- అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా 25మంది కౌన్సిలర్లు
- చైర్ పర్సన్ కు మద్దతుగా కేవలం 11మందే
- చైర్ పర్సన్ కు పదవి గండం అని ముందే చెప్పిన ఆంధ్రప్రభ
శ్రీ సత్యసాయి బ్యూరో, ఏప్రిల్ 23 (ఆంధ్రప్రభ) : శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మున్సిపల్ చైర్ పర్సన్ పై బుధవారం ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. ప్రస్తుత మున్సిపల్ చైర్ పర్సన్ పరికి నజీమున్నీసాకు మద్దతుగా కేవలం 11 మంది కౌన్సిలర్లు ఓటు వేయగా, ఆమెకు వ్యతిరేకంగా 25మంది కౌన్సిలర్లు ఓటు వేశారు. మున్సిపాలిటీలో మొత్తం 36మంది కౌన్సిలర్లు ఉండగా, ప్రస్తుత అధికార పార్టీ టీడీపీ అప్పట్లో గెలిచింది కేవలం ఐదు సీట్లు మాత్రమే. 30స్థానాల్లో వైసీపీ గెలవగా, ఒక స్థానంలో వైసీపీ రెబల్ విజయం సాధించిన తెలిసిందే. అనంతరం 2024ఎన్నికల సందర్భంగా ఏడు మంది కౌన్సిలర్లు టీడీపీలో చేరిపోయారు.
ఎన్నికల అనంతరం సుమారు 14మంది వైకాపా కౌన్సిలర్లు తిరుగుబాటు బావుటా ఎగురవేసి మున్సిపల్ చైర్ పర్సన్ పై అవిశ్వాస తీర్మానానికి మద్దతుగా సంతకాలు సేకరించి జిల్లా కలెక్టర్ కు సమర్పించారు. అవిశ్వాస తీర్మానానికి 24మంది కౌన్సిలర్లు అవసరం ఉండగా అదనంగా మరో ఇరువురు సైతం సంతకాలు చేసి కలెక్టర్ కు సమర్పించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కలెక్టర్ ఆదేశాల మేరకు బుధవారం మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేసి, కదిరి ఆర్డీవో వీవీఎస్ శర్మ ఆధ్వర్యంలో అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు.
అనుకూలంగా 25మంది కౌన్సిలర్లు ఓటు వేయగా, మద్దతుగా కేవలం 11మంది మాత్రమే ఓటు వేశారు. ఇదిలా ఉండగా సుమారు వంద రోజుల క్రితమే కదిరి మున్సిపల్ చైర్ పర్సన్ కు పదవి గండం అంటూ ఆంధ్రప్రభ ముందే ప్రత్యేక కథనం ఇచ్చిన విషయం ఈసందర్భంగా ఆంధ్రప్రభ పాఠకులకు గుర్తుండే ఉంటుంది. అవిశ్వాస తీర్మానం సందర్భంగా మున్సిపల్ కార్యాలయం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.