భారీ ట్రాఫిక్ జామ్ అంటూ ప్రచారం

భారీ ట్రాఫిక్ జామ్ అంటూ ప్రచారం
వాస్తవాలు వెల్లడించిన ట్రాఫిక్ పోలీసులు..
విజయవాడ క్రైమ్, ఆంధ్రప్రభ : విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్ద గురువారం భారీగా ట్రాఫిక్ నిలిచిపోయిందంటూ కొన్ని సోషల్ మీడియా వేదికలు, ఆన్‌లైన్ వార్తా మాధ్యమాల్లో వార్తలు ప్రచారం అయ్యాయి. ముఖ్యంగా అరగంట పైగా నిలిచిపోయిన వాహనాలు అంటూ ప్రచారం జరగడంతో వాహనదారుల్లో ఆందోళన వ్యక్తమైంది. అయితే ఈ ప్రచారంపై విజయవాడ ట్రాఫిక్ పోలీసులు స్పందిస్తూ వాస్తవాలను వెల్లడించారు.
గురువారం నగరంలో జరిగిన కొన్ని వి.ఐ.పీ కార్యక్రమాల నేపథ్యంలో కొన్ని ప్రధాన జంక్షన్ల వద్ద కొద్దిసేపు మాత్రమే ట్రాఫిక్ మందగించినట్లు తెలిపారు. ట్రాఫిక్ నిర్వహణలో ఉపయోగించే “అస్త్రం” అప్లికేషన్ గణాంకాల ప్రకారం నేతాజీ జంక్షన్ వద్ద ఉదయం 11:10 నుండి 11:15 గంటల వరకు, బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్ వద్ద 11:45 నుండి 11:55 గంటల వరకు, ఎనికేపాడు వద్ద 11:40 నుండి 11:55 గంటల వరకు మాత్రమే స్వల్ప ట్రాఫిక్ రద్దీ నమోదైనట్లు అధికారులు స్పష్టం చేశారు.
పరిస్థితిని గుర్తించిన వెంటనే ట్రాఫిక్ పోలీసులు తక్షణ చర్యలు తీసుకుని ట్రాఫిక్‌ను సమర్థవంతంగా నియంత్రించి స్వల్ప సమయంలోనే క్లియర్ చేసినట్లు తెలిపారు. ట్రాఫిక్ పోలీసుల సమన్వయం వల్ల వాహనదారులకు ఎక్కువసేపు ఇబ్బందులు కలగకుండా పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చినట్లు వివరించారు.
