న్యూ ఢిల్లీ – లోక్‌సభ, రాజ్యసభలో నేడు ప్రారంభమైన కొన్ని నిమిషాల వ్యవధిలోనే వాయిదా పడ్డాయి.. ముందుగా మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా పడగా, ఆ తర్వాత కూడా విపక్షాల నిరసనలు కొనసాగడంతో ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.. కాగా స్పీకర్ ఓం బిర్లా అధ్యక్షతన నేడు ప్రారంభమైన లోక్‌సభ ప్రారంభమైన నిమిషాల్లోనే విపక్ష సభ్యుల ఆందోళన వాయిదా తీర్మానాలు చర్చించాలని పట్టు పట్టారు..కాంగ్రెస్ సహా ప్రతిపక్ష సభ్యులు నినాదాలు చేస్తూ, ఆపరేషన్ సిందూర్‌పై చర్చించాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ ఆందోళనలు చేయడంతో, దిగువ సభ కార్యకలాపాలలను తొలుత మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు. అయితే తిరిగి సభ ప్రారంభం కాగానే ప్రతిపక్ష సభ్యులు నిరసనలు కొనసాగించడంతో, స్పీకర్ ఓం బిర్లా సభను మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా వేశారు . తిరిగి సమావేశమైన ఉభయ సభలలో విపక్షాలు మెట్టు దిగకపోవడంతో రేపటికి సభ కార్యక్రమాలను వాయిదా వేశారు.
రాజ్యసభలోనూ సేమ్ సీన్ .
ప్రతిపక్ష పార్టీల ఆందోళనల మధ్య రాజ్యసభ కార్యకలాపాలు మధ్యాహ్నం రెండు గంటల వరకు వాయిదా పడ్డాయి. రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ సోమవారం రాత్రి ఆకస్మిక రాజీనామా చేయడంపై ప్రతిపక్ష సభ్యుల ఆందోళనల మధ్య ఎగువ సభ ఉదయం కార్యకలాపాలు మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా పడ్డాయి. తరువాత కూడా నిరసనలు కొనసాగడంతో మధ్యాహ్నం 2 గంటల వరకూ వాయిదా వేశారు. డిప్యూటీ చైర్మన్ హరివంశ్ సమావేశాలకు అధ్యక్షత వహించారు. ధన్‌ఖడ్ రాజీనామా, బీహార్‌లో ఓటర్ల జాబితాల ప్రత్యేక ఇంటెన్సివ్ సవరణ అంశాలపై చర్చ చేపట్టడానికి ప్రతిపక్షాలు ఇచ్చిన వాయిదా నోటీసులను హరివంశ్ తిరస్కరించారు. దీంతో సభ్యులు సభలోనే ఆందోళన చేపట్టారు..
ఈ వార్తను కూడా పరిశీలించండి Vijayawada | సమస్యలను పరిష్కరించండి.. ఆర్ బీ చైర్మన్ కు ఎంపీ కేశినేని విజ్ఞప్తి
నిన్న కూడా..
తొలిరోజున ప్రతిపక్షాలు.. పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్‌పై చర్చకు డిమాండ్ చేయడంతో ఉభయ సభలు వాయిదా పడిన సంగతి తెలిసిందే. తొలిరోజు నిరసనల మధ్యనే రాజ్యసభ.. షిప్పింగ్ డాక్యుమెంటేషన్ చట్టాలను ఆధునీకరించే లాడింగ్ బిల్లును విజయవంతంగా ఆమోదించింది . హైకోర్టు న్యాయమూర్తి యశ్వంత్ సిన్హాపై మోపిన అభిశంసనపై రాజ్యసభలో ప్రసంగించిన అనంతరం ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖర్ తన పదవికి రాజీనామా చేశారు.
నెల రోజులు వర్షాకాల సమావేశాలు
జూలై 21న ప్రారంభమైన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఆగస్టు 21 వరకు జరగనున్నాయి. ఆగస్టు 12 నుండి ఆగస్టు 17 వరకు స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల విరామం ఉంటుంది. ఆగస్టు 18న తిరిగి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా జస్టిస్ యశ్వంత్ వర్మపై మోపిన అభిశంసన తీర్మానంపై ఐయూఎంఎల్ ఎంపీ ఈటీ మహమ్మద్ బషీర్ మాట్లాడుతూ, ఈ అభిశంసన చాలా ముఖ్యమైనది. ఆ న్యాయమూర్తి వ్యవహారాల కారణంగా భారత న్యాయవ్యవస్థ స్థితి మరింత దిగజారింది. అందుకే తాము దీనిపై మెమోరాండంను స్పీకర్‌కు సమర్పించామన్నారు. ప్రభుత్వం దీనిపై స్పందిస్తుందని ఆశిస్తున్నామని బషీర్ పేర్కొన్నారు.
పార్లమెంట్ ఆవరణలో విపక్షాల నిరసనల హోరు.

బీహార్‌లో స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ పేరుతో ఓటర్ల జాబితాను సవరించడానికి వ్యతిరేకంగా పార్లమెంట్ భవనం ఆవరణలో ప్రతిపక్ష ఎంపీలు నిరసన ప్రదర్శన నిర్వహించారు. లోక్‌సభ లో ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ , సమాజ్‌వాది పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ సహా ప్రతిపక్ష ఎంపీలంతా ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎంపీలు నినాదాలు చేశారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివ్యూ పేరుతో ఎన్నికల సంఘం అధికార బీజేపీ వ్యతిరేక ఓటర్లను జాబితా నుంచి తొలగించిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
