కర్నూలు బ్యూరో, జులై 21, ఆంధ్రప్రభ : కర్నూలు జిల్లా, ఓర్వకల్లు విమానాశ్రయం (Orvakallu Airport) నుంచి రాష్ట్ర రాజధాని (అమరావతి) విజయవాడ (Vijayawada) కు ప్రతి రోజు విమాన సర్వీస్ ఏర్పాటు చేయాలని, విజయవాడకు వెళ్లే విమాన ప్రయాణికులకు అనువుగా సమయ మార్పులు చేయాలని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి (Byreddy Sabari) కోరారు. ఓర్వకల్లు విమానాశ్రయంకు గతంలో కేంద్ర ప్రభుత్వం హామీ మేరకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు పెట్టాలని కోరగా, త్వరలో అధికారిక ప్రకటన చేస్తామని కేంద్ర ఫౌర విమానాయశాఖ మంత్రి హామీ ఇచ్చినట్లు బైరెడ్డి శబరి తెలిపారు.
సోమవారం ఢిల్లీలో కేంద్ర పౌర విమానాయ శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు (Kinjarapu Rammohan Naidu) ను ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి కలసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాట్లాడుతూ.. రాయలసీమ ప్రజల ఆకాంక్ష మేరకు దేశంలోనే బ్రిటిష్ పాలకులపై తొలి తిరుగుబాటు నాయకుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరు ఓర్వకల్లు (కర్నూలు ) ఎయిర్‌పోర్ట్ కు పెట్టాలని, అలాగే నైట్ ల్యాండింగ్ సదుపాయం కల్పించాలని, ఓర్వకల్లు (కర్నూలు ) నుంచి విజయవాడ డైలీ విమాన సర్వీస్ ఏర్పాటు చేయాలని, విజయవాడ విమానానికి ప్రయాణికులకు అనువుగా సమయ మార్పు చేయాలని, కొత్త మార్గం చెన్నై – తిరుపతి – ఓర్వకల్లు (కర్నూలు ) (సోమవారం నుంచి శుక్రవారం ) చెన్నై విమాన సర్వీస్ కొనసాగించాలని కేంద్ర ఫౌర విమానాయ శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడుకు వివరించడం జరిగిందని, అన్నింటినీ దృష్టిలో ఉంచుకొని తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్లు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి చెప్పారు.