Paadi Parisrama | మహిళల పాత్ర కీలకం..

Paadi Parisrama | మహిళల పాత్ర కీలకం..
Paadi Parisrama, చిట్టినగర్, ఆంధ్రప్రభ : విజయవాడ కృష్ణా మిల్క్ ఫ్యాక్టరీ ఆవరణలో జాతీయ రైతు దినోత్సవాన్ని ఛైర్మన్ చలసాని ఆంజనేయులు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా పాడి రైతులకు ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణా మిల్క్ యూనియన్ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు మహిళా పాడి రైతులగు మంగళాపురం మహిళా సంఘ అధ్యక్షురాలు ఎస్. నాగేంద్రమ్మ, పాడి రైతులు కె. కనకదుర్గా, జె. భవాని, కె. నాగమణిలను శాలువాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా చలసాని ఆంజనేయులు మాట్లాడుతూ.. చౌదరి చరణ్ సింగ్ జయంతిని జాతీయ రైతు దినోత్సవంగా నిర్వహిస్తున్నామని, చరణ్ సింగ్ రైతులను దేశ ఆర్థిక వ్యవస్థకు కేంద్రంగా నిలిపిన నాయకులని కొనియాడారు. ఆయన పంటలకు న్యాయమైన ధరలు, తక్కువ వడ్డీ రుణాలు, గ్రామీణ అభివృద్ధికి ప్రాధాన్యం ఇచ్చి రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరచేందుకు కృషి చేశారని తెలిపారు.
రైతుల స్వాభిమానాన్ని కాపాడుతూ వ్యవసాయాన్ని దేశాభివృద్ధికి పునాదిగా నిలిపారు అని స్మరించారు. పాడి రంగంలో మహిళల పాత్ర అత్యంత కీలకమని, వారి నిరంతర కృషి వల్లే గ్రామీణ ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతోందని పేర్కొన్నారు. పాడి రైతులకు సమితి అందిస్తున్న సాంకేతిక వనరులతో పశు సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా వినియోగించుకుని తమ ఆదాయాన్ని మరింత పెంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సమితి మేనేజింగ్ డైరెక్టర్ కొల్లి ఈశ్వర బాబు, సమితి బోర్డ్ డైరెక్టర్ వేమూరి సాయి, వెంకట రమణ, సమితి అధికారులు పాల్గొన్నారు.
