18 గ్రామాల్లో వరి విధ్వంసం..

ఆంధ్రప్రభ, గంపలగూడెం (ఎన్టీఆర్ జిల్లా) మొంథా తుఫాన్ వరి,పత్తి,మిరప రైతులను‌ నిండా ముంచేసింది.భారీ వర్షాలకు ఈదురుగాలులు తోడవ్వడంతో పంటనష్టం మరింత పెరిగింది. ఈ తుఫాన్ వలన గంపలగూడెం మండలంలోని 18 గ్రామాలకు చెందిన 3,200 మంది రైతులు తీవ్ర ప్రభావం చూసారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటలు చేతికి అందివచ్చిన సమయంలో నేలపాలు కావడంతో అన్నదాతలు గగ్గోలు పెడుతున్నారు.

చేనుల్లో తీయాల్సిన పత్తి తడిసిపోయి నాణ్యత కోల్పోయింది. ఇప్పటికే అనేక వైరస్ లు వ్యాప్తి చెందగా నివారణ చర్యలు చేపడుతూ జాగ్రత్తగా చివర దశ వరకు తీసుకొచ్చారు. ఒకేసారి ఇలా తుఫాన్ రావడంతో రైతులు కకావికలమయ్యారు. మిరప పూత, పిందె, కాయ దశలోవి బాగా దెబ్బతిన్నాయి. వాటిలో నుండి నీటిని త్వరగా బయటకు పంపితే బ్రతికే అవకాశం ఉంది.ఎకరానికి లక్షకు పైగా పెట్టుబడి పెట్టి ఉండటంతో ఆవేదన చెందుతున్నారు.

ఉన్నతాధికారులు సూచన మేరకు పంట నష్టాన్ని అంచనా వేసేందుకు తహసీల్దార్ వి.రాజాకుమారి, వ్యవసాయ శాఖ అధికారి వి.హరీష్ కుమార్ ఆధ్వర్యంలో క్షేత్రస్థాయిలో సందర్శన చేసారు. సిబ్బంది డ్రోన్ సర్వే చేపట్టి పంట నష్ట అంచనా నమోదు చేసి నివేదికను సిద్ధం చేశారు. ఆ నివేదికను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉన్నతాధికారులకు పంపిస్తున్నారు. మొత్తం 2310 హెక్టార్లకు గాను వరి 850 హెక్టార్లు,పత్తి 1430 హెక్టార్లు, మినుములు 30 హెక్టార్లవి దెబ్బతిన్నాయని ఏవో హరీష్ కుమార్ తెలిపారు.

20 ఎకరాలు సాగు చేసా… ఎం.సుందరరావు, రైతు, దుందిరాలపాడు

ఆరుగాలం కష్టించిన కష్టానికి పెట్టుబడి సైతం ఫలితం లేకుండా పోయింది.ఇప్పటికే పలు వర్షాలు రావడంతో కొంత నష్టాల్లోకి వెళ్ళాము.ఇప్పుడు ఈ మొంథా తుఫాన్ తో పూర్తిగా నష్టపోయాము.మొత్తం ఇరవై ఎకరాల్లో పది ఎకరాలు మిరప,పది ఎకరాలు పత్తి సాగు చేసాను.మిరప మొక్క ఒరిగిపోయి,పూత రాలింది.చేతికి వచ్చిన పత్తి తీసే కూలీలు లేక అలానే ఉంచాను.అధిక తేమ వల్ల దూది రంగు మారిపోయింది.యాభై క్వింటాలు దెబ్బతినడంతో సుమారు ఆరు లక్షలు నష్టం వాటిల్లింది.ప్రభుత్వం నుండి వెంటనే నష్టపరిహారం అందాలని వేడుకుంటున్నాం.

అధికారి రాలేదు : చింతలపాటి వెంకట కృష్ణారావు,రైతు,గాదెవారిగూడెం

మొత్తం ఎనిమిది ఎకరాల్లో ఐదు ఎకరాలు మిరప,మూడు ఎకరాలు పత్తి సాగు చేసాను.మిరప మొక్క ఒరిగిపోయి పూత రాలిపోయింది.మరలా కొత్త మొక్క వేయాల్సి ఉంది.పత్తి తీత దశలో ఉండగా కూలీలు అందుబాటులో లేక తీయలేదు.మొత్తం మిరపలో ఐదు లక్షలు,పత్తిలో అరవై వేలు నష్టం వాటిల్లింది.ఇప్పటివరకు ఉద్యానవన శాఖ అధికారి పరిశీలనకు రాలేదు.అధికారులు నష్ట అంచనా నమోదు సమర్థవంతంగా చేసి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలి.ప్రభుత్వం జాప్యం చేయకుండా నష్టపరిహారం అందజేయాలి.

Leave a Reply