ఆదిలాబాద్, ఆంధ్రప్రభ : ఇచ్చోడ మండలం ధర్మపురిలో విద్యార్థులపై విషప్రయోగం జరిగింది. అయితే సిబ్బంది అప్రమత్తం వల్ల సుమారు 30మంది విద్యార్థులకు ప్రాణహాని తప్పింది. విద్యార్థులు తాగేనీటి ట్యాంకులో దుండగులు పురుగుల మందు కలిపారని సిబ్బంది గుర్తించారు. అలాగే మధ్యాహ్న భోజన సామాగ్రిపై కూడా చల్లారు. ధర్మపురిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల హెచ్ఎం ప్రతిభ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సంఘటన వివరాలు….
స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పాఠశాలకు శనివారం, ఆదివారం సెలవులు రావడంతో సిబ్బంది పాఠశాలలో వంటగదికి తాళం వేసి వెళ్లారు. సోమవారం ఉదయం వంట చేసేందుకు పాత్రలు కడిగే సమయంలో చెడు వాసన, నురగలు వచ్చాయి. అప్రమత్తమైన సిబ్బంది చుట్టూ చూడగా పురుగుల మందు డబ్బా కనిపించింది. తాగునీటి ట్యాంకులోనూ దాన్ని కలిపినట్లు వారు గుర్తించారు. విద్యార్థులను తాగునీటి కుళాయిల వైపు వెళ్లకుండా చూశారు. మధ్యాహ్న భోజనం వండలేదు. దీంతో ఆ పాఠశాలలో చదువుతున్న 30మంది విద్యార్థులకు పెను ముప్పు తప్పింది. దీంతో గ్రామస్థులు ఊపిరి పీల్చుకున్నారు.