Panchayat election | హోరాహోరి ప్రచారం…
Panchayat election | అచ్చంపేట, ఆంధ్రప్రభ : అచ్చంపేట నడింపల్లి గ్రామంలో జరగనున్న గ్రామపంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ప్రధాన రాజకీయ పార్టీలైన బీజేపీ–బీఆర్ఎస్ అలయన్స్, కాంగ్రెస్ పార్టీలు హోరాహోరి ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ రోజు ఇరు పార్టీలు బలపరిచిన అభ్యర్థులు తమ మద్దతుదారులతో కలిసి ఇంటింటి ప్రచారాన్ని చేపట్టి ప్రజలను ఓటు అభ్యర్థించారు. బీజేపీ–బీఆర్ఎస్ అలయన్స్ బలపరిచిన అభ్యర్థి గోపి పద్మ ప్రచారంలో మాట్లాడుతూ…. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలే నేటికీ కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం తప్ప మరే కొత్త సంక్షేమ పథకాన్ని అమలు చేయలేదని విమర్శించారు.

వృద్ధులకు 4 వేల పెన్షన్, వికలాంగులకు 6 వేల రూపాయలు, మహిళలకు రూ.2500 ఇవ్వనున్నట్లు హామీలు ఇచ్చి ఇప్పటివరకు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. ప్రస్తుతం అమలులో ఉన్న సంక్షేమ పథకాలన్నీ కేసీఆర్ ప్రభుత్వంలోనే ప్రారంభమైనవని ఆమె తెలిపారు. డిసెంబర్ 17న జరగబోయే మూడవ విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో తమ పార్టీ గుర్తైన ‘బ్యాట్’ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆమె ప్రజలను కోరారు. ఇదిలా ఉండగా, కాంగ్రెస్ పార్టీ కూడా తమ అభ్యర్థి గెలుపే లక్ష్యంగా ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తోంది. ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తూ ప్రచారాన్ని మరింత ఉధృతం చేస్తున్నారు. నడింపల్లి గ్రామంలో రాజకీయ వాతావరణం రోజురోజుకు ఉత్కంఠభరితంగా మారుతోంది.

