Parents | ఇలా చిదిమేసుకుంటే ఎలా…

Parents | ఇలా చిదిమేసుకుంటే ఎలా…
Parents | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : తమ పిల్లలకు ఏ చిన్న దెబ్బ తగిలినా కన్నపేగు తల్లడిల్లిపోతుంది… తమ ప్రాణాలను అడ్డు పెట్టయినా వారి ప్రాణాలను కాపాడుకోవాలని విశ్వప్రయత్నం చేస్తారు. ఏదైనా వ్యాధిబారిన పడినా, ప్రమాదానికి లోనయినా, ఆస్తులమ్మి, అన్నీ వదులుకుని వారి ప్రాణాలను దక్కించుకుంటారు. మానసిక, శారీరక లోపాలున్నా, తమ ప్రాణమున్నంత వరకు కంటికి రెప్పలా కాపాడుకుంటారు కానీ… కంచె చేను మేస్తే? అన్నట్టుగా వార్తల్లో కనిపిస్తున్న సంఘటనలు ఆశ్చర్యం గొలుపుతున్నాయి.
Parents | అసలు ఆత్మహత్య ఆలోచనే..

ఆర్థిక ఇబ్బందులు, మనస్ఫర్థలు.. దంపతుల మధ్య ఘర్షణలు… భార్యాభర్తల్లో ఎవరో ఒకరిని ఆత్మహత్యలకు ప్రేరేపిస్తున్న దారుణ పరిస్థితులు. ప్రశాంతంగా ఆలోచిస్తే.. ప్రతి సమస్యకూ పరిష్కారముంటుందనే ఆలోచన మాని, ఆత్మహత్యే అంతిమ పరిష్కారమని తలచి, నిండు జీవితాలను అర్థంతరంగా ముగిస్తున్నారు. ఇక్కడ ఇంతకన్నా దారుణమైన విషయమేమిటంటే.. ముగిస్తున్న తమ జీవితాలతో బాటు, నిండు నూరేళ్ళ భవిష్యత్తున్న తమ పిల్లలని కూడా చిదిమేస్తున్నారు.
Parents | లోపం ఎక్కడుందో?
భార్యాభర్తల మధ్య అభిప్రాయ బేధాలు, మాట పట్టింపులు, పంతాలు… ఇలా రకరకాల కారణాల వల్ల దాంపత్య జీవితాల్లో ఇలాంటి దారుణాలు చోటు చేసుకుంటున్నాయి. పాతకాలంలో లాగా అభిప్రాయ బేధాలొస్తే.. సర్ధి చెప్పేందుకు పెద్దల ప్రమేయాన్ని కూడా సహించడం లేదు ఇప్పుడు. అన్నీ స్వతంత్ర్య నిర్ణయాలే. క్షణికావేశాలే.. ఈ విధంగా జీవితాన్ని చాలించాలనుకుంటే.. మేమిప్పటికి ఎన్నోసార్లు చనిపోయి ఉండేవాళ్లమో అంటారు ఎంతో జీవితాన్ని చూసిన పెద్దవారు.
Parents | ఆదాయానికి మించి ఈ.ఎం.ఐ.లు
ఇప్పుడన్నీ చేతికందేంత దూరంలోనే. చిన్నవయసులోనే అన్నీ సమకూర్చుకోవాలనే ఆరాటంలో క్రెడిట్ కార్డులను ఇబ్బడి ముబ్బడిగా వాడేస్తూ, వచ్చే ప్రతి వస్తువును ఇన్స్టాల్ మెంట్లలో కొనేస్తున్నారు. అవి పేరుకే ఈజీ ఇన్స్టాల్ మెంట్లు. కట్టేటప్పుడు వాటి కష్టం తెలుస్తుంది. అవి మధ్యలో ఉండగా ఉద్యోగాలకేమైనా తేడా వచ్చిందో, ఇక అంతే సంగతులు.
Parents | మరి పిల్లల్నెందుకు బలి చెయ్యడం?
న్యూక్లియర్ ఫ్యామిలీస్ అయిపోయాక, మనిషి ఒంటరి జీవి అయిపోయాడు. ఎవరికీ ఎవరి మీదా నమ్మకాలు లేవు. అందుకే తాము లేకుండా తమ పిల్లలను ఎవరూ చూడరన్న బాధ, తాము లేకుండా వారు బ్రతకలేరన్నబాధ… ఇవన్నీ కలిసి తమతో బాటు వారి పసిప్రాణాలను చిదిమేయడానికి కారణమవుతున్నాయి. ఒక్కొక్కసారి ఇలాంటి ఆత్మహత్యా ప్రయత్నాల్లో, తాము బ్రతికి బయటపడి, పిల్లలు మాత్రం బలైపోతే.. ఆ బాధ వర్ణనాతీతం. ఆ బ్రతుకు నరకప్రాయమే.
Parents | వీటిని ఎలా నివారించడం?
నెట్టింట్లో విహరించే మనం, పక్కింట్లో హాహాకారాలు వినబడుతున్నా పట్టించుకోం. పక్కనున్నవాళ్ళను పలకరించం. అపరిచితుల్లాగే చూస్తాం. ఒకరికొకరు కాస్త పరిచయమున్నా, వారి కదలికల్లో, ముఖకవళికల్లో మార్పు గమనించవచ్చు. బాధ, దుఃఖం, మానసిక ఒత్తిడి వాళ్ళ ముఖాల్లో తెలిసిపోతుంది. కాస్తైనా గమనిస్తే.. నిరుత్సాహం, నిస్తేజం, నిరాశ స్పష్టంగా తెలిసిపోతాయి. వాళ్ళతో మనకున్న సాన్నిహిత్యాన్నిబట్టి విషయాలను కనుక్కోవచ్చు. అవసరమైతే వారి సంబంధీకులకు తెలియపర్చవచ్చు. మానసిక నిపుణుల దగ్గరకు తీసుకెళ్ళవచ్చు.
Parents | కానీ ఈ ఉరుకులు-పరుగుల కాలంలో అంత టైమెక్కడిది ఎవరికైనా?
Parents | ఎవరి కుటుంబంలో ఏం జరుగుతోందో వారికే తెలియని బిజీలైఫ్ లో ఉన్నామందరమూ. సామాజిక బాధ్యత అనేది ప్రశ్నార్థకమైపోవడం ఒక కారణమేనంటారు సామాజికవేత్తలు. వ్యక్తి శ్రేయస్సే సామాజిక సంక్షేమం… సామాజిక సంక్షేమమే జాతి శ్రేయస్సు. భారత దేశ భవితవ్యాన్ని బంగారుమయం చెయ్యాల్సిన రేపటిపౌరులు దురదృష్టవశాత్తూ కన్నవారి చేతిలో అర్థంతరంగా తనువులు చాలిస్తూండడం ఆందోళనకరం. ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన తల్లిదండ్రులే తమతోబాటు వారి జీవితాలకూ చరమగీతం పాడడం సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం. ఎవరైనా ఆత్మహత్యలకు పాల్పడడం ఒక ఘోరమైతే, వారితోబాటు తమ కన్నవారి జీవితాలనూ చిదిమేయడం మరీ దారుణం. ఇది వ్యక్తిగత సమస్య కానే కాదు. ఈ ధోరణి తీవ్రమైన సామాజిక సమస్యగా పరిగణించాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

కౌన్సెలింగ్ సైకాలజిస్ట్, బిహేవియర్ ట్రెయినర్ గాయత్రి ఉప్పలపాటి ఏమంటున్నారంటే….
Parents | ఆత్మహత్యా ధోరణి పోల్చుకోవడం ఎలా?
వ్యక్తిలో గ్రహించాల్సిన మార్పులు:
- మనసులో దిగులుగా ఉండటం
- ఏ పనిపైనా దృష్టి పెట్టలేకపోవడం
- ఏ విషయానికైనా సులభంగా ఏడుపొచ్చేయడం
- నిద్రలేమి/అతిగా నిద్రపోవటం
- బరువు తగ్గిపోవడం
- ఆహారం తినాలనిపించకపోవటం లేదా అతిగా తినేయటం
- ఏ పనీ చేయాలనిపించకపోవడం
- ఏ విషయంలోనూ ఆసక్తి చూపకపోవడం
- నిర్ణయం తీసుకోలేకపోవడం
- సన్నిహితులతో కూడా మాట్లాడాలనిపించకపోవడం
- ఎప్పుడూ ఒంటరిగా ఉండాలనిపించడం
- మరణం గురించి మాట్లాడటం
- ఆత్మహత్యా ప్రయత్నాల గురించి మాట్లాడటం
- ఒంటరిగా ఉండటానికి ఇష్టపడటం
- వంటరిగా మిగిలిపోయామనే భావన
- మానసికంగా ఒత్తిడికి లోనవడం
Parents | కుటుంబానికి సూచనలు:
- ఆత్మహత్యా ధోరణి ఉన్నవారికి, వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు సపోర్ట్ ఇవ్వాలి.
- వారికి మానసికంగా సహకరించాలి.
- వారి సమస్యలను వారు చెప్పుకునేలా ప్రోత్సహించాలి.
- వారి మాటలను మనసుపెట్టి వినాలి.
- వారి సమస్యలను మనసులో పెట్టుకోకూడదు అని గుర్తు చెయ్యాలి.
- వారికి ఎలా సహకరించాలి, ఎలా మాట్లాడితే వారు మానసిక భద్రత (emotional safety) అనుభవిస్తారు అన్న అంశం పైన వారి కుటుంబ సభ్యులకు సైతం కౌన్సిలింగ్ ఇవ్వాలి.
మానసిక నిపుణుల సహాయం:
ఇలాంటి లక్షణాలు కనిపిస్తే, వారిని మానసిక నిపుణుల వద్దకు తీసుకెళ్ళాలి.
- మానసిక నిపుణులు సైకో థెరపీ, మందులతో వారికి సరైన చికిత్స చేస్తారు.
- ఆత్మ హత్య అన్నది వ్యక్తిగత, కుటుంబ మరియు సామాజిక ఆరోగ్య సమస్య.ఎక్కువ శాతం ఆత్మహత్యలకు కుటుంబ వ్యవస్థ విఫలమే కారణం. ఎప్పుడైతే ఒక వ్యక్తి తన కుటుంబానికి చెందుతాను (need for belongingness)అన్న భద్రతాభవం కుటుంబం కలిగిస్తూనే ఉంటుందో అలాంటి కుటుంబం మరియు సమాజంలో ఆత్మహత్యలు వుండవు. వసుధైక కుటుంబం అన్న భారతదేశ ఉద్దేశం/విలువను గౌరవించి తోటి వారి గురించి ఆలోచించడం మొదలుపెడితే ఆత్మహత్యలను నివారించవచ్చు.
భర్తను చంపిన భార్యలు Click Here To Read This
