PawanKalyan | 750 మంది కార్యకర్తలతో సమావేశం

PawanKalyan | 750 మంది కార్యకర్తలతో సమావేశం

  • ప్రజల కోసమే నా ప్రయాణం
  • చిత్తూరులో కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ భావోద్వేగ ప్రసంగం

చిత్తూరు, ఆంధ్రప్రభ బ్యూరో : పదవి, పరువు, ప్రతిష్టలన్నీ పక్కన పెట్టి ప్రజల కోసమే రాజకీయాల్లో అడుగుపెట్టానని, తన ప్రయాణం మాత్రం గుర్తింపుకోసం కాదని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. పదవి నాకు అలంకారం కాదు… అది ఓ బాధ్యత. ప్రజలు ఇచ్చిన ధర్మం అని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ భావోద్వేగంతో వెల్లడించారు. చిత్తూరులో నిర్వహించిన విశాలమైన జనసేన కార్యకర్తల సమావేశంలో.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన రాజకీయ లక్ష్యం గురించి మాట్లాడుతూ.. గుర్తింపు కోసం పనిచేయను… ప్రజల కోసం మాత్రమే పనిచేస్తా అని స్పష్టంచేశారు.

PawanKalyan | కష్టపడితేనే గుర్తింపు దానంతట అదే

PawanKalyan

జనసేన కార్యకర్తలు కష్టపడితేనే గుర్తింపు దానంతట అదే వచ్చేస్తుందన్నారు. పదవి అంటే అధికారాన్ని ప్రదర్శించే సాధనం కాదని, ప్రజల సమస్యలు తీర్చడానికి ఉపయోగించే ఆయుధమని ఆయన భావజాలం ఈ సమావేశానికి మరింత బలం చేకూర్చింది. చిత్తూరు పర్యటనలో భాగంగా సుమారు 750 మంది కార్యకర్తలతో సమావేశం నిర్వహించిన పవన్ కళ్యాణ్, ఒక్కొరి సమస్యలు విన్నట్టు తెలిపారు. వీర మహిళలను కలుసుకుని, వారి ఇబ్బందులు తెలుసుకుని, పరిష్కార దిశగా తీసుకెళ్లేందుకు అధికారులు పనిచేయాలని సూచించిన‌ట్టు తెలిపారు.

జనసేన శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నింపుతూ, పార్టీ కార్యకర్తల శ్రమ ఎప్పటికీ వృథా కాదని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఏ పరిస్థితుల్లోనైనా కార్యకర్తలు ధైర్యం కోల్పోవద్దని, నమ్మకం, క్రమశిక్షణతో పనిచేయాలని ఆయన సూచించారు. కార్యకర్తలు భయపడకుండా, నిలబడిన చోటే న్యాయం సాధించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమంపై మాట్లాడిన పవన్ కళ్యాణ్…. ఇటీవల ఒకేసారి పది వేల మందికి పదోన్నతులు ఇవ్వడం తమ ప్రభుత్వ నిర్ణయం వల్లే సాధ్యమైందని చెప్పారు.

PawanKalyan | రిస్క్ తీసుకుంటూ పనిచేసినప్పుడే విజయం

ఇంటింటా పదోన్నతి అంటే ప్రతి కుటుంబానికి ఎంతటి గౌరవమో ప్రభుత్వానికి తెలుసు. అందుకే ఆ నిర్ణయం తీసుకున్నామ‌ని వెల్లడించారు. రిస్క్ తీసుకుంటూ పనిచేసినప్పుడే విజయం సాధ్యమని, గత ఐదేళ్లుగా నిద్రలేని శ్రమకే ఈ విజయమని పవన్ కళ్యాణ్ అన్నారు. 2008 నుండి రాజకీయాల్లో ఉన్నానని, ఎన్నో విమర్శలు భరించానని, కానీ ప్రజల కోసం పోరాడే తన ధృఢ సంకల్పం ఎప్పుడూ మారలేదని స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లాలో జరిగిన ఈ సమావేశం జనసేన రాజకీయ దిశకు కొత్త శక్తిని జోడించిందని పార్టీ నాయకులు తెలిపారు. సమావేశంలో చిత్తూరు ఎమ్మెల్యే జగన్మోహన్ నాయుడు, పూతలపట్టు ఎమ్మెల్యే కలికిరి మురళీమోహన్, తిరుపతి ఎమ్మెల్యే జంగాలపల్లి శ్రీనివాసులు, జనసేన ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

click here to read Nandigama MLA | ప‌టిష్ట వ్య‌వ‌స్థ‌ల‌తోనే అభివృద్ధి ప‌రుగులు..

click here to read more

Leave a Reply