Nirmala Sitharaman | దేశ గతి మారనుందా?

Nirmala Sitharaman | దేశ గతి మారనుందా?

Nirmala Sitharaman | 2047 వికసిత్ భారత్ లక్ష్యంతో బడ్జెట్ రూపకల్పన
యువ శక్తి బడ్జెట్‌గా అభివర్ణించిన నిర్మలా సీతారామన్
మధ్య తరగతి, పేదలకు ఊరట కలిగించిన నిర్ణయాలు
ఐటీ, డేటా సెంటర్లకు భారీ ప్రోత్సాహం – తెలుగు రాష్ట్రాలకు లాభాలు
రేర్ ఎర్త్ మినరల్స్ కారిడార్‌తో ఏపీకి అవకాశాలు
టైర్–2, టైర్–3 నగరాల అభివృద్ధిపై కేంద్ర ఫోకస్
హైస్పీడ్ రైల్ కారిడార్లతో మారనున్న ప్రయాణ వ్యవస్థ
ఆపరేషన్ సిందూర్ ప్రభావంతో పెరిగిన రక్షణ బడ్జెట్
ఆల్కహాల్, పొగాకు ఉత్పత్తులపై కేంద్రం షాక్
2047 వికసిత్ భారత్ దిశగా బడ్జెట్ సూచనలు

Nirmala Sitharaman | ఆంధ్రప్రభ ; కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ను పార్లమెంట్ లో ప్రవేశపెట్టింది. ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో అనేక కీలక అంశాలున్నాయి. ముఖ్యంగా 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా అనేక నూతన ప్రాజెక్టులు, మౌలిక సదుపాయాలు నిర్మించడంతో పాటు.. కొత్త ఆలోచనలకు తెరలేపింది. ముఖ్యంగా మన దేశ ఆర్థిక వ్యవస్థను మరింత ముందుకు తీసుకువెళ్లడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో.. బడ్జెట్ లో కీలక అంశాలేంటి? ఏయే శాఖలకు ఎంత కేటాయించింది? తెలుగు రాష్ట్రాలకు ఈ బడ్జెట్ వల్ల కలిగే ప్రయోజనమేంటి? ఈసారి ఆపరేషన్ సిందూర్ ప్రభావం బడ్జెట్ పై ఎంతమేరకు కనబరిచింది? అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ బడ్జెట్ ప్రవేశపెడుతూ.. దీన్ని యువ శక్తి బడ్జెట్ గా అభివర్ణించారు. ప్రధాని మోదీ వినూత్న ఆలోచనలే ఈ బడ్జెట్‌కు మూలస్తంభాలని, ముఖ్యంగా పేదలు, అణగారిన వర్గాల సంక్షేమమే ప్రభుత్వ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. నూతనంగా నిర్మాణమైన కర్తవ్య భవన్లో రూపొందించిన మొట్టమొదటి బడ్జెట్ ఇదే అని చెప్పుకోవచ్చు. ప్రభుత్వం తన లక్ష్యాలను చేరుకోవడానికి ప్రభుత్వం ముఖ్యంగా మూడు ప్రధాన కర్తవ్యాలను నిర్ణయించుకుంది. వాటికి ఊతమిచ్చే విధంగా ఈ బడ్జెట్ లో అనేక నిర్ణయాలు తీసుకుంది. ఈ మూడు కర్తవ్యాల్లో మొదటిది దేశ ఆర్థిక వ్యవస్థను వేగంగా, నిలకడగా ముందుకు తీసుకెళ్లడం. రెండవది ప్రజల ఆకాంక్షలను గుర్తించి, వారి నైపుణ్యాలను, సామర్థ్యాలను అభివృద్ధి చేయడం. మూడవది సబ్‌కా సాథ్, సబ్‌కా వికాస్ ను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరికీ అభివృద్ధి ఫలాలను అందించడం. ఈ లక్ష్యాలను సాధించడానికి అనుకూలమైన వాతావరణం అవసరమని పేర్కొంటూ ఆర్థిక ప్రగతికి ఊతమిచ్చేలా సంస్కరణల వేగాన్ని కొనసాగించడం, మూలధన కేటాయింపులను క్రమబద్ధీకరించడం, మెరుగైన రిస్క్ మేనేజ్‌మెంట్ విధానాలను అమలు చేయడం, సుపరిపాలన అందించడానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఇంప్లిమెంట్ చేయడం, అధునాతన టెక్నాలజీని విరివిగా ఉపయోగించడం వంటి అంశాలను ప్రస్తావించారు.

బడ్జెట్ లో మధ్య తరగతితో పాటు పేదలకు కొన్ని కీలక అంశాలను ప్రకటించారు. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ గడువు పొడిగింపుతో పాటు జిల్లాకో లేడీస్ హాస్టల్, మహిళల కోసం గ్రామాల్లో స్టోర్లు వంటి నిర్ణయాలు ఉన్నాయి. ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్ గడవును జూలై 31 వరకు పెంచారు. రిటర్న్స్ దాఖలులో ఏవైనా తప్పులుంటే మార్చి 31 వరకు సరిచేసుకోవచ్చు. ఇక 17 రకాల క్యాన్సర్ మందుల మీద కస్టమ్స్ డ్యూటీ తగ్గించారు. దీనివల్ల త్వరలో క్యాన్సర్ చికిత్స ఖర్చు తగ్గనుంది. ఇక భారత్ నుంచి విదేశాలకు చదువు కోసం కానీ.. టూర్ల కోసం పంపే నగదుపై కట్ అయ్యే పన్ను TCS ను 20శాతం నుండి 2శాతానికి తగ్గిస్తూ బడ్జెట్‌లో నిర్ణయించారు. వాహన ప్రమాదాల్లో బాధితులకు కోర్టు ద్వారా వచ్చే పరిహారం మీద వచ్చే వడ్డీకి ఇకపై ట్యాక్స్ ఉండదు. మహిళా వ్యాపారుల కోసం షీ మార్ట్స్ పేరుతో ఊర్లలో ప్రత్యేక షాపులు ఏర్పాటు చేయనున్నారు.

ఐటీ ఇండస్ట్రీని దేశంలో అభివృద్ది చేయడానిక బడ్జెట్ లో కొన్ని ప్రతిపాదనలు చేశారు. ముఖ్యంగా భారత్‌లో ఏర్పాటు చేయనున్న డేటా సెంటర్లకు కేంద్రం గుడ్ న్యూస్ ప్రకటించింది. 2047 వరకు ట్యాక్సులు కట్టాల్సిన అవసరం లేకుండా బడ్జెట్లో కీలక ప్రకటన చేశారు. విశాఖపట్నంలో గూగుల్ మెగా డేటా సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్‌లోనూ చాలా డేటా సెంటర్లు ఏర్పాటవుతున్నాయి. కేంద్రం చేసిన ట్యాక్స్ హాలిడ్ ప్రకటనతో తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని డేటా సెంటర్లు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. అయితే ఈ సౌలభ్యాన్ని పొందడానికి కంపెనీలు స్థానిక రీసెల్లర్స్ ద్వారా భారత కస్టమర్లకు సేవలు అందించాలనే షరతు విధించింది. 20 ఏళ్లపాటు ట్యాక్స్ హాలీడే ప్రకటించడం ద్వారా.. విశాఖ నగరం మరింతగా డేటా సెంటర్ల కోసం పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉంది. సముద్ర గర్భంలో కేబుల్స్ కనెక్టివిటీ ఉండటంతో విశాఖ నగరం ఇంటర్నేషనల్ డేటా కారిడార్‌గా మారనుంది.

ఇక ప్రస్తుత టెక్నాలజీ యుగానికి కీలకమైన రేర్ ఎర్త్ మినరల్స్ అన్వేషణపై ఫోకస్ పెట్టింది. కేంద్ర బడ్జెట్లో ఏపీ, ఒడిశా, తమిళనాడు,కేరళ రాష్ట్రాల్లో రేర్ ఎర్త్ మినరల్స్ కారిడార్ ఏర్పాటు చేయనున్నారు. దీని వల్ల ఏపీలో పరిశ్రమలు డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఎలక్ట్రిక్ వాహనాల్లో వాడే పర్మనెంట్ మ్యాగ్నెట్లు ఏపీలోనే తయారైతే.. ఆంధ్రప్రదేశ్ ఈవీ తయారీ హబ్‌గా మారనుంది.

వీటితో పాటు టైర్ 2 టైర్ 3 నగరాలను అభివృద్దికోసం చిన్న పట్టణాలను డెవలప్ చేయడంపై కేంద్రం స్పెషల్ ఫోకస్ పెట్టింది. 5 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న పట్టణాలు, నగరాల అభివృద్ధికి కేంద్రం నిధులు అందించనుంది. దీని వల్ల తెలుగు రాష్ట్రాల్లోని విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, గుంటూరు, కర్నూలు, వరంగల్, కరీంనగర్ తదితర నగరాలకు ప్రత్యేక గ్రాంట్లు అందనున్నాయి. టెంపుల్ సిటీలను కూడా అంతర్జాతీయ పర్యాటక కేంద్రాలుగా మార్చాలని కేంద్రం భావిస్తోంది. ప్రధాన ఆలయాలు ఉన్న పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన కోసం కేంద్రం నిధులు మంజూరు చేయనుంది. దీంతో తెలుగు రాష్ట్రాల్లోని పలు టెంపుల్ టౌన్లకు కూడా గ్రాంట్లు లభించనున్నాయి.

ఇక మన దేశంలో హైస్పీడ్ రైల్ కనెక్టివిటీని పెంచేందుకు సైతం కేంద్రం నిధులను అందజేయనుంది. ఇందులో హైదరాబాద్ పేరు కూడా ఉంది. ఏడు నగరాల మధ్య హైస్పీడ్‌ రైల్‌ కారిడార్లు ప్రకటించారు. ముంబై టూ పూణె, పూణె టూ హైదరాబాద్‌, హైదరాబాద్‌ టూ బెంగళూరు, హైదరాబాద్‌ టూ చెన్నై, ఢిల్లీ టూ వారణాసి, వారణాసి టూ సిలిగురి, చెన్నై టూ బెంగళూరు మధ్య ఏడు కారిడార్లను ప్రకటించారు.
మౌలిక సదుపాయాల కల్పనకు 12.2 లక్షల కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. గతేడాది 11.2 లక్షల కోట్లు కేటాయించగా.. ఈసారి స్వల్పంగా పెంచారు. దేశ మౌలికసదుపాయాల కల్పనలో భాగంగానే ఈ కారిడార్లను నిర్మిస్తున్నామని సీతారామన్‌ వెల్లడించారు. వీటిద్వారా ప్రధాన ఆర్థిక, సాంస్కృతిక కేంద్రాల మధ్య అనుసంధానం పెరుగుతుందని చెప్పారు. సుదూర ప్రయాణాల విషయంలో పర్యావరణహితమైన రవాణా వ్యవస్థగా ఈ కారిడార్లు మారుతాయని ఆశాభావం వ్యక్తంచేశారు. ఇవి ప్రయాణ సమాయాన్ని కుదిస్తాయని, రోడ్డు మార్గం, ఇప్పటికే ఉన్న రైలు నెట్‌వర్క్‌లో రద్దీని తగ్గిస్తాయని పేర్కొన్నారు.

ఈ బడ్జెట్ లో ఆపరేషన్ సిందూర్ ప్రభావం గణనీయంగా చూపించిందని చెప్పుకోవచ్చు. భారత్‌కు ఓ వైపు పాక్‌.. మరో వైపు చైనా ఉండగా.. కొత్తగా ఈ శతృకూటమిలో బంగ్లాదేశ్‌ సైతం వచ్చి చేరడంతో రికార్డు స్థాయిలో రక్షణ బడ్జెట్‌ పెరిగింది. ఆపరేషన్‌ సిందూర్‌తో అత్యాధునిక టెక్నాలజీ వెపన్స్ అవసరాలను భారత్‌ గుర్తించింది. దీనికి తగ్గట్లే కేటాయింపులను చేసింది. గతేడాది అన్నింటికి కలుపుకొని.. 6.81లక్షల కోట్లు కేటాయించగా.. ఈ సారి అది 7.85 లక్షల కోట్లకు చేరుకొంది. ఈ సారి మొత్తం బడ్జెట్‌ కేటాయింపుల్లో తమకు 14.68శాతం లభించినట్లు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

ముఖ్యంగా రక్షణ దళాల ఆధునికీకరణకు ఈ బడ్జెట్‌లో పెద్దపీట వేసి 21.84 శాతం కేటాయింపులను పెంచారు. గతేడాది కేవలం 1.8లక్షల కోట్లనే కేటాయించగా.. ఈ సారి దానిని 2.19 లక్షల కోట్లకు చేర్చారు. ఈ బడ్జెట్‌లో ఎయిర్ ఫోర్స్ యుద్ధ విమానాల అవసరాలకు పెద్దమొత్తాన్ని కేటాయించారు. విమాన ఇంజిన్లు, ఎయిర్‌క్రాఫ్ట్‌ల కోసం 63వేల 733 కోట్లు కేటాయించారు. సైన్యం రోజువారీ కార్యకలాపాలు, వేతనాలు, ఇంధనం, రేషన్‌, ఆయుధాల నిర్వహణ, మందుగుండు వంటి వాటి కేటాయింపులను 17.24శాతం పెంచారు. దీంతో దళాల రోజువారీ కార్యకలాపాలు మరింత శక్తిమంతంగా మారనున్నాయి. ఇక పింఛన్ల కోసం కేటాయింపును 6.53శాతం పెంచి 1.71 లక్షల కోట్లకు చేర్చారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదంపై నిత్యం పోరాడే రాష్ట్రీయ రైఫిల్స్‌కు కూడా నిధులను పెంచారు. గత మూడేళ్లతో పోలిస్తే అత్యధికంగా 255 కోట్లు కేటాయించారు. గతేడాది 222 కోట్లు మాత్రమే ఇచ్చారు. రక్షణ రంగంలో రహస్యమైనవిగా భావించే స్పెషల్‌ ప్రాజెక్టులకు కూడా వెయ్యి 989.12 కోట్లు కేటాయించారు. ఇదే సమయంలో ఎయిర్‌ ఫోర్స్‌ ప్రాజెక్టులకు కేటాయింపులు స్వల్పంగా తగ్గి వెయ్యి 618 కోట్లుగా నిలిచింది.

బడ్జెట్ ద్వారా దేశ ప్రజలందరికీ గుడ్ న్యూస్ చెబుతూనే యధావిధిగా మందుబాబులకు కేంద్రం షాక్ ఇచ్చింది. ఆల్కహాల్ సెల్లర్స్, స్క్రాప్, మినరల్స్ నుంచి వసూలు చేస్తున్న ట్యాక్స్ కలెక్టెడ్ యాట్ సోర్స్ ను 2 శాతంగా నిర్ణయించింది. గతంలో ఆల్కహాల్ సెల్లర్స్, స్క్రాప్, మినరల్స్‌పై టీసీఎస్ వివిధ రకాలుగా ఉండేది. కొన్ని సార్లు చాలా ఎక్కువగా ఉండేది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో ఈ రంగాలలోని సెల్లర్స్‌కు మేలు జరగనుంది. ట్యాక్స్ సిస్టమ్ సులభతరం కానుంది. దీంతో మందుబాబులపై ఈ 2 పర్సెంట్ టాక్స్ భారం పడనుంది. కేవలం ఆల్కహాల్ రేట్లు మాత్రమే కాకుండా… సిగరెట్లు, పాన్ మసాలా, పొగాకు ఉత్పత్తులపై భారీగా ప్రభావం పడనుంది. వాటి రేట్లు పెరిగే అవకాశం ఉంది.

మొత్తంగా చూసుకుంటే కేంద్ర బడ్జెట్ దేశ ప్రజలందరికీ శుభవార్త చెబుతూనే వ్యసనపరులకు బాంబు పేల్చుతూ బడ్జెట్ ను ప్రవేవపెట్టింది. దీన్ని బట్టి చూసుకుంటే.. 2047 నాటికి కేంద్రం భావించిన వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా ముందుకు వెళ్తోందని స్పష్టమవుతోంది. అందుకుగానూ మౌలిక సదుపాయాలు, ఐటీ సంస్థలు, డేటా సెంటర్లు, ఏఐ వినియోగం, హైస్పీడ్ రైళ్లు ఇలా అన్నిటిపైనా దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు

Leave a Reply