Pension | డబ్బుల కోసం కారోబార్ లంచావతారం

Pension | లక్షేట్టిపేట, ఆంధ్రప్రభ : మండలంలోని పాత కొమ్ముగూడెం గ్రామ పంచాయితీ కారోబార్ సురేష్ తన తల్లికి పెన్షన్ ఇప్పించడానికి పదిహేను వందల రూపాయలు తీసుకుని ఇప్పటికీ ఆ పని చేయలేదని బుసురాజుల రాజు ఆరోపించారు. గురువారం పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం…. తన తండ్రి బుసురాజుల మల్లయ్య నాలుగు నెలల క్రితం మరణించగా, ఆ వృద్ధాప్య పెన్షన్ ను తన తల్లికి మార్చుకోవడానికి అవసరమైన సర్టిఫికెట్స్ కోసం పదిహేను వందలు అడుగగా కారోబార్ సురేష్ కు ఇచ్చినట్లు వివరించాడు.

గత నాలుగు నెలలుగా తన తల్లికి పెన్షన్ రాకపోవడంతో పలు రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. తాను హైదరాబాద్ లో పని చేసుకుంటూ జీవనం గడుపుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ కారోబార్ లంచావతారం గురించి ఇప్పటికే పాత కొమ్ముగూడెం సర్పంచ్ దుమ్మని సత్యన్నకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపారు.

డబ్బులు తీసుకున్నప్పటికి కూడా పెన్షన్ ఇప్పించకుండా మనో వేదనకు గురిచేస్తున్న కారోబార్ సురేష్ పై సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేశారు.ఈ విషయమై ఎంపీడీఓ సరోజ ను ‘ఆంధ్రప్రభ’ వివరణ కోరగా, విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Leave a Reply