AP | మ‌న్యంలో ప్ర‌శాంతంగా బంద్

  • 1/70 చట్టాన్ని కొన‌సాగించాలంటున్న గిరిజ‌నం
  • స్వ‌చ్చందంగా విద్య‌, వాణిజ్య స‌ముదాయాలు క్లోజ్
  • ఇంట‌ర్ ప్రాక్టీక‌ల్ ప‌రీక్ష‌లు వాయిదా
  • రేపు కూడా కొన‌సాగ‌నున్న బంద్
  • 1/70 చట్టం ర‌ద్దు చేయ‌బోమ‌ని చంద్ర‌బాబు


అర‌కు – అట‌వీ శాఖ, గిరిజ‌న సంక్షేమం కోసం అమ‌లు చేస్తున్న 1/70 చ‌ట్టం ర‌ద్దు చేయ‌నున్నార‌నే వార్త‌ల నేప‌థ్యంలో మ‌న్యం జిల్లాల గిరిజ‌న ప‌రిర‌క్ష‌ణ స‌మితి ఇచ్చిన పిలుపు మేరకు 48గంట‌ల బంద్ నేటి ఉద‌యం ప్రారంభ‌మైంది. జిల్లా కేంద్రం పాడేరులో ఎక్కడిక‌క్కడ వాహనాలను అడ్డుకుంటున్నారు. ఇవాళ, రేపు బంద్ జరుగుతున్న నేపథ్యంలో పర్యాటక కేంద్రాలు మూతపడ్డాయి. విద్యా, వాణిజ్య స‌ముదాయ‌ల‌ను స్వచ్చందంగా మూసివేశారు. బంద్‌ నేపథ్యంలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలను వాయిదా వేశారు అధికారులు..

స్పీక‌ర్ వ్యాఖ్యల‌తో గిరిజ‌నుల గ‌రం గ‌రం..
ఇటీవల విశాఖలో జరిగిన రీజనల్ టూరిజం పెట్టుబడిదారుల సదస్సులో ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు చేసిన సూచనలతో ప్రజా సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పర్యాటక కేంద్రాలను ఫ్రీజోన్ చేయడం ద్వారా పెట్టుబడులకు అవకాశం కల్పించే దిశగా వున్న సాధ్యాసాధ్యాలను పరిశీలించాలన్నారు అయ్యన్న. అదే జరిగితే వన్ ఆఫ్ సెవెంటీ చట్టం రక్షణ కోల్పోవాల్సి వస్తుందనేది ఆందోళన. ఈ క్రమంలో ఆదివాసీ సంఘాల బంద్ కు వైసీపీ మద్దతు ప్రకటించింది.

స్వర్ణాంధ్ర ప్రదేశ్‌ విజన్‌-2047లో భాగంగా టూరిజం పాలసీని ముందుకుతెచ్చిన కూటమి ప్రభుత్వం ప్రకృతి సిద్ధమైన ఏజెన్సీలోని పర్యాటక ప్రాంతాలను ప్రైవేటుకు అప్పగించేందుకు రంగం సిద్ధం చేస్తుందని మండిపడుతున్నారు గిరిజ‌నులు.. పాలకుల విధానాల ఫలితంగా గిరిజన సలహా మండలి (టీఏసీ), పీసా చట్టం వంటి గిరిజన రక్షణ కవచాలు ఒక్కొక్కటీ నిర్వీర్య దిశగా వెళ్తున్నాయని ఫైర్‌ అవుతున్నారు.. ఆదివాసీ ప్రాంతంలో గిరిజనులకు ఉద్యోగ రిజర్వేషన్‌ను కల్పించే జీవో3 రద్దుతో అనేక మంది గిరిజనేతర ఉద్యోగులు ఏజెన్సీకి రావడంతో ఇక్కడి గిరిజన యువతకు ఉద్యోగాలు లేకుండాపోయాయి. ఈ విషయమై ఆదివాసీల్లో అసంతృప్తి నెలకొంది. ఈ క్రమంలో ఆదివాసీల హక్కులు, చట్టాల రక్షణకు కొన్నాళ్లుగా ఆందోళనలు, నిరసనలు జరుగుతున్నాయి.

ఈ తరుణంలో స్పీకర్‌ అయ్యన్న చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోసినట్టు అయ్యింది.. అయితే, బంద్‌ ప్రభావంతో అరకు, పాడేరు ఏరియాలో పర్యాటక కేంద్రాలు పూర్తిస్థాయిలో మూతపడ్డాయి. మరోవైపు.. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అమలులో ఉంటడంతో ర్యాలీలు, బహిరంగ సభలపై నిషేధం విధించారు పోలీసులు.. అయితే వాహనాల రాకపోకలను నిరసనకారులు అడ్డుకుంటున్నారు..

1/70 చట్టాన్ని తొలగించే ఉద్దేశ్యం లేదు… చంద్ర‌బాబు
కాగా గిరిజన హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. 1/70 చట్టాన్ని తొలగించే ఉద్దేశ్యం లేదని స్పష్టం చేశారు. గిరిజన జాతుల అస్థిత్వాన్ని కాపాడుకోవడం అంటే భారతీయ సంస్కృతిని కాపాడుకోవడమేనని తాము బలంగా నమ్ముతున్నామని చెప్పారు. అందుకే వారి విద్య, వైద్యం, జీవన ప్రమాణాలను మెరుగు పరచడానికి తాము నిరంతరం పనిచేస్తున్నామని అన్నారు. ఈ మేరకు సోషల్ మాధ్యమం ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబు స్పందించారు. గిరిజనుల సంక్షేమం, అభివృద్ధి కోసం ప్రత్యేక కార్యక్రమాలు అందించామని గుర్తుచేశారు. బంద్ ను విర‌మించాల‌ని పిలుపునిచ్చారు.

వైసీపీ విష‌ప్ర‌చారం – మంత్రి గుమ్మిడి..
యాక్ట్ 1/70 మార్చే ఆలోచన ప్రభుత్వానికి లేదని, 1/70 యాక్ట్ ను పరిరక్షిస్తామని, ఆదివాసీ చట్టాలను అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, గిరిజనులు ఆందోళన చెందవద్దని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు. వైఎస్సార్‌సీపీ నేతలు విషప్రచారం చేస్తూ.. అసత్యాలు చెప్తే కఠిన చర్యలు తప్పవని మంత్రి హెచ్చరించారు. గిరిజనులకు మెరుగైన సంక్షేమం అందిస్తూ వారి జీవన ప్రమాణాలు మెరుగుపరిచే దిశగా కూటమి ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు. 5ఏళ్ల వైఎస్సార్‌సీపీ పాలనలో జగన్ గిరిజనుల జీవితాలతో ఆడుకున్నారని, అటవీ ప్రాంతాలను గంజాయికి అడ్డాగా మార్చిన వైఎస్సార్‌సీపీ నేతలు గిరిజనుల ఉపాధికి గండికొట్టారని దుయ్యబట్టారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని గంజాయి రహిత ఆంధ్రప్రదేశ్‌గా మార్చటంతో పాటు గిరిజనులకు మెరుగైన ఉపాధి అవకాశాలు అందేలా చర్యలు తీసుకుంటోందని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *