PD Act | ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి

PD Act | ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి

  • విద్యార్థి, యువజన నేతలపై అక్రమ కేసులు ఎత్తివేయాలి
  • ఏఐఎస్ఎఫ్–వైఎస్ఆర్ యూత్ ఫెడరేషన్ డిమాండ్

PD Act | చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్(Reimbursement) స్కాలర్షిప్ బకాయిలు రూ.6,400 కోట్లను తక్షణమే విడుదల చేయాలని, విద్యార్థి, యువజన నాయకులపై పెట్టిన అక్రమ కేసులు, రౌడీషీట్లు, పీడీ యాక్టులను వెంటనే రద్దు చేయాలని ఏఐఎస్ఎఫ్, వైఎస్ఆర్ యూత్ ఫెడరేషన్ నాయకులు డిమాండ్ చేశారు.

చిత్తూరు పట్టణంలోని ఎస్టీయూ కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్, వైఎస్ఆర్ యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. విశాఖపట్నంలో శాంతియుత నిరసన కార్యక్రమాలు చేపట్టిన ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ నాయకులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి రౌడీషీట్లు తెరవడం, అనకాపల్లి రైతు సంఘం జిల్లా కార్యదర్శి అప్పలరాజుపై పీడీ యాక్ట్(PD Act) నమోదు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని విమర్శించారు.

కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీలను విస్మరించిందని ఆరోపించారు. విద్యా రంగంలో మౌలిక సదుపాయాల కల్పన, సామాజిక సంక్షేమ హాస్టళ్ల అభివృద్ధి, కేజీబీవీలలో వసతుల మెరుగుదల, మెస్సు బిల్లుల పెంపు, పీపీపీ విధానంలో మెడికల్ కళాశాలల నిర్వహణ రద్దు, ఖాళీ పోస్టుల భర్తీ(filling of vacant posts), నిరుద్యోగులకు ఉద్యోగాలు, నిరుద్యోగ భృతి కల్పించాలంటూ డిమాండ్ చేశారు.

సమస్యలను పరిష్కరించమని ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టడం సరైంది కాదని, అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థి, యువజన, ప్రజాసంఘాలను కలుపుకుని ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏఐఎస్ఎఫ్ చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి బి. ప్రవీణ్ కుమార్, వైఎస్ఆర్ యూత్ ఫెడరేషన్ నాయకులు మనోజ్ కుమార్ రెడ్డి, వసంత్, చరణ్, సంతోష్, శబరీస్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply