విశాఖపట్నం, (ఆంధ్రప్రభ ) : ఫార్మాస్యూటికల్ పరిశ్రమలో మహిళల ప్రాతినిథ్యాన్ని పెంచడానికి, విశాఖపట్నంలోని ఫైజర్ గ్లోబల్ సప్లై తయారీ యూనిట్, విశాఖపట్నంలోని గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ (గీతం) విశ్వవిద్యాలయంతో భాగస్వామ్యం చేసుకుంది.
వీరంతా ఫైజర్ అటానమస్ టీమ్స్ (పీఏటీ) కార్యక్రమంలో భాగంగా మహిళా సహోద్యోగుల మొదటి బ్యాచ్ గ్రాడ్యుయేషన్ ను ప్రకటించారు. ఈ 36నెలల కార్యక్రమంలో భాగంగా అట్టడుగు స్థాయిలోని మహిళలకు ఉపాధి అవకాశాలను సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు.
సైన్స్ సంబంధిత రంగాల్లో మహిళల ప్రాతినిథ్యాన్ని పెంచే దిశగా ఫైజర్, గీతం విశ్వవిద్యాలయం మధ్య ఈ పరిశ్రమ – విద్యా భాగస్వామ్యంలో భాగంగా చేపట్టిన ఫైజర్ అటానమస్ టీమ్స్ అనే కార్యక్రమం అభ్యసిస్తూనే సంపాదించే అవకాశాన్ని కల్పిస్తుంది.
ఈ కార్యక్రమంలో భాగంగా, స్థానిక మహిళా విద్యార్థులను తమ తయారీ యూనిట్ సిబ్బందితో చేరడానికి ఫైజర్ అవకాశం కల్పించింది. అదే సమయంలో గీతం విశ్వవిద్యాలయంలో వారి విద్యను కొనసాగించడానికి తగిన మద్దతు లభిస్తుంది. ఈ కార్యక్రమంలో భాగంగా 44మంది మహిళా విద్యార్థులతో కూడిన మొదటి బృందం, మైక్రోబయాలజీలో ప్రత్యేకత కలిగిన బీఎస్సీ కెమిస్ట్రీ కోర్సులో విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులయ్యారు.
పీఏటీ విద్యార్థులందరూ మొదటి రోజు నుండి ఫైజర్ ఉద్యోగులుగా ఉన్నప్పటికీ, గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన విద్యార్థులు ఇప్పుడు పూర్తిగా తమ ఉద్యోగాల్లోకి చేరుతున్నందున ఇది ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ప్రస్తుతం, విశాఖపట్నంలోని ఫైజర్ తయారీ యూనిట్లో 340మందికి పైగా మహిళా విద్యార్థులు పీఏటీ ప్రోగ్రామ్లో భాగమయ్యారు.
ఈ కార్యక్రమం గురించి ఫైజర్ వైస్ ప్రెసిడెంట్ (సైట్ హెడ్) బీ.మురళీధర్ శర్మ మాట్లాడుతూ ఫైజర్ అటానమస్ టీమ్స్(పీఏటీ) ప్రోగ్రామ్ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుని తమ సిబ్బందితో చేరిన మొదటి బ్యాచ్ విద్యార్థులను చూడటం చాలా ఆనందంగా ఉందన్నారు.
గీతం డీమ్డ్ టు బి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ డాక్టర్ ఎర్రోల్ డిసౌజా మాట్లాడుతూ పని, సాధారణ విద్య మధ్య సమతుల్యత అనేది విద్యార్థుల ధైర్యానికి మాత్రమే కాదు, అందరి ధైర్యసాహసాలకు నిదర్శనమని, విద్యాభ్యాసాన్ని ఆచరణాత్మక పరిశ్రమ అనుభవంతో కలపడం ద్వారా, ఈ కార్యక్రమం విద్యా – పరిశ్రమ సహకారం యొక్క శక్తిని ప్రదర్శిస్తుందన్నారు.
ఈ కార్యక్రమానికి ఆసియా – పసిఫిక్ , ఆఫ్రికా అండ్ మిడిల్ ఈస్ట్ రీజియన్లోని పీపుల్ ఎక్స్ పీరియన్స్, ఫైజర్ గ్లోబల్ సప్లై సీనియర్ డైరెక్టర్ రేష్మా పరిదా ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి జీఎస్ఎస్ ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ కే.వేదవతి, పీజీఎస్ ఇండియా పీపుల్ ఎక్స్ పీరియన్స్ డైరెక్టర్ టీ.రవికిరణ్ కూడా హాజరయ్యారు.
