నిలువ నీడ లేదు..

నిలువ నీడ లేదు..

  • గజం భూమి లేదు.. బతికేదెట్టా..?
  • పాంనూరు కాశివాడలో 8 కుటుంబాల దీనస్థితి
  • ఐకేపీ కేంద్రం కోసం పేదల నివాసాల తొలగింపు చర్యలు
  • అధికారులతో వాగ్వాదం, పెట్రోల్ పోసుకుని బాధితుడి ఆత్మహత్యాయత్నం..
  • రాళ్ల భూమిని సొంత ఖర్చుతో సర్దుకున్న కుటుంబాలు
  • మేం ఇప్పుడు రోడ్డున పడే పరిస్థితి అంటూ ఆవేదన
  • ఎమ్మెల్యే మా దిక్కు అంటూ లబోదిబోమంటున్న భాధిత కుటుంబాలు

స్టేషన్ ఘన్ పూర్, ఆంధ్రప్రభ : స్టేషన్ ఘన్‌పూర్ మండలం పాంనూరు గ్రామంలోని కాశివాడ కాలనీలో పేద కుటుంబాల జీవితం దిక్కుతోచని స్థితిలో పడింది. 194 సర్వే నెంబర్ గల ప్రభుత్వ భూమిలో కొన్నేళ్లుగా నివసిస్తున్న సుమారు 8 కుటుంబాలు ఇప్పుడు అకస్మాత్తుగా ఖాళీ చేయాల్సిన పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. మొత్తానికి ఒక చిన్న నిర్ణయం పేద కుటుంబాల జీవితాలను తలకిందులు చేసే పరిస్థితికి చేరుకుంది. ప్రభుత్వ భూమిలో ఖాళీ స్థలాన్ని వినియోగించాలనే ఆలోచనతో ప్రారంభమైన చర్యలు ఇప్పుడు పేదల బతుకుల పై ఎంతటి ప్రభావం చూపుతుందో ఈ ఘటన స్పష్టంగా కనబడుతుంది..

  • టీడీపీ హయాంలోనే పలువురికి పట్టాల పంపిణి:
    గతంలో టీడీపీ హయాంలో ఇదే సర్వే నంబర్‌లో పలువురికి ప్లాట్ పట్టాలు ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే మిగిలిన ఖాళీ భూమిలో కొన్నేళ్ల క్రితం సుమారు 8 పేద కుటుంబాలు రేకుల షెడ్లు నిర్మించుకొని జీవిస్తున్నారు. జీవనోపాధి కోసం కష్టపడుతూ తమ శక్తి మేరకు రాళ్లు, బండరాళ్లు ఉన్న భూమిని లక్షలు ఖర్చు పెట్టి నివసించడానికి అనుకూలం గా మార్చుకున్నారు. జీవనోపాధి కోసం కష్టపడే ఈ కుటుంబాలు ఏళ్లు గా అక్కడే జీవనం సాగిస్తున్నాయి.
  • ఐకేపీ కేంద్రం ఏర్పాటుతో పరిస్థితి మారిపోయింది:
    ఇటీవల గ్రామస్తులు ఐకేపీ కేంద్రం ఏర్పాటు చేయాలని గ్రామంలో జరిగిన ఓ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేను కోరడంతో పరిస్థితి మారిపోయింది. వెంటనే స్పందించిన ఎమ్మెల్యే తహసీల్దార్‌ స్వప్నకు ఆదేశాలు జారీ చేయగా, వారు స్థలాన్ని పరిశీలించారు. ఆ స్థలంలో నివాసాలు అక్రమంగా ఉన్నాయని తేల్చింది. సంబందింత రెవిన్యూ అధికారులు, పోలీస్ అధికారులతో కలిసి తహసీల్దార్ బుధవారం తొలగింపు చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో పోలీస్, రెవెన్యూ అధికారులకు అక్కడ నివసిస్తున్న పేద కుటుంబాల మధ్య ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. సాయం త్రం వరకు నచ్చజెప్పినా వినకపోవడంతో బలవంతంగా జేసీబీతో అక్ర మ నిర్మాణాలను తొలగించేందుకు అధికారులు ప్రయత్నించగా హిమాం బీ అనే మహిళ జేసీబీ కు అడ్డుగా నిలబడి తీవ్రంగా నిలదీసింది.

కాగా ప్రభుత్వ భూమిలో అక్రమంగా బాత్రూమ్ నిర్మాణం చేసుకున్నాడని దానిని కూల్చివేసేందుకు అధికారులు యత్నించగా ఆ ఇంటి యజమాని అయిన షఫిర్ వారిని అడ్డుకొని తమ బాత్రూమ్ ను ధ్వంసం చేయవద్దు. లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ ఒంటి పై డీజిల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించడం సంఘటనను మరింత తీవ్రతరం చేసింది. దింతో వెంటనే అక్కడ ఉన్న ఎస్ఐ వినయ్ కుమార్ బాటిల్ లాక్కొని అతడిపై నీళ్లు పోశారు. దీంతో భాదితులు ఏర్పాటు చేసుకున్న గడ్డి వాములు, చిన్న చిన్న నిర్మాణాలను తొలగించారు. దీంతో అక్కడ పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. అనంతరం అధికారులు మూడు రోజుల గడువు ఇచ్చి వెనుదిరిగారు. ఈ విషయంపై తహసీల్దార్ స్వప్నను వివరణ అడుగగా.. ప్రభుత్వ స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా ఎవరు నిర్మాణాలు చేసిన తొలగించి తీరుతామని ఆమె హేచ్చరిం చారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐలు సతీష్, శ్రీకాంత్, సర్వేయర్ నర్మదా, ఇతర పోలీస్ సిబ్బంది ఉన్నారు.

-ఇల్లు లేదు…గజం భూమి లేదు…ఎక్కడికి వెళ్లాలి?..(బాధితురాలు షేక్ హిమాంబి)
ఆంధ్రప్రభతో బాధితురాలు షేక్ హిమాంబి కుటుంబ కథ కన్నీరు తెప్పించేలా ఉంది. ఇద్దరు కుమారులు ఉన్నత చదువులు చదివినా ఆర్థికంగా లేకపోవడంతో కుటుంబానికి స్థిరమైన ఆదాయం లేదు. నాలుగు బర్రె లతో జీవనం సాగిస్తూ దాదాపు కొన్నేళ్లుగా అదే స్థలంలో నివసిస్తున్నారు. తన భర్త మరణించడంతో కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని నెట్టు కొస్తోంది. ఒకే చిన్న షెడ్ లో 9 మంది జీవించడం వారి పరిస్థితిని తెలియజేస్తోంది. మాకు గజం భూమి లేదు… గజం జాగా లేదు… ఉండటానికి కూడా ఇల్లు లేదు. ఐకేపీ పేరుతో మమ్మల్ని రోడ్డు పై పడేస్తున్నారంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

  • మేమెక్కడికి వెళ్లాలి సార్?: (షేక్ మదర్, బాధితుడు )
    మేము ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రాంతం అంతా రాళ్లు, బండరాళ్లతో నిండి ఉండేది..నివాసానికి అసలు పనికిరాని స్థితిలో ఉండేది. మా కష్టా ర్జిత డబ్బుతో సుమారు 7 లక్షల వరకు ఖర్చు పెట్టి మట్టి వేసి, స్థలాన్ని మేమే సర్దుబాటు చేసుకుని నివాసయోగ్యంగా మార్చుకున్నాం. ప్రభు త్వ అధికారులు అదే స్థలం ఖాళీ చేయాలని చెబుతున్నారు…మేమెక్క డికి వెళ్లాలి సార్? మా పరిస్థితి చాలా దయనీయంగా మారిందని కన్నీరు పెట్టుకుంటున్నాడు.
  • మూడు రోజుల గడువుతో భయాందోళనలో కుటుంబాలు:
    అక్కడి స్థితిగతులను గమనించిన స్థానిక తహసీల్దార్ చివరకు మూడు రోజుల గడువు ఇచ్చారు. అయితే ఆ తర్వాత ఏమవుతుందో తెలియక బాధిత కుటుంబాలు భయాందోళనలో ఉన్నాయి. మా కోసం ఎవరు నిలబడతారు…ఎమ్మెల్యే మా దిక్కు..అంటూ వారు లబోదిబోమంటు న్నారు. ఒకవైపు గ్రామాభివృద్ధి కోసం ఐకేపీ కేంద్రం అవసరం ఉన్నా, మరోవైపు ఇల్లు లేని పేద కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి రావడం చాలా బాధాకరం. ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు ఈ సమస్యను మానవీయ కోణంలో పరిష్కరించాలని స్థానికులు, గ్రామస్తులు కోరుతున్నారు.

Leave a Reply