నిబంధనల ప్రకారం ప్రభుత్వ రాజముద్రతో పాస్ బుక్స్

నిబంధనల ప్రకారం ప్రభుత్వ రాజముద్రతో పాస్ బుక్స్

వక్కలగడ్డలో 747 మంది రైతులకు పాస్ పుస్తకాల పంపిణీ ప్రారంభించిన ఎమ్మెల్యే

చల్లపల్లి – ఆంధ్రప్రభ : కూటమి ప్రభుత్వం రైతులకు నిబంధనల ప్రకారం ప్రభుత్వ రాజముద్రతో పాస్ బుక్స్ అందిస్తోందని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. సోమవారం చల్లపల్లి మండలం వక్కలగడ్డ గ్రామ పంచాయతీ కార్యాలయంలో రైతులకు 747 పట్టాదారు పాస్ బుక్స్ పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో రైతులను భయభ్రాంతులకు గురి చేసిందన్నారు.

రైతుల ఆస్థి అయిన భూ హక్కు పత్రాలు పాస్ పుస్తకాలపై, రీ-సర్వే సరిహద్దు రాళ్ల మీద గత ముఖ్యమంత్రి ఫోటో వేసుకోవటంతో రైతుల్లో ఆందోళన నెలకొందన్న దశలో తాము రైతుల పక్షాన నిలిచి ఉద్యమించి నాటి ప్రభుత్వం కళ్ళు తెరిపించే ప్రయత్నం చేసినా స్పందన కొరవడిందన్నారు. ఈ దశలో ఎన్నికల ముందు రైతులకు కూటమి ఇచ్చిన హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయటమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ప్రతి రైతుకు ప్రభుత్వ రాజముద్రతో పాస్ బుక్స్ అందిస్తోందన్నారు.

అంతేకాకుండా ప్రతి పాస్ బుక్ రైతు పరిశీలన తరువాతే ముద్రించి తప్పులకు తావులేకుండా పాస్ బుక్స్ జారీ చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ తోట కనకదుర్గ, తహసీల్దార్ ద్రోణవల్లి వనజాక్షి, పీఏసీఎస్ చైర్మన్ మల్లుపెద్ది దుర్గామహేష్, ఆర్ఐ ఘంటసాల కృష్ణమోహన్, రీ-సర్వే డీటీ చిన్నం నీలిమ, పంచాయతీ కార్యదర్శి గరికపూడి శైలజ, వీఆర్ఓలు ప్రతిమ, కిరణ్, ప్రశాంత్ పాల్గొన్నారు.

Leave a Reply