన కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ బాలకృష్ణ కూడా పాల్గొని ప్రయాణికులకు బ్రోషర్లు అందించారు. “మోసగాళ్లు ఎంత తెలివిగా ప్రవర్తించినా… మీరు ఒక చిన్న జాగ్రత్త వహిస్తే చాలు, వారి ప్లాన్ మొత్తం బగ్గమంటుంది” అని అధికారులు పేర్కొన్నారు. ప్రజలకు సురక్షితమైన డిజిటల్ వాతావరణం కల్పించేందుకు పోలీసులు చేస్తున్న ఈ ప్రచారం మంచి స్పందనను అందుకుంటోంది.

Leave a Reply