- పరవశించిన భక్తజనం
భీంగల్ టౌన్, ఆంధ్రప్రభ : ‘‘అలర చంచలమైన ఆత్మలందుండ నీ యలవాటు చేసెనే వుయ్యాల పలుమార్లు ఉచ్వాస పవనమంధుండ నీ భావంబు దెలిపెనే వుయ్యాల… ఉయ్యాల’’ అంటూ భక్తి సంకీర్తనలతో ఆలయ ధర్మకర్తలు ఆ దేవదేవుని డోలసేవని మంగళవారం ఘనంగా నిర్వహించారు.
జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన లింబాద్రిగుట్టపై అక్టోబర్ 27 నుండి కొనసాగుతున్న శ్రీ లక్ష్మీ నృసింహస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా ఎనిమిదవ రోజు సీతానగరిపై ఆలయ పండితులు పార్థసారథి, విజయసారథి, వాసుదేవ చార్యులు ఆధ్వర్యంలో డోల సేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
మంగళవారం నాడు జరిగిన ఈ మధుర ఘట్టాన్ని తిలకించిన భక్తజనం ఆనంద పరవశంతో మునిగి తేలారు. స్వామివారి ఆలయానికి పశ్చిమ వైపున ఉన్న జోడు లింగమునకు వెళ్లే దారిలో ఉన్న సీతానగరంలో గల నాలుగు స్తంభాల రాతి మందిరంలో డోలా సేవ కార్యక్రమం చేపట్టారు.
శ్రీ లక్ష్మీ నరసింహ ఉత్సవమూర్తులను పల్లకిలో వేద మంత్రోచ్ఛారణల నడుమ భాజా భజంత్రీలు మేళతాళాలతో సీతానగరంలోని మండపానికి తీసుకువచ్చి డోల సేవను కన్నుల పండుగ నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తి పాటలు పాడుతూ పారవశంలో మునిగిపోయారు. తిరుగు ప్రయాణంలో జోడులింగంలకు ఎదురుగా నిలిపి శ్రీ లక్ష్మీనరసింహుని నుంచి జోడు లింగముల దర్శనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.



