ఒకరి మృతి, ఒకరికి తీవ్ర గాయాలు..

కొత్తగూడ, (ఆంధ్రప్రభ): మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పెగడపల్లె సమీపంలోని బంగారుకుంట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కలపతో నిండిన బొల్లోరా వాహనం, ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను బలంగా ఢీకొట్టడంతో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది.

ఈ ఘటనలో బొల్లోరా వాహనం వెనుక కూర్చున్న బండారి వెంకటయ్య (54, కర్ణగండి గ్రామం) అక్కడికక్కడే మృతి చెందారు. బొల్లోరా డ్రైవర్ యాప సందీప్ (సాదిరెడ్డిపల్లి గ్రామం) కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. మరోవైపు, ప్రమాద తీవ్రతకు ట్రాక్టర్ డ్రైవర్ వాహనంలోనే ఇరుక్కుపోయాడు.

ప్రమాదంపై సమాచారం అందుకున్న ఎస్.ఐ. రాజ్ కుమార్ తమ సిబ్బందితో కలిసి వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. ట్రాక్టర్‌లో ఇరుక్కుపోయిన డ్రైవర్‌ను, అలాగే గాయపడిన బొల్లోరా డ్రైవర్‌ను మరో ట్రాలీ సహాయంతో బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు.

అక్రమ కలప రవాణా కోణం?

ఇదిలా ఉండగా, ప్రమాదానికి గురైన బొల్లోరా వాహనంలో విలువైన టేకు కలపను తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. మృతుడు కూలీగా పనిచేస్తున్నట్లు తెలుస్తుండగా, ఈ కలప అక్రమ రవాణా వెనుక ఉన్న అసలు వ్యక్తులు ఎవరు? అనే దానిపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Leave a Reply