- నేను డిప్యూటీ సీఎం అని మర్చిపోయా..
‘ఖుషి’ సినిమా రిలీజ్ సమయంలో చూసిన ఉత్సాహం, జోష్ మళ్ళీ ఇప్పుడు ‘ఓజీ’ సినిమా ప్రీ-రిలీజ్ వేడుకలో కనిపించిందని పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ అన్నారు. సుజీత్ దర్శకత్వంలో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మిస్తున్న ‘ఓజీ’ (OG) ప్రీ-రిలీజ్ వేడుక హైదరాబాద్‌లోని ఎల్.బి. స్టేడియంలో అభిమానుల కోలాహలం మధ్య ఘనంగా జరిగింది.
ఈ వేడుకకు సినిమా బృందంతో పాటు, ప్రముఖ సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తాను పాడిన ‘వాషి యో వాషి’ పాటను లైవ్‌లో పాడి అభిమానులను అలరించారు. అలాగే, ‘ఓజీ’ ట్రైలర్‌ను కూడా విడుదల చేయడంతో అభిమానుల ఆనందం రెట్టింపు అయింది.
పవన్ కళ్యాణ్ ప్రసంగం నుండి కొన్ని ముఖ్యాంశాలు:
సినిమా కాస్ట్యూమ్స్‌తో వేదికపైకి రావడం ఇదే మొదటిసారి అని పవన్ కళ్యాణ్ తెలిపారు. “సినిమాలో వేసుకునే కాస్ట్యూమ్స్‌తో నేను ఎప్పుడూ ఇలాంటి వేడుకలకు రాలేదు. దర్శకుడు సుజీత్ కోరిక మేరకు, మొదటిసారి ఇలా వచ్చాను. ఇదంతా అభిమానుల కోసమే” అని అన్నారు.
‘వాషి యో వాషి’ పాట గురించి మాట్లాడుతూ, “ఈ పాట ఒక జపనీస్ హైకూ. విలన్‌తో ‘నువ్వు ఎంత ఎత్తులో ఉన్నా నిన్ను నేలకు దించుతాను’ అని హీరో చెప్పే సందర్భంలో ఈ హైకూ వస్తుంది. ఓజీతో పెట్టుకుంటే మరణం ఎంత భయంకరంగా ఉంటుందో ఈ పాట ద్వారా చూపించాం” అని వివరించారు.
దర్శకుడు సుజీత్ గురించి మాట్లాడుతూ, “అతను నా వీరాభిమాని. కథను చాలా సింపుల్ గా చెబుతాడు, కానీ సినిమా తీసేటప్పుడు అతని ప్రతిభ తెలుస్తుంది. ఈ సినిమాకి ఇద్దరు స్టార్లు ఉన్నారు మొదటివారు సుజీత్, రెండోవారు సంగీత దర్శకుడు తమన్. వీరిద్దరూ ఒక మాయలోకి వెళ్ళిపోయి, నన్ను కూడా ఆ మాయలోకి లాగేశారు. నేను డిప్యూటీ సీఎం అని మర్చిపోయా.. సినిమాలోని ప్రతి అంశం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది” అని ప్రశంసించారు.
హీరోయిన్ ప్రియాంక మోహన్ పాత్రపై మాట్లాడుతూ, “ఈ సినిమాలో ఆమె 80వ దశకం నాటి హీరోయిన్‌లా కనిపిస్తారు. సినిమాలో మా ఇద్దరి మధ్య అనుబంధం తక్కువసేపే ఉన్నప్పటికీ, చాలా హృద్యంగా ఉంటుంది. తక్కువ నిడివిలో ఇంత చక్కని ప్రేమకథను చూపించడం సుజీత్ ప్రత్యేకత” అన్నారు.
తన రాజకీయ ప్రయాణంపై పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, “సినిమాలు వదిలేసి నేను రాజకీయాల్లోకి వెళ్ళిపోయినా, మీరు నన్ను వదల్లేదు. మీరే నాకు భవిష్యత్తుని ఇచ్చారు. మీరిచ్చిన బలంతోనే ఇప్పుడు ప్రజల కోసం పోరాడుతున్నాను. నేను సినిమా ప్రేమికుడిని. సినిమా చేసేటప్పుడు సినిమా తప్ప వేరే ఆలోచన ఉండదు, అలాగే రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయాలు తప్ప వేరే ఆలోచన ఉండదు” అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ, “మనం పవన్ కళ్యాణ్‌ను ఎలా చూడాలని అనుకుంటామో, సుజీత్ అలా చూపించబోతున్నాడు” అని అన్నారు.
ఈ వేడుకలో హీరోయిన్ ప్రియాంక మోహన్, శ్రియా రెడ్డి, ఇమ్రాన్ హష్మీ, అర్జున్ దాస్, నిర్మాతలు అల్లు అరవింద్, దిల్ రాజు, వై. రవిశంకర్, కోన వెంకట్ తదితరులు పాల్గొన్నారు. వీరంతా ‘ఓజీ’ సినిమా ఘన విజయం సాధించాలని ఆకాంక్షించారు.
వర్షంలోనూ జోష్ తగ్గని అభిమానులు
ఓజీ ప్రీ-రిలీజ్ కన్సర్ట్ వర్షంతో అంతరాయం కలిగింది. వేదికపై గొడుగుల కింద నిలబడి పవన్ కళ్యాణ్ తన ప్రసంగం కొనసాగించగా, అభిమానులు మాత్రం వర్షాన్ని పట్టించుకోకుండా స్టేడియంలో నిలబడి రెట్టించిన ఉత్సాహంతో హర్షధ్వానాలు చేశారు.
తీవ్ర వర్షం కారణంగా ఈవెంట్ ఎక్కువసేపు కొనసాగకపోయినా, స్టేడియంకు తరలివచ్చిన అభిమానులలో పవన్ కళ్యాణ్ జోష్ నింపారు. వర్షం వల్ల కొంత నిరాశ మిగిలినా, అభిమానులు తమ ప్రియతమ హీరోని ప్రత్యక్షంగా చూడగలిగిన ఆనందంతో ఉత్సాహంగా కార్యక్రమాన్ని ముగించారు.

