న్యూ ఢిల్లీ|భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య నేడుచర్చలు జరగనున్నాయి. కాల్పుల విరమణ ఒప్పందం మేరకు, తదుపరి పరిస్థితుల గురించి చర్చించనున్నారు. నేటి మధ్యాహ్నం 12 గంటలకు కీలక చర్చలు జరగనున్నాయని అధికారవర్గాలు వెల్లడించాయి. హాట్‌లైన్ వేదికగా జరిగే ఈ చర్చల్లో రెండు దేశాల డైరెక్టర్ జనరల్ మిలటరీ ఆఫరేషన్స్ (డీజీఎంవో)లు పాల్గొంటారు. కాల్పుల విరమణ కొనసాగింపు, ఉద్రిక్త వాతావరణం తగ్గించడం వంటి కీలక అంశాలు ప్రస్తావనకు రానున్నాయి.
ఇరుదేశాల మధ్య యుద్ధం నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం 3.35 గంటలకు తొలుత పాకిస్థాన్ డీజీఎంవో నుంచి భారత డీజీఎంవోకు హాట్‌లైన్ కాల్ వచ్చింది. ఈ సందర్భంగా పాక్ వైపునుంచి కాల్పుల విరమణ అంశానికి సంబంధించి ప్రతిపాదన వచ్చింది. దానిపై భారత్ సానుకూలంగా స్పందించడంతో కొద్దిగంటల్లోనే ఒప్పందం అమల్లోకి వచ్చింది.
హాట్‌లైన్ చర్చల ఎజెండా గురించి స్పష్టమైన ప్రకటన వెలువడనప్పటికీ, భారత విదేశాంగ శాఖ మాత్రం పీవోకేనే కీలకమని చెబుతోంది. కాశ్మీర్ విషయంలో భారత్‌కు స్పష్టమైన వైఖరి ఉందని, పాక్ ఆక్రమిత కాశ్మీర్‌ను అప్పగించడం మినహా చర్చలలో మరో ప్రధాన విషయం ఏమీ ఉండదని తెలిపింది. అంతకు మించి మాట్లాడేది లేదని పేర్కొంది. ఉగ్రవాదుల విషయంలో వాళ్లు మాట్లాడితే మేమూ మాట్లాడతాం. ఇందులో ఎవరి మధ్యవర్తిత్వాన్ని కోరుకోవడం లేదని విదేశాంగ శాఖ వెల్లడించింది.