వాజేడు, జులై 7 (ఆంధ్రప్రభ) : మనది రైతు ప్రభుత్వమని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) అన్నారు. ములుగు జిల్లా వాజేడు, వెంకటాపురం, కన్నాయిగూడెం మండలాల్లో నష్టపోయిన మొక్కజొన్న రైతులకు నష్టపరిహారం చెక్కులు పంపిణీ కార్యక్రమంలో మంత్రి తుమ్మల పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ… మొక్కజొన్న రైతులు పంట నష్టం జరిగిందని తెలిసిన వెంటనే ములుగు జిల్లా కలెక్టర్ టిఎస్ దివాకర్ (Collector T.S. Diwakar) కు ఫోన్ చేసి ఎంతమంది రైతులు నష్టపోయారు అధికారులతో విచారణ జరిపి వెంటనే చర్యలు తీసుకోవాలని ఈ విషయంలో నీకు అండగా నేనుంటానని ధైర్యం చెప్పడం జరిగిందన్నారు. ఐదు నెలల కాలంలోనే అన్ని విధాలుగా చర్యలు చేపట్టి మల్టీనేషనల్ కంపెనీ చేత 950మంది రైతులకు నష్టపరిహారం చెక్కులను అందజేయడం జరుగుతుందన్నారు.
మనది రైతు ప్రభుత్వం కనుకే రైతుల పక్షాన నిలబడి రైతులకు నష్టపరిహారం వచ్చే విధంగా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. త్వరలోనే రైతులకు అన్యాయం జరగకుండా రైతు చట్టం తీసుకురాబోతున్నామన్నారు. గత ప్రభుత్వం హయాంలో రైతులకు తీరని అన్యాయం జరిగిందని, వ్యవసాయానికి ముందే రైతులకు రైతు భరోసా పథకం కింద రైతు పెట్టుబడి సాయం అందించడం జరిగిందన్నారు. రైతును రాజు చేయడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యమని, అందుకోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు. ఈ ఏజెన్సీ ప్రాంతం అంటే తమకెంతో మక్కువ అని, ఏజెన్సీ ప్రాంతంలోని రహదారులు మెరుగు పరుస్తూ అభివృద్ధికి దోహదపడతాయని, ఆనాడే లోటపేట గండి నుండి భద్రాచలం వరకు రహదారులు వంతెనలు నిర్మించడం జరిగిందన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేస్తున్న పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్కకు అండగా నిలబడతానని ఆయన అన్నారు.
దళారులను నమ్మి మోసపోవద్దు .. సీతక్క
ఏజెన్సీ ప్రాంతంలోని రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని, మల్టీనేషనల్ కంపెనీలు ఇచ్చే విత్తనాలు వ్యవసాయ శాఖ అధికారులతో పరిశీలన జరిగిన తర్వాతనే రైతులు వ్యవసాయం మొదలుపెట్టాలని, దళారులు చెప్పే మాయమాటలు నమ్మి మోసపోవద్దని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క (Minister Sitakka) అన్నారు. రైతులకు న్యాయం చేయాలని నష్టపరిహారం చెక్కుల పంపిణీ కార్యక్రమం చేపట్టడాన్ని ఓర్చుకోలేక టీఆర్ఎస్ పార్టీ అడ్డుకునే ప్రయత్నాలు చేస్తుందంటే రైతుల పక్షాన వారికి చిత్తశుద్ధి లేదని అర్థమవుతుందని ఆమె అన్నారు. ప్రజా ప్రభుత్వం చేపడుతున్న అనేక సంక్షేమ కార్యక్రమాలను అడ్డుకొని నిందలు వేయాలని చూస్తుందన్నారు. ఎవరె ప్రయత్నాలు చేసినా ములుగు జిల్లా అభివృద్ధిని ఎవరూ అడ్డుకోలేరని ఆమె అన్నారు.

ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేసి పేద ప్రజలకు గూడును అందించాలని చూస్తుంటే టీఆర్ఎస్ పార్టీ ఓర్చుకోలేకపోతుందన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల అభివృద్ధే ద్వేయంగా పనిచేయడం జరుగుతుందన్నారు. ఎంతో కష్టపడి రైతులకు నష్టపరిహారం అందించడంలో కీలక పాత్ర పోషించిన ములుగు జిల్లా కలెక్టర్ పీఎస్ దివాకర్ ను అభినందించారు. నష్టపోయిన మొక్కజొన్న రైతులకు నష్టపరిహారం చెక్కులను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మంత్రి సీతక్క చేతుల మీదుగా రైతులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణా వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం.కోదండరెడ్డి, తెలంగాణా విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ ఎస్.అన్వేష్ రెడ్డిలకు జిల్లా కలెక్టర్ దివాకర టి.ఎస్., మాజీ ఎమ్మెల్సీ బాలస్వామి లక్ష్మీనారాయణ, తదితరులు పాల్గొన్నారు.