మంగ‌పేట‌లో ఎన్నిక‌లు లేవు

ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ ప్ర‌తినిధి, ఆంధ్ర‌ప్ర‌భ : ములుగు జిల్లా (Mulugu District)లో మంగ‌పేట మండ‌లం (Mangapet Mandal) ఈ సారి కూడా ఎన్నిక‌ల‌కు దూర‌మైంది. ఆ మండ‌ల ప్ర‌జ‌లు 14 ఏళ్లు ఓటుకు దూరంగా ఉన్నారు. గిరిజన, గిరిజనేతరుల రిజర్వేషన్ల వివాదం కోర్టులో ఉండ‌డంతో ఈ సారి కూడా ఎన్నిక‌లు నిర్వ‌హించ‌డం లేదు. స్థానిక ఎన్నికల నోటిఫికేష‌న్‌లో మంగపేట ఎన్నికలకు ఎస్ఈసీ మినహాయింపు ఇచ్చింది. కోర్టులో కేసు నడుస్తున్నందున ఎన్నికలు నిర్వహించడం లేదని స్పష్టం చేసింది.

వరంగల్, ఖమ్మం జిల్లాల సరిహద్దులో గోదావరి (Godavari) నది ఒడ్డున ఉన్న మంగపేట మండలంలో 25 గ్రామపంచాయతీలు, 14 మండల పరిషత్ ప్రాదేశిక (ఎంపీటీసీ) నియోజకవర్గాలు, 230 పంచాయితీ వార్డులు ఉన్నాయి. 39,369 మంది ఓటర్లు ఉన్న ఈ మండలం ములుగు జిల్లాలోని అతిపెద్ద మండలం. పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ కోసం 230 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తూ అధికారులు ఎన్నికలకు సన్నాహాలు చేశారు. మండలంలోని గ్రామపంచాయతీలను ఎంపీటీసీలను షెడ్యూల్ కులాలకు రిజర్వు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ గిరిజనేతరులు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేశారు. దీనిపై ఇటీవల సుప్రీంకోర్టు (Supreme Court) మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. గిరిజన గిరిజనేతరుల మధ్య రిజర్వేషన్ల వివాదం నెలకొనడంతో గత 14 సంవత్సరాలుగా ఆ మండలంలో పంచాయతీ ఎన్నికలు జరగలేదు.

2011 నుంచి…
2011 నుండి మంగపేట మండలంలో గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించలేదు. 2014లో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగినప్పటికీ కోర్టు వివాదం కారణంగా గెలిచిన ఎంపీటీసీలు ప్రమాణ స్వీకారం కూడా చేయలేదు. తిరిగి 2019 జనవరిలో జరిగిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా మంగపేట మండలంలో కూడా పంచాయతీ ఎన్నికల (Panchayat elections) నిర్వహణ కోసం పూర్తి ఏర్పాట్లు చేశారు. తెల్లవారితే ఎన్నికలు జరగాల్సి ఉండగా ముందు రోజే న్యాయస్థానం నుండి ఆదేశాలు రావడంతో అప్పుడు ఎన్నికలు నిర్వహించలేదు. దీంతో 14 సంవత్సరాలుగా మంగపేట మండలంలో సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు లేకుండానే ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. ఈసారైనా ఎన్నికలు జరుగుతాయని మండల ప్రజలు ఎంతో ఆశతో ఎదురు చూశారు. అధికార యంత్రాంగం ఎంపీటీసీలు, గ్రామపంచాయతీ వార్డుల విభజన పూర్తి చేసింది. మండలం వారిగా పోలింగ్ స్టేషన్లను ఖరారు చేసింది. సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో ఏర్పాట్లను నిలిపివేసింది. సోమవారం జారీ అయిన ఎన్నికల నోటిఫికేషన్లు కోర్టు వివాదం కారణంగా మంగపేట మండలాన్ని మినహాయింపు ఇవ్వడంతో మరోసారి పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలకు మంగపేట మండలం నోచుకోకుండా పోయింది.

Leave a Reply