On Duty | ప్లాస్టిక్ బకెట్లలో భోజన ఏర్పాట్లు
- డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో అధికారుల నిర్లక్ష్యం
- పోలింగ్ సామాగ్రిలో నాణ్యతకు తిలోదకాలు
- భోజన ఏర్పాటులో కక్కుర్తి
- వాహనాలు లేక పోలింగ్ సిబ్బంది అగచాట్లు
- కలెక్టర్ దృష్టి పెట్టాలని కోరిన ఉద్యోగులు
On Duty | జనగామ, ఆంధ్రప్రభ : మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనపడింది. డిస్ట్రిబ్యూషన్(Distribution) కేంద్రాల్లో సమస్యలు, భోజన ఏర్పాట్లలో లోపాలు, పోలింగ్ అనంతరం సిబ్బంది వెళ్లేందుకు సరైన వాహనాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
వివరాల్లోకి వెళ్తే….జనగామ జిల్లాలోని ఐదు మండలాల్లో జరిగిన మొదటి దశ పంచాయతీ ఎన్నికల సందర్భంగా డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో అధికారుల నిర్లక్ష్యం వల్ల పోలింగ్ కు కావలిసిన కొన్ని వస్తువులు కనిపించకపోవడం, మరికొన్ని వాటి నాణ్యత పై అనుమానాలు వ్యక్తం అయ్యాయి.
బుధవారం డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల్లో పోలింగ్ సిబ్బంది(polling staff) ఉదయం ఎనిమిది గంటలకు రిపోర్ట్ చేయాలని ఆదేశించిన అధికారులు వారికి సరైన టిఫిన్ ఏర్పాటు చేయలేదని అలాగే మధ్యాహ్నం భోజనం కూడా అధ్వానంగా ఉందని, ప్లాస్టిక్(plastic) బకెట్లలో వడ్డించినప్పటికీ అవి నాణ్యతగా లేవని చాలామంది ఉద్యోగస్తులు తినకుండా వెళ్లిపోయారని పలువురు తెలిపారు.
జిల్లా కలెక్టర్ సందర్శించినప్పటికీ కింది స్థాయిలో ఎలాంటి జవాబుదారితనం లేకపోయిందని పలువురు తెలిపారు. పోలింగ్ సామాగ్రిలో కొన్ని వస్తువులు కనిపించకపోవడం ఓటు వేసే స్వస్తిక్ గుర్తుతో ఓటు వేసే ప్రయత్నించిన అది ముద్రింపక పోవడం జరిగిందని, పోలింగ్ ఏజెంట్ల గుర్తింపు కార్డుల బదులు పేపరు పత్రాలు ఇచ్చారని పలువురు తెలిపారు.
ఇక పోలింగ్ పూర్తయిన తర్వాత కౌంటింగ్ ప్రారంభించడంలో సరైన చర్యలు తీసుకోకపోవడంతో ఆలస్యంగా ప్రారంభమైందని, ఇక పూర్తయ్యేసరికి రాత్రి గడిచిపోయిందని ,గ్రామాల నుండి మండల కేంద్రంలోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రంలో సామాగ్రి అప్పగించిన అనంతరం తిరిగి వెళ్లేందుకు సరైన రవాణా సౌకర్యాలు(transportation facilities) లేక పోలింగ్ సిబ్బంది తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇక మహిళా ఉద్యోగులు అయితే రాత్రి 12, ఒంటి గంట వరకు బస్సుల కోసం వెయిట్ చేయడం కనిపించింది.
పోలింగ్ జరిగిన మండలాలు గాక ఇతర మండలాల్లోని ఉద్యోగులను ఎన్నికల విధుల(election duties)కు కేటాయించగా వారు ఎలా వెళ్తారని అధికారులు ఆలోచించకపోవడం విడ్డూరంగా ఉందని పలువురు తెలిపారు. తీవ్రమైన చలికాలం కావడంతో మరిన్ని ఇబ్బందులు ఏర్పడ్డాయని పలువురు తెలిపారు.
ఎన్నో ఇబ్బందులు పడి ఎన్నికల విధులు నిర్వహించినప్పటికీ మరుసటి రోజు ఆన్ డ్యూటీ(On Duty) కొంతమంది ఉద్యోగులకు ఇచ్చి మరి కొంత మందికి ఇవ్వకపోవడం సరికాదని ఈ విషయంలో జిల్లా కలెక్టర్ పరిశీలించి ఇలాంటి ఇబ్బందులు రెండవ, మూడవ దశ ఎన్నికలకు ఎదురవకుండా ఏర్పాట్లు చేయాలని పలువురు ఎన్నికల సిబ్బంది కోరారు.

