13 ఏళ్ల వరకు పశువుల కాపరి – ఇప్పుడు జియాలజీలో పీహెచ్​డీ పట్టా

స‌హ‌క‌రించ‌ని కుటుంబ ప‌రిస్థితులు
అమ్మా, నాన్న కూలీ ప‌నుల‌కు
త‌మ్ముడు, చెల్లితో ఇంటివ‌ద్దే కాప‌లా
మ‌లుపు తిప్పిన ద‌సరా బ‌ట్ట‌లు
ఓయూలో నేడు పీహెచ్‌డీ ప‌ట్టా
స్ఫూర్తిదాయ‌కం ప‌ర‌మేశ్ చ‌దువుల నేప‌థ్యం

సెంట్ర‌ల్ డెస్క్‌, ఆంధ్ర‌ప్ర‌భ :

అతడికి చదువంటే ఇష్టం. కానీ, ఇంట్లో పరిస్థితులు అతన్ని పదమూడేళ్లు వరకు బడి బాట పట్టకుండా చేశాయి. కనీసం అప్పటివరకు బలపం పట్టిన దాఖలాలు లేవు. తల్లిదండ్రులు కూలీ పనులకు వెళితే ఇంట్లో ఉన్న తమ్ముళ్లను, చెల్లిని ఆడించేవాడు. తొమ్మిదేళ్ల వయసులో పనిలో చేరాడు. నాన్న జీతానికి ఉండే ఇంట్లో పశువుల కాపరిగా నాలుగేళ్లు పని చేశాడు. స్కూలుకు వెళ్లకపోయినా చదువు మీద ఆసక్తితో దసరా పండగనాడు కొత్త బట్టలు కొనుక్కో అంటే, స్కూల్​ యూనిఫాం కుట్టించుకోవడం అతని జీవితాన్ని కొత్త మలుపు తిప్పింది. అలా పశువుల కాపరిగా పని చేసిన వ్యక్తి నేడు ఓయూ జియాలజీ విభాగం నుంచి పీహెచ్​డీ పట్టా అందుకున్నారు. అతడే నాగర్​ కర్నూల్​ జిల్లా బల్మూర్​ మండలం కొండనగుల గ్రామానికి చెందిన చింతా పరమేశ్​. అతడి చదువుల ప్రస్థానం అంద‌రికీ స్ఫూర్తిదాయ‌కంగా మారింది.

డైరెక్ట్​గా ఏడో తరగతి పరీక్ష..

దసరా పండగనాడు పరమేశ్​ యూనిఫామ్‌ ధరించి ఊళ్లో గుడి వద్ద జరుగుతున్న జాతరకు వెళుతుంటే ఎంవీ ఫౌండేషన్‌ కార్యకర్త మౌలాలీ గమనించి వివరాలు సేకరించారు. ఊరికి సమీపంలోని రాంపూర్‌లో ఎంవీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో బ్రిడ్జ్‌ క్యాంపు ఉందని అందులో చదువుకోవచ్చని చెప్పగా తల్లిదండ్రులను ఒప్పించి యువకుడిని అందులో చేర్చారు. అక్కడ అక్షరాలు దిద్ది చదవడం నేర్చుకున్నాడు. 14 ఏళ్ల వయసులో అక్కడి నుంచే ఏడో తరగతి బోర్డు పరీక్షలు రాసి పాసయ్యాడు. ఆ తర్వాత బల్మూరు మండల కేంద్రంలోని సాంఘిక సంక్షేమ వసతిగృహంలో ఉంటూ అక్కడ ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ పదో తరగతి ఫస్ట్​క్లాస్​లో పాసయ్యాడు. కల్వకుర్తిలోని గురుకుల జూనియర్‌ కళాశాలలో ఇంటర్, హైదరాబాద్‌ సైఫాబాద్‌లోని సైన్స్‌ కళాశాలలో బీఎస్‌సీ, ఓయూ ప్రాంగణంలో ఎంఎస్‌సీ జియాలజీ పూర్తి చేశాడు. పీజీలో 85 శాతం మార్కులతో డిస్టింక్షన్‌లో ఉత్తీర్ణుడయ్యాడు.

ఫెసర్​ కావడమే లక్ష్యం ..

పీజీలో ఉత్తమ మార్కులు సాధించడంతో పరమేశ్‌ ఓయూలో పీహెచ్‌డీ సీటు సంపాదించాడు. రాజీవ్‌గాంధీ నేషనల్‌ ఫెలోషిప్‌నకు ఎంపిక కావడంతో పీహెచ్‌డీ పూర్తి చేయడం సులభమైంది. ప్రొఫెసర్​ మురళీధర్‌ పర్యవేక్షణలో అమ్రాబాద్, పదర మండలాల్లో భూగర్భ జల పరిస్థితులపై రిసెర్చ్​ చేసి పరిశోధనా పత్రం సమర్పించారు. 35 సంవత్సరాల వయసులో ఇటీవల పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. ప్రస్తుతం ఓ ప్రైవేటు సంస్థలో జియాలజిస్టుగా పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా పరమేశ్‌ మాట్లాడుతూ ప్రొఫెసర్‌ కావడమే తన లక్ష్యమని చెప్పారు.

వెల్డ‌న్ ప‌ర‌మేశ్ – ముఖ్య‌మంత్రి రేవంత్ ప్ర‌శంస‌లు

జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ 14 ఏళ్ల వయసులో బడి బాట పట్టి ఏకంగా డాక్టరేట్ సాధించిన చింతా పరమేశ్‌కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందనలు తెలియజేశారు. సంకల్పం, పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని పరమేశ్ నిరూపించారని ప్రశంసించారు. ఈ మేర‌కు సిఎంవో కార్యాల‌యం ఒక ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ఆర్థిక పరిస్థితులు, వయసు, సామాజిక స్థితిగతుల వంటి అడ్డుగోడలను అధిగమించి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి జియాలజీలో పీహెచ్‌డీ పట్టా అందుకుని పరమేశ్ అందరికీ స్ఫూర్తి దాయకంగా నిలిచారని కొనియాడారు. నలుగురికి ఆదర్శప్రాయంగా నిలిచిన పరమేశ్ భవిష్యత్తులో మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. పరమేశ్‌ను వెన్నంటి ప్రోత్సహించిన వారందరికీ ముఖ్యమంత్రి అభినందనలు తెలియజేశారు.

Leave a Reply